- మోదీసహా బీజేపీ హేమాహేమీల విన్యాసాలు
- యోగితో సమఉజ్జీగా అఖిలేష్
- బ్రాహ్మణులపై పట్టుకు మాయావతి, ప్రియాంక ప్రయాస
2022 ఎన్నికల నామ సంవత్సరంగా మారనుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల రూపంలో కసరత్తులు మొదలయ్యాయి. బిజెపి మరోసారి అధికారంలోకి రావడం ద్వారా తన పరువు కాపాడుకోడానికి, సత్తా చూపడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతిపక్షాలు గేమ్ చేంజర్ గా రూపాంతరం చెందడానికి నానా తిప్పలు పడుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరున ఆట మొదలైంది. కానీ, అందరి దృష్టీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. దేశంలోనే అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలు అక్కడే ఉన్నాయి. దేశాన్ని పాలించగలిగిన బలం కావాలంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలను గెలుచుకోవాల్సిందే. దిల్లీలో చక్రం తిప్పాలని మిగిలిన ప్రతిపక్షాలు కూడా చూస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ మార్క్ యుద్ధానికి అధికార పార్టీ కత్తులు నూరుతోంది. మమతా బెనర్జీ స్ఫూర్తితో అఖిలేష్ యాదవ్ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అంతా తానై నడిపించడంలో ప్రియాంకాగాంధీ గతంలో కంటే చురుకుగా దూసుకెళ్తున్నారు. బ్రాహ్మణులు, ఠాకూర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
Also read: కర్ణాటక పీఠం కదులుతోందా?
చలికాలంలో వేడి గాలులు
మిగిలిన చోట్ల ఎట్లా ఉన్నా, ఉత్తరప్రదేశ్ లో వేడిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. బిజెపి – సమాజ్ వాదీ పార్టీల మధ్యనే ప్రధానపోటీ ఉండే అవకాశం ఉందని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అఖిలేష్ యాదవ్ నిర్వహించే సమావేశాలకు భారీగా జనం రావడం ఈ అభిప్రాయానికి బలాన్నిచ్చే అంశాల్లో ఒకటిగా చూడాలి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 202 సీట్లను దక్కించుకోవాలి. ప్రస్తుతం బిజెపి 308 సీట్ల బలంతో మిగిలిన పార్టీలకు అందనంత ఎత్తులో ఉంది. సమాజ్ వాదీ పార్టీకి 56 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ 5 స్థానాల బలంతో పూర్తిగా చతికిలపడి ఉంది. బహుజన సమాజ్ వాదీకి కూడా 4 సీట్లే ఉన్నాయి. 2017 ఎన్నికల లెక్కల ప్రకారం చూస్తే సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్నా బిజెపితో పోల్చుకుంటే చాలా వెనకబడి ఉంది. యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై, దేశంలో బిజెపి పాలనపై ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకోడానికి ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపి గెలుపు గుర్రం ఎక్కుతుందని, తద్వారా మళ్ళీ మోదీ ప్రభుత్వాన్ని చూడాల్సి వస్తుందనే భయాలు కూడా ప్రతిపక్షాలకు ఉన్నాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బిజెపి సర్వశక్తులు వడ్డి గెలవాలని చూస్తోంది. ప్రతి సందర్భాన్నీ ఎన్నికలకు అనుకూలంగా మలచుకోడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయ బిల్లుల రద్దు, వారణాసిలో కారిడార్ ఆవిష్కరణ ఆర్భాటంగా నిర్వహించడం, అయోధ్య రామమందిరాన్ని వేగవంతం చెయ్యడం మొదలైనవన్నీ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా ఓటు బ్యాంక్ పైనా దృష్టి పెట్టింది. యువకులతో సమానంగా యువతుల పెళ్లి వయస్సును పెంచే నిర్ణయం కూడా అందులో భాగమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు అగ్రనేతలంతా యూపీలోనే తిరుగుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు కూడా అక్కడే తిష్ట వేశారు.
Also read: నిద్ర ఒక యోగం
ప్రధాని మోదీ ప్రచార సంరంభం
ప్రధాని వరుసగా సమావేశాలు నిర్వహించడమే కాక, ఆ రాష్ట్రంపై గతంలో ఎన్నడూ లేనంతగా వరాల జల్లులు కురిపిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. మొన్న శనివారం నాడు 36వేల కోట్ల రూపాయల విలువైన గంగా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. దళితులు, బడుగు వర్గాలపై అత్యాచారాలు, లఖింపూర్ ఖేరీ ఘటనలో జరిగిన మారణహోమం, పెరిగిన నిరుద్యోగం, కరోనా కల్పించిన కష్టాలు, అధికధరలు మొదలైనవన్నీ అధికార పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయనే వినపడుతోంది. గతంతో పోల్చుకుంటే సమాజ్ వాదీ పార్టీ మరింత మెరుగైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు వేరువేరుగానే బరిలోకి దిగుతున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఎక్కువ శాతం మౌనాన్ని ఆశ్రయిస్తున్నా, ఆమె కూడా ప్రియాంకాగాంధీ వలె బ్రాహ్మణ సామాజిక వర్గాలతో ఎక్కువగా సమావేశమవుతున్నారు. మొత్తంమీద యూపీలో మొదలైన వేడి మిగిలిన రాష్ట్రాలకు కూడా త్వరలోనే పాకుతుంది.ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి – మార్చిలో జరుగబోయే ఎన్నికలు ఆ యా పార్టీల అగ్రనేతల తలరాతలను మార్చడమే కాక, దేశప్రగతి గతిని నిర్దేశిస్తాయని భావించాలి.
Also read: పండుగలొస్తున్నాయి, జాగ్రత్త!