- పట్టుకోసం ప్రభుత్వ, ప్రతిపక్షాల కసరత్తు
- ఎన్నికల పేరుతో కుటుంబాల మధ్య చిచ్చు
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. యుద్ధ ప్రాతిపదికన ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా ఇష్టపడితేనే ఏకగ్రీవాలని, బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీల ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా యంత్రాగాన్ని ఆదేశించారు. నైతికంగా ఉంటేనే ఆమోదం తెలపాలని సూచించారు.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై “పంచాయితీ”
గ్రామసీమల్లో పట్టు కోసం యత్నాలు:
ఆర్థికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి పల్లెల్లో పాగావేయాలని ప్రభుత్వ, ప్రతిపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు పచ్చని పల్లెల్లో అగ్గి రాజేస్తున్నాయి. ఎంత ఖర్చయినా చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలకు పోతున్నారు. దీంతో అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న వారి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఎన్నికలపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శలు ప్రతివిమర్శలతో పల్లె వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. వీటిని అడ్డుకోవాలని ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇదీ చదవండి: సుప్రీం తీర్పుతో ఏపీలో వేగంగా మార్పులు
కీలకంగా మారిన గ్రామ వాలంటీర్లు:
పంచాయతీ ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లు కీలక భూమిక పోషించనున్నారు. వీరి పనితీరుపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాలంటీర్ల సాయంతో ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికలకు గ్రామ వాలంటీర్లను దూరం పెట్టాలని ఎన్నికల కమిషనర్ కడా ఆదేశించారు. వాలంటీర్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎస్ఈసీ తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సర్కార్ జీవోతో నిమ్మగడ్డ అప్రమత్తం