Sunday, December 22, 2024

ఏపీ మంత్రివర్గ పునర్నిర్మాణంలో ఎన్నికల ఎత్తుగడ

  • కమ్మ, రాజులు, బ్రాహ్మణ, వైశ్య కులాలకు శూన్యహస్తం
  • బీసీలకూ, ఎస్ సీలకూ పెద్దపీట
  • మంత్రులందరూ సోమవారం ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎన్నికల ఎత్తుగడను అమలు పరిచినట్టు కనిపిస్తోంది. మంత్రివర్గ పునర్నిర్మాణంలో అనుసరించిన ముఖ్యమైన సూత్రం లేదా అంచనా ఏమంటే ప్రజలు కులాలను బట్టి ఓట్లు వేస్తారని. ఇది ప్రశాంత్ కిషోర్ ఆలోచనో లేక జగన్ మోహన్ రెడ్డి అంచనానో తెలియదు. ఎవరిదైనా ఈ సూత్రం బెడిసికొట్టే ప్రమాదం ఉన్నది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారంనాడు పాతమంత్రులచేతా, కొత్త మంత్రులచేతా ప్రమాణం చేయించారు. చిరునవ్వులు చిందిస్తూ గవర్నర్ పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి మొహంలో ఆందోళన ఏదీ కనిపించలేదు.

అగ్రవర్ణాలనబడే కులాలకు చెందినవారు ఎనిమిది మంది, వెనుకబడిన కులాలకు చెందిన పది మంది, దళితులు అయిదుగురూ, ఆదివాసీ ఒకరూ, ముస్లిం ఒకరూ – వెరసి 25 మంది మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు. వీరిలో పదకొండు మంది పాతమంత్రివర్గంలో ఉండి కొత్తమంత్రివర్గంలోకూడా కొనసాగుతున్నవారే. 14మంది మాత్రం కొత్తవారు. ముఖ్యమంత్రిగా 2019లో ప్రమాణం స్వీకరించినప్పుడు మంత్రులలో 90 శాతం మందిని పదవీకాలం మధ్యలో మార్చబోతున్నానని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మంత్రిమండలి కూర్పు దగ్గరపడిన కొద్దీ 90 శాతం కాస్తా 65 శాతానికి పడిపోయింది. ఇద్దరు లేదా ముగ్గురు పాతమంత్రులు ఉంటారనుకుంటే వారి సంఖ్య పదకొండుదాకా పెరిగింది. ఆ మేరకు ముఖ్యమంత్రిపైన ఒత్తిడి పడింది. ముగ్గురు నానీలూ – ఆళ్ళ, పేర్ని, కొడాలి- కొత్త మంత్రివర్గంలో లేరు. కొడాలి నానికి ఏదో కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇస్తారని అంటున్నారు.  అంబటి రాంబాబు, రోజా కొత్తగా చేరారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ మంత్రులూ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి సమర్థులూ పాతమంత్రి వర్గంలోనూ, కొత్త మంత్రివర్గంలోనూ ఉన్నారు. కొందరికి ప్రత్యామ్నాయం లేని కారణంగా వారే కొనసాగుతున్నారు. సిరిది అప్పలరాజు, తానేటి వనిత, అంజాద్ బాషా, పినిపె విశ్వరూప్, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, నారాయణస్వామి పాతమంత్రవర్గంలోనూ, కొత్త మంత్రివర్గం లోనూ కొనసాగుతున్నారు.

మంత్రుల ప్రమాణస్వీకారం దృశ్యాలను చూపుతున్న టీవీ చానళ్ళు మరో పక్క నిరసన ప్రదర్శనలు చూపించాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆగ్రహోదగ్రులై నోటికి వచ్చినట్టు మాట్లాడితే జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారిని కేకలువేసి నోరు అదుపులోపెట్టుకొమ్మని చెప్పినట్టు కొన్ని వర్గాల భోగట్టా. బాలినేని పరుషంగా మాట్లాడినట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా మంత్రి పదవి ఆశించి భంగపడిన కొలుసు పార్థసారథి నివాసానికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వెళ్ళి అనునయంగా మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. మాజీ మంత్రి సుచరిత శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటిస్తూనే తాను పార్టీలో కొనసాగుతానంటూ మాట్లాడారు. ఈ కోపతాపాలు తగ్గిపోతాయి. కాకపోతే కొన్ని రోజులపాటు చిటమటలు ఉంటాయి. కాలక్రమంలో వాటంతట అవే సర్దుకుంటాయి. కానీ మంత్రివర్గ పునర్నిర్మాణంలో జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన నీతిని ప్రజలు గమనిస్తున్నారు. వారు ఆ నీతినీ, రీతినీ ఆమోదిస్తారా అన్నది ప్రశ్న.

కమ్మవారు లేని మంత్రివర్గం 1953లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కటి కూడా లేదు. కొడాలి నాని కడపటి కమ్మకులానికి చెందిన మంత్రి. అదే విధంగా రాజుల కులానికి చెందినవారు ఒక్కరైనా ఉండేవారు. బ్రాహ్మణులు, వైశ్యుల సంగతి వేరు. వారు కొన్ని మంత్రివర్గాలలో ఉన్నారు. కొన్నిటిలో లేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 2014లో ఏర్పడిన తర్వాత బ్రాహ్మణులకు మొత్తం 175 స్థానాలలో ఎక్కువలో ఎక్కువ మూడు స్థానాలకు టిక్కెట్ల ఇచ్చారు. అది కూడా వైసీపీనే ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులకు ఒక్క టిక్కెట్టు కూడా ఇవ్వలేదు. వైశ్య సామాజికవర్గం నుంచి పాతమంత్రివర్గంలో ఒకరున్నారు. ఈ  సారి ఆ ఒక్కరు కూడా లేరు.

మొత్తం 26 జిల్లాలకు గాను ఏడు జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. నాలుగు పాత జిల్లాలకు మాత్రం ఎక్కువ సంఖ్యలో మంత్రిపదవులు దక్కాయి. చిత్తూరు, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు మూడేసి మంత్రిపదవుల చొప్పున దక్కాయి. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారడ్డి, కె. నారాయణస్వామి, రోజా, గుంటూరు నుంచి అంబటి రాంబాబు, విదదల రజని, మేరుగునాగార్జున, తూర్పు గోదావరి నుంచి పినివె విశ్వరూప్, దాడిసెట్టి రాజా,చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమగోదావరి నుంచి తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొత్స సత్యనారాయణ మిత్రులు కొత్తమంత్రివర్గంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వేణుగోపాలకృష్ణ, పిడిక రాజన్నదొర, గుడివాడ అమర్ నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, దాడిసెట్టి రాజా బొత్సకు సన్నిహితులే. స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశించారు. కానీ రాలేదు. నిరాశకు లోనైనా మౌనంగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావును తీసుకున్నారు. పాత మంత్రివర్గంలో ఉండిన అప్పలరాజు కొత్త మంత్రివర్గంలో కూడా కొనసాగుతున్నారు. కులాల లెక్కలు సీతారాంకి కలిసి రాలేదు.

బ్రాహ్మణులూ, వైశ్యులూ కలిపి ఏపీ జనాభాలో నాలుగు శాతంమంది కూడా ఉండకపోవచ్చు. వారి ఓట్లు తక్కువే కావచ్చు. కానీ వారు అన్ని వర్గాలవారినీ కలుసుకుంటూ, అందరితో మాట్లాడుతూ ఉంటారు. వారి మాటకు అన్ని వర్గాలవారూ ఎంతో కొంత విలువ ఇస్తారు. అభిప్రాయాన్ని ప్రోది చేయడంలో గణనీయమైన పాత్రవారిది. అటువంటివారికి మాటవరుసకైనా ఒక మంత్రిపదవి ఇవ్వాలని కొందరు వ్యాఖ్యానించారు. ఒక వ్యాఖ్యాత మాటల్లో చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డి నిర్మొహమాటంగా చాలా ఆచరణయోగ్యమైన దారిలో నడిచే వ్యక్తి అనీ, కమ్మవారు ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారనీ, బ్రాహ్మణులు బీజేపీవైపు మొగ్గు చూపుతారనీ, వైశ్యుల ఎటు వేస్తారో కచ్చితంగా చెప్పజాలమనీ, రాజులు వైసీపీ పట్ల కోపంగా ఉన్నారనీ, అందువల్ల ఈ సామాజికవర్గాలకి ప్రాతినిథ్యం ఇచ్చినప్పటికీ పెద్ద ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి భావించి ఉంటారని అన్నారు. వీరికి ఇచ్చే ఒకటి,రెండు మంత్రి పదవులు వెనుకబడిన కులాలకు ఇస్తే వారు వైసీపీకి బలమైన మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నదని జగన్ మోహన్ రెడ్డి భావించి ఉంటారని ఒక వాదన.  

రెడ్ల సంఖ్యను పరిమితం చేసినందుకు జగన్ మోహన్ రెడ్డిని అభినందించాలి. కానీ ప్రజలందరూ కులం ప్రాతిపదికనే ఓట్లు వేస్తారనే అంచనా మాత్రం సరైనది కాదు. ఒకవేళ ఆ అంచనా నిజమే అనుకున్నప్పటికీ తమకు దూరంగా జరుగుతున్న సామాజికవర్గాన్ని సుముఖం చేసుకునేందుకు, ప్రసన్నం చేసుకునేందుకైనా వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఫలానా ముఖ్యమంత్రి ఫలానా సామాజికవర్గాలకు వ్యతిరేకం అని ప్రజలు చెప్పుకోవడం ఏమంత గొప్పగా ఉంటుంది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles