- మహాపురుష్ పైన పెట్టుకున్న ఆశలు నెరవేరేనా?
- రామరాజ్యం సాధ్యమేనని ప్రజలు విశ్వసిస్తారా?
రామాయణం ఇతివృత్తంగా నిర్మాణమై, వివిధ భాషల్లోకి అనువాదమై, ప్రపంచంలోని ముఖ్య ప్రాంతాలలో విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. సినిమా వినోదం, రామాయణంలోని రమణీయతల విషయాలు అట్లుంచగా, రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. బిజెపి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎంచుకున్న మార్గాలలో సినిమా కూడా ఒక ముఖ్యరంగమై కూర్చున్నదన్నది విపక్షాలతో పాటు కొందరి వాదన. కాదేదీ కవితకనర్హం అన్నట్లు, రాజకీయ ప్రచారాలకి కాని వస్తువు లేనేలేదన్నది నేటి విమర్శ. హిందుత్వం, సనాతన సంప్రదాయాలు, భారతీయతను వాడుకుంటూ, అధిక సంఖ్యాకులైన హిందువుల భావోద్వేగాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొనే పనిలో బిజెపి పడిపోయిందని, నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టాక ఈ ధోరణులు మరింతగా ప్రబలుతున్నాయని తస్మదీయుల ఆవేదన, ఆక్రోశం, ఆవేశం. అందులో భాగమే ఈ ‘ఆదిపురుష్’ సినిమా అన్నది ప్రధాన విమర్శాస్త్రం. ఇటీవల ఆస్కార్ సొంతం చేసుకున్న ‘ఆర్ ఆర్ ఆర్ ‘ ను కూడా కొందరు అదే ఖాతాలో వేశారు. ఆ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ ను రాజ్యసభకు ఎంపిక చేయడం మొదలైనవి కూడా అందులో భాగంగానే విపక్షాలు చూస్తున్నాయి.
Also read: ‘పలుభాషల పలుకుతోడు – పాటల సైజోడు’ ఎస్పీ బాలసుబ్రమణ్యం….
ఆదిపురుష్ కూ, బీజేపీకీ లింకు
ఇదుగో ఇప్పుడు రిలీజైన ‘ఆదిపురుష్’ కు – బిజెపికి లింకులు కడుతున్నారు. ఏ నాయకత్వం పట్ల, ఏ పార్టీ పట్ల ప్రజలకు అత్యంత విశ్వాసం కలుగుతుందో తుదకు వారికే అధికారం దక్కుతుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. సినిమాలు చూసి పొంగిపోయి ఓట్లేసే అంతటి అమాయకులు కారు ప్రజలు. సినిమా సినిమాయే – రాజకీయం రాజకీయమేనని చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు అంతే, రేపు అంతే, ఎల్లుండీ అంతే. ఇక ఈ ‘ఆదిపురుష్’ సినిమా విషయానికి వస్తే మిశ్రమ అభిప్రాయాలే వినపడుతున్నాయి. ఆధునిక సాంకేతికత, విజువల్ హంగామా తప్ప, భావోద్వేగాలు, రసావిష్కరణ అంశాలలో నీరసమే రాజ్యమేలుతోందన్నది ప్రధానంగా వినవచ్చే విమర్శ. తెలుగుదనం హుళక్కి.. అన్నది మరో ముఖ్య విమర్శ. ఆ విధంగా చూస్తే, మిగిలిన దక్షిణాదివారిని కూడా ఈ సినిమా పెద్దగా కదిలించే వాతావరణం కనిపించడం లేదని గట్టిగానే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ పాత్రలకు పెట్టిన పేర్లు తెలుగువారికి అస్సలు ఎక్కడం లేదు. రాముడిని రాఘవుడిగా, లక్ష్మణుడుని శేషుగా, రావణాసురుడిని లంకేశ్ గా పిలిచే వాతావరణం మన తెలుగు పౌరాణిక సినిమాల్లో లేనే లేదు.కమలాకర కామేశ్వరరావు, బాపు నుంచి ఎన్టీఆర్ వరకూ రామాయణ పాత్రలకు ఎంత తెలుగుదనాన్ని అద్దారో తెలుగువారందరికీ అనుభవమే. నిజం చెప్పాలంటే పౌరాణిక చిత్రాలను తీయడంలో తెలుగువారి ముందు ఎవరైనా దిగదిడుపేనని దక్షిణాది ప్రేక్షకులు, సినీ పరిశ్రమ వారంతా అంటూనే ఉంటారు. అంతటి నిర్మాణ శిల్ప నేపథ్యం వున్న మన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా ఎక్కడం లేదు.
Also read: శతాధిక సార్వభౌముడు ఎన్ టీ ఆర్
ప్రభాష్ నటన శభాష్
రాముడిగా ప్రభాస్ నటనను ఎవరూ తప్పుగా, తక్కువగా చూడడం లేదు. అతని పరిధిలో అతను బాగానే చేశాడు. సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు పాత్రలను ఆయా నటులు బాగానే పోషించారు. సంగీత పరంగా అద్భుతాలు ఏమీ జరుగలేదు. సెకండ్ హాఫ్ బోరు కొట్టిందని ఎక్కువమంది అభిప్రాయం. కొన్ని సన్నివేశాలను సుదీర్ఘంగా లాగి విసుగు పుట్టించారని దాని అర్ధం. రామాయణం విశిష్టత, ఆ పాత్రలలోని గొప్పతనం భారతీయులకు బాగా తెలిసిందే. ఈ తరం వారికి చాటిచెప్పడం కోసం సినిమాను నిర్మించడం, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, సెల్యూలాయిడ్ పైకి తేవడం బహుధా అభినందనీయం. మన చరిత్ర, పౌరాణిక పురుషుల విశిష్టత, ఆచార సంప్రదాయాలు, నైతికజీవనం తెలుసుకోవడం, తెలియజెప్పడం చారిత్రక అవసరం. హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరణ జరగడం మనందరికీ గర్వకారణం. కథ ఎంత గొప్పదైనా, కథనం గొప్పగా లేకపోతే ఆకర్షించలేదు. మొత్తంగా చూస్తే, ఈ సినిమా పర్వాలేదు అన్నది ఎక్కువమంది భావం. తరాలు మారుతున్న ఆధునిక యుగంలో ‘సాంకేతిక హంగామా’గా ఈ సినిమాను అభివర్ణించాలి. శ్రీరాముని స్ఫూర్తితో పాలకులు ధర్మం ఆధారంగా సాగిన రామరాజ్యాన్ని ఈ కాలానికి తగ్గట్టుగా అందిస్తే అదే ఆదర్శం.
Also read: సరికొత్త సంసద్ సౌధం