Wednesday, January 22, 2025

ఓటర్లను కొన్నా, అమ్మినా నేరం. లీడర్లు,మీడియా మోసం చేస్తే నేరం కాదా?

ఎవరు దద్దమ్మలు? ఏం చేద్దాం?

ఏవి నేరాలు? ఏవి కాదు? ఏ విధంగానూ చెప్పలేం కదా. ఫెద్ద పెద్ద పత్రికల పెద్దలు, ఇదివరకు మొదటి పేజీలో తాటికాయలంత పెద్దగా అక్షరాలు ఉంటే అది ఒక్కటే టైటిల్ పేజీ ఉండేది. ఇప్పుడు రెండో మూడో టైటిల్ పేజీలు ఉంటాయి! మొదటి పేజీ ముందు ది హిందూ, ఈనాడు అంటి పెద్ద పత్రికలు కూడా అడ్వర్టయిజ్ మెంట్ ను మొదటి పేజీని అనుకునే మోసపు ప్రకటనలు చేస్తూ ఉంటూ ఉంటే ఇది ఎన్నికల నేరం కాదా; నేను ఎథిక్స్ అనే మాటలు చెప్పడం లేదు. నేరం కాదా అని అడుగుతున్నాను. ఎన్నికల కమిషన్ అడిగే సమయానికి రేపు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మోసం పూర్తయిపోతుంది.  ఫలానా వాడు గెలుస్తున్నాడనే వాడు, చిత్తుచిత్తుగా ఓడిపోతాడని అభిప్రాయ సర్వే ప్రకటనలు మరో దగా మోసపు అనేక రకాలు.

పేపర్లు నమ్మలేరు. మరి మంచి, పెద్ద, లేదా మధ్యతరగతి పత్రికా రచనలు, అంచనాలతో శాస్త్ర పద్ధతిగా ఇదివరకు రాసి వివరించే పాత్రికేయులు ఉన్నారు. విశ్లేషణ చేస్తారు. కాని వినేవారెవరూ లేరు. చదివే వారు అంతకన్నా లేరు. ఇక టివిలు గురించి మాట్లాడకపోవడమే మంచిది. అవన్నీ అమ్ముకునే మార్కెట్ ప్రయత్నాలు. మోసాలు. భక్తి నటించేది కూడా మోసం.

మనకు ఉన్న మీడియా ఏదీ లేదు. చివరకు మిగిలింది బహిరంగ ప్రసంగాలు పెద్ద పెద్ద నేతలు వచ్చి మాట్లాడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, వాడిదీ వీడిదీ తిట్లు వింటూ వింటూ ఉంటున్నాం, తింటున్నాం. నేతల బహిరంగ మీటింగ్ లో లక్షల మంది వచ్చి వినే వారే. ఇప్పడు నవీన మీడియాలు ఇవే. అనేక రకాల మీడియా ద్వారా నేతల బహిరంగ మీటింగ్ లో ఎందరు వచ్చారో ఫేక్ లేదా ఫాల్స్ మాటలా తెలియదు. పత్రికలతో సహా రోజురోజు దాదాపు 50 కోట్లు కొని, అమ్ముకున్నవన్నీ అబద్దాలేవో ప్రత్యేకంగా చెప్పుకోవాల్నా? అవి నిజాలే కాదనిఎవరికి తెలియదు? ఎవరిని నమ్మాలి?

మీడియా మోసాలు

ఎన్నికల్లో లంచం తీసుకుంటే నేరం. రకరకాల మీడియా పద్ధతుల ద్వారా వచ్చిన మోసాలు నేరాలు కావా? ఎన్నికల కమిషన్ ఏమయినా చేసే శక్తి ఉందా? ఎన్నికల కమిషన్ లో పెద్దలను ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కూడ సభ్యుడుగా ఉండే వారితో పీ ఎం, తదితరులు ఉండే చట్టాన్ని సవరించి తెచ్చారు. ఇదొక న్యాయం! అందులో అన్యాయపు చర్యలు తీసుకుంటే ఆ ఛీఫ్ జస్టిస్ గారే, లేదా వారి ధర్మాసనాలు వింటారు. ఇది ఇంకో న్యాయం! ఆ చట్టం ప్రకారం నియమితులైన వారని నమ్మి ఎన్నికల కమిషన్ అనుకుంటూ నిర్ణయాలు చేస్తూ ఉండే  వారే పక్షపాతంగా పనిచేస్తే ఎలా? వారే తీర్పు చెప్పే సుప్రీం న్యాయ మూర్తులు, వారి ప్రధాన మంత్రులు ఇతర మంత్రులు  ఏం చేయగలరు?  ఎవరు నేరగాళ్లు, ఎవరు కాదు?

ఎవరు ఖర్చు చేసినా లంచాలే కదా

లోకసభ ఎన్నికలైనా, శాసనసభ సభ్యులకోసమైనా, చివరకు మునిసిపాలిటీ ఎన్నికల్లోనైనా సరే లంచాలు ఇవ్వడానికి తీసుకోవడానికి భయం లేదు. న్యాయవాదులకోసం చట్టం ద్వారా స్థాపించిన సంఘానికి జరిగే ఎన్నికల్లో గెలవడానికి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. అంతలా తెలిసిన వారు కూడా డబ్బు ఖర్చు చేయకపోతే గెలవరు. అంతగా ఎన్నికల కాలంలో విస్తృతంగా ఖర్చు చేస్తారంటే దాని అర్థం ఏమిటి, లంచాలే కదా? 

ఎవరికిస్తారు ఈ లంచాలు? ముందు పార్టీలో టిక్కెట్లు ఇచ్చే అధికారం, ఫ్రభావం కలిగిన వారికి ఇస్తారు. టిక్కెట్ సంపాదిస్తారు.  తరువాత గెలవడానికి రెండు ప్రతిబంధకాలు. బలీయమైన ప్రత్యర్థి, ఓట్లు ఇప్పించగల సంఘాలు, వ్యక్తులు. వీరికి కూడా లంచాలు ఇస్తారు. అధికారంలో ఉన్నవాళ్లు పదవులు ఇప్పిస్తామని ప్రలోభ పెట్టడం లంచం ఇవ్వడంకన్నా తీవ్రమైనది. ఎన్నికలు, ప్రత్యర్థిని కొనడం, లేదా ఓటర్లకు లంచాలు ఇవ్వడం కన్న విధానమండలి ఎంఎల్సీ లేదా రాజ్యసభ ఎంపీ స్థానం సంపాదించడానికి అధికారంలోఉన్న పార్టీకి ఒకే సారి భారీ ఎత్తున డబ్బు ఇచ్చేస్తే మరీ సులువు. ఇది ఇంకా గొప్పవ్యూహం. ఇట్లా టికెట్టిచ్చి గెలిపించుకోవడం కన్న గెలిచిన అభ్యర్థిని కొనుక్కోవడం ఇంకా సులువు. ఈ రోజుల్లో ఇదే చాణక్యం.

టిక్కెట్ సాధించే దశ నుంచి ప్రచారానికి, ఏకగ్రీవంగా గెలవడానికి, లేదా ఓటర్లకు, మీడియాకు లంచాలు ఇవ్వడానికి బదులు, అబద్దాల ద్వారా లేదా మత కుల ఉద్వేగాలను రెచ్చగొట్టడానికి వ్యూహాలు రచించి గెలవడం సులువు.

ఏదోరకంగా మెజారిటీ సంపాదించిన పార్టీలు ప్రజల మీద ప్రజా ధనం మీద గుత్తాధిపత్యం అయిదేళ్ల పాటు కొనసాగించడం తమ రాజ్యాంగ హక్కు అనుకుంటారు. కనుక ఆ విధంగానే వ్యవహరిస్తారు. ఏ పార్టీ అయినా ఇంతే. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం, ప్రజారాజ్యం, జనసేన, సమాజ్ వాదీ పార్టీ, బహుజనసమాజ్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా…  ఏ పేరయినా చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్లను కూడా చేర్చుకోవచ్చు.

ఈ నేపథ్యంలో లంచాలు ఇవ్వడం నేరమా? అయితే రుజువుచేసి వారి ఎన్నికలు రద్దు చేయించడం, లేదా లంచగొండి అని జైలుకు పంపడం సాధ్యమా? అని మధ్యమధ్య మనం చర్చిస్తూ ఉంటాం. అందరు దొంగలే అనే సినిమా నడుస్తున్నపుడు ఏ దొంగను మరే దొంగ పట్టుకుంటాడు అనేదే థ్రిల్లింగ్ చర్చ, టివి, సోషల్ మీడియా వైరల్ వీడియో.

అందరూ దొంగలే కదా.

ఇదివరకు ఒకానొక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిష్నర్ గారు ఒక విషయం విలేకరుల సమావేశంలోఛెప్పారు. అదేమంటే ఓటర్లు రాజకీయ పార్టీలనుంచి పోటీచేసే వారినుంచి లంచాలు తీసుకుంటే చట్టం ‘‘గుర్తించగల నేరం’’ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్  కాదు అని. లంచాలు ఇవ్వండి తీసుకోండి అని సందేశం ఇవ్వడానికి ఈ ప్రకటన చేయలేదు.  ఒకానొక ప్రశ్నకు జవాబుగా దీన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ గా చట్టంలో నిర్ధారించలేదని చెప్పారు. ఎందుకంటే ప్రత్యర్థులు డబ్బు పంచుతూ ఉంటారని హెచ్చరించారు. ఒక అభ్యర్థి లేదా ఆయన ఏజంట్లు డబ్బు పంచుతుంటే అది నేరమేనా? అవును నేరమే. అయితే వెంటనే కేసు పెట్టవచ్చా? అంటే ఎవరు కేసు పెడతారు? డబ్బు తీసుకున్న ఓటరా, ఇచ్చిన లీడరా? పెట్టరు. తమకు తామే నష్టం చేసుకుంటారా? పోనీ ప్రత్యర్థి తరఫువారు కేసు పెడతారా? వారు కూడా అదే పనిలో చాలా బిజీగా ఉంటారు కదా. తమ గెలుపుకోసం నోట్లకు ఓట్లు పంచాలా లేక, ప్రత్యర్థిమీద కేసులు పెడుతూ కూర్చోవాలా? కనుక ఎవరూ ఫిర్యాదు చేయరు. ఫిర్యాదు చేయకపోయినా నేరం జరుగుతూ ఉంటే పోలీసులు, ఎన్నికల కమిషన్ ఏమీ చేయదా అని సామాన్యుడి ప్రశ్న. దాన్ని కాగ్నిజబుల్ నేరం అని ప్రకటిస్తూ చట్టం సవరించకపోతే అది సాధ్యం కాదు. ఆ విషయం ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పింది. సరికొత్త సర్కారు లు కూడా చెప్పింది. గెలిచే వ్యూహరచయితలు చాణక్యులే కనుక వారు ఆ సవరణ చేయలేదు. అందరూ దొంగలే కదా.

Famous lawyer PP Rao

న్యాయవేత్తస్వర్గీయ పి పి రావుగారు ఏం చెప్పారో తెలుసా

న్యాయవేత్త, సుప్రీంకోర్టు న్యాయవాది,  పద్మవిభూషణ్ స్వర్గీయ పి పి రావుగారు ఒకసారి డిల్లీనుంచి ఎపిలో  వారి సొంత గ్రామానికి వెళ్లారట. అక్కడ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుంటే ఆశ్చర్యపోయారు. గ్రామ సర్పంచ్ పదవి కోసం ఇంత తీవ్రమైన ప్రచారమా? అని ఆశ్చర్యపోయారు. ఆ మరునాడు ఆయన ఉన్న అతిధి గృహానికి ఒక నాయకుడు పిపి రావుగారి ఆశీస్సులకోసం వచ్చారు. ఎవరని అడిగారు. సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడని చెప్పారు. రావుగారు మరోసారి ఆశ్చర్యపోయారు. నిన్న పోటాపోటీగా ప్రచారం చేశారు. అంతలో ఏమైంది? ‘‘పోటీ కొనసాగితే  ప్రచారం కోసం ఓట్లకోసం ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది సార్. అయినా నమ్మకం లేదు గెలుస్తామో లేదో. ఓటర్లకోసం డబ్బు ఖర్చుచేయడం కన్న ప్రత్యర్థికి కావలిసింది ఇచ్చి ప్రశాంతంగా గెలవడం కరెక్టనిపించిందండీ. నాకేమో ఎట్టిపరిస్థితిలో ఈ ఎన్నిక గెలవడం తప్పనిసరి. కనుక… ఆయనతో రాజీ పడ్డానండీ’’ అన్నాడు. ఆ పక్కనే నిన్నటిదాకా తీవ్రంగా పోటీపడిన ప్రత్యర్థి కూడా ఉన్నారు. ‘‘అవును సార్, ఈ సారి గెలవడానికి ఆయనకు సాయం చేయడమే కరెక్టని నాకనిపించిందండి. నేను మరోసారి పోటీ చేసినప్పడు నాకు ఆయన సాయం చేస్తానన్నారు’’ అని వివరించాడు. అంటే దాని అర్థం తెలిసి పోయి ఉంటుంది.

ప్రత్యర్థిని కొనుక్కొని ఎన్నికల పోటీనుంచి విరమింపచేయడం ప్రజాస్వామిక వ్యూహం. డబ్బు పదవి ప్రలోభాలు కూడా లంచాలే అని మనమంతా అనుకుంటాం. కాని ఇవేవీ కోర్టులో రుజువు కావడం కష్టం. ఒకవేళ రుజువులుఉన్నా అయిదేళ్లలో ఎన్నిక రద్దు కావడం సాధ్యం కాదు. కిందికోర్టు పైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చేలోగా రెండు సార్లు ఈయనగారు ఎన్నికయ్యే సదుపాయాలు చాలా ఉన్నాయి. ఈ కష్టాలన్నీ పడే బదులు డబ్బు తీసుకుని పోటీనుంచి విరమించడం ప్రత్యర్థి వ్యూహమైతే కావలసినంత డబ్బు ఇచ్చి పోటీ లేకుండా గెలవడం, లేదా పోటీలో ఓట్లు కొనేయడం సరైన పద్దతి అని నాయకులు అనుకుంటున్నారు. దాన్నే చాణక్యమని మీడియా అంటుంది. అందుకు డబ్బు తీసుకుంటుంది. ప్రత్యర్థిని కొనుక్కుంటే మీడియా వారికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేకపోవడం మరో సౌకర్యం.

అది సరే ఈ మాటలు వినండి.

దీనితోపాటు చదవవలసిన మాటలు మరి కొన్ని ఇవి, మన గొప్ప రచయిత, పత్రికా రచయిత, మా ఉదయం హైదరాబాద్ ఎడిటర్ పతంజలి చెప్పిన తెలుసుకోవాలసిన అంశాలు ఇవి. చదవండి.

చెప్పిన మాటలు కాదు, కట్టుకున్న మూటలు చూడండి(ఇది నాకవిత్వం). మన ప్రజాకవి కాళోజీ ఏమన్నాడో వినండి.

కాళోజీ

అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు

ఏపాటి వాడో చూడు

ఎన్నుకంటే వెలగ బెట్టడం కాదు

ఇప్పటిదాకా ఏంచేశాడో చూడు.

పెట్టుకున్న టోపికాదు

పెట్టిన టోపీచూడు

ఎగరేసిన జెండా కాదు

చాటున ఆర్జించిన చందా చూడు

ఎవరు దద్దమ్మలు?

మనం తెలివిలేని దద్దమ్మలుగా మిగిలిపోతే మోసాలకే గురవుతాం. తెలివి తెచ్చుకోకపోతే జనాన్ని దోచుకున్నా, వారు దాచుకున్నా ప్రభువులు దొంగలేఅయిపోతారు. ఓట్ వేయండి. ఓట్ కునోటా నోటా అనకండి, నోటా అన్నా నోట్ అన్నా నోటు కావాలన్నా, నాట్ నాట్ అనకపోతే, లేదా కనీసం ఓటా చేయనన్నా కూడా ఎన్ని కలన్నీ, మన కలలన్నీ వృధా అవుతాయి. తెలివిగా ఓటు చేస్తేనే, కేవలం అదొక్కటే ప్రజాస్వామాన్ని బతుకుతుంది. మన రాజ్యాంగం బతుకుతుంది. లేకపోతే రాబోయే దొంగలు రాజ్యాంగాన్ని మనకు తెలియకుండానే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని చంపేస్తారు. తస్మాత్ జాగ్రత్త!

మాడభూషి శ్రీధర్ 29.11.2023

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles