ఏల్చూరి విజయరాఘవ రావు (నవంబర్ 3, 1925 – నవంబర్ 30, 2011) ఖండాంతర ప్రఖ్యాత భారతీయ సంగీత కారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, సంగీత బాణీలు సమకూర్పులో నిష్ణాతుడు, నర్తకుడు, బహుభాషా కోవిదుడు, ప్రయోక్త, సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, “పద్మశ్రీ” విజేతయైన అత్యంత ప్రతిభా వంతుడు. “రఘుపతి రాఘవ రాజారాం” పాట స్వరకర్త.
సర్దార్ పటేల్ స్వస్థతకోసం సంగీతం
మహాత్మా గాంధీనే తన రామధున్ కార్యక్రమం ద్వారా మెప్పించాడు. సర్దార్ పటేల్ కు స్వస్థత చేకూర్పు కోసం, కొంత కాలం సంగీతం వినిపించాడు. ఖండాంతర ఖ్యాతి నార్జించాడు. ప్రపంచంలో మూడు ఖండాలలో ఒకసారి కాదు, ఎన్నోసార్లు ఆయన సంగీత కచేరీలు నిర్వహించాడు. ఆయన వేణునాద రికార్డులు ఇంగ్లండు, పారిస్‌లోనూ లభిస్తాయి. ప్రాచుర్యం పొందాయి. బహు భాషావేత్త గా, వాద్య కారునిగా, నర్తకునిగా, స్వరకర్తగా, రచయితగా, ప్రాసంగికునిగా, ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం.
నయాగారా కవి సోదరుడు
విజయ రాఘవరావు ఏల్చూరి రామయ్య, సుబ్బాయమ్మ దంపతుల ద్వితీయ సంతానంగా 1925, నవంబర్ 3 న జన్మించాడు. ఆయన పసి బిడ్డగా ఉండగానె తండ్రి మృతి చెందారు. అయన సోదరుడు నయాగరా కవుల్లో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం. తండ్రి నుంచి ఆయనకు సంగీతాభిమానం సంక్రమించింది.
ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీ వంటి ఇతర భాషలు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. విజయ రాఘవరావు తన కళాజీవితాన్ని భరత నాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునే కాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీత ప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించాడు. తెలుగులో కవితలు అల్లడమే కాదు, ఇంగ్లీషులో రచనలూ చేశాడు.
యాదవుల పిల్లల దగ్గర నేర్చిన వేణునాదం
నరసరావుపేటలో చెరువు కట్ట మీద యాదవుల పిల్లలతో కూడి వారి వద్దనే వేణువు వాయించడం నేర్చుకున్న విజయ రాఘవరావుకు ప్రాథమికంగా గురువు ఎవరూ లేరు. మద్రాసు వెళ్ళి కళా క్షేత్రంలో సంగీతం, రుక్మిణీదేవి అరండేల్ వద్ద భరత నాట్యం అభ్యసించాడు. అక్కడికి వచ్చిన ప్రఖ్యాత నర్తకులు ఉదయ శంకర్ దృష్టిని ఆకర్షించి వారి నృత్య బృందంలో నర్తకుడిగా చేరి, దేశ విదేశాలూ తిరిగాడు. ఆ ప్రదర్శనలు ఇస్తున్నపుడే ఒకసారి రష్యాలో నాట్య ప్రదర్శన అనంతరం వేణు గానంతో అక్కడి శ్రోతల్ని అబ్బుర పరిచగా, ఆ సందర్భంలోనే ఉదయ శంకర్ సోదరుడు పండిట్ రవి శంకర్ తన శిష్యుడిగా స్వీకరించి హిందూస్తానీ సంగీత ప్రపంచం లోకి ఆయన్ని ఆహ్వానించాడు. అలా ఆయన ప్రతిభ మరింతగా విస్తరించింది.
రవిశంకర్ శిష్యరికం
సితార్ విద్వాంసుడైన రవిశంకర్‌వద్ద సంగీతం నేర్చుకున్న విజయ రాఘవరావు ఆయనకు నికరమైన శిష్యుడు. రవిశంకర్ స్వయంగా సంగీతరచన చేసిన అనూరాధా, గోదాన్, మీరా మొదలైన హిందీ చిత్రాల రికార్డింగ్ లన్నిటిలోనూ రావు ప్రధానపాత్ర నిర్వహించాడు. ఫిల్మ్స్ డివిజన్‌వారి అసంఖ్యాకమైన డాక్యుమెంటరీల సంగీతంలో ఆయన రేడియో శబ్దాల దగ్గర్నుంచీ, రకరకాల ప్రపంచ వాద్యాల దాకా అనేకం వాడి విజయ వంతమైన ప్రయోగాలు చేశాడు. 1955 నుండి 1958 వరకు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో విజయ రాఘవరావు సంగీత ప్రయోక్తగా, వాద్యబృంద కార్యక్రమ సంవిధాన కర్తగా పనిచేశాడు.
రఘుపతి రాఘవ రాజారాం
గాంధీజీ హత్య జరిగినపుడు ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గీతాన్ని శృతిలయ బద్ధంగా ఎడతెగకుండా వాద్యసంగీత రూపంగా ప్రసారం చేయించాడు. 24 గంటలు ఈ ప్రార్థన సందేశ గీతిక ప్రసార మవుతూనే ఉంది. దీనిని స్వరపరచినది రాఘవరావే. ఆ తరువాత మహాత్మాగాంధీ సంస్మరణ నివాళిగా ఇది సంప్రదాయ నిబద్ధమైంది.
1950 ప్రాంతాలలో సర్దార్ పటేల్ కొద్ది రోజులు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుండేవారు. అప్పుడు వరసగా కొన్ని రోజులు తనను సంగీతంతో సేదదీర్చ వలసిందని పటేల్ విజయ రాఘవరావును కోరారు. సాయంకాలం ఒక గంట విజయ రాఘవరావు, ఉస్తాద్ అల్లారాఖా తబలా వాద్య సహకారంతో పటేల్ మనస్సును స్వస్థ పరచేవారు, రంజింప జేసేవారు.
కార్నెజీ హాల్ లో వేణునాదం
అమెరికాలో వాషింగ్టన్, డి.సి.లో ‘కార్నెజీ హాల్’ అని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సభా భవనం ఉంది. ప్రపంచ ప్రసిద్ధులైన కళాకారుల గాన సభలు అక్కడ సంగీత కచేరీ నిర్వహించడం జీవిత సాఫల్యంగా భావిస్తారు. విజయ రాఘవరావు కార్నెజీ హాల్‌లో వారి ఆహ్వానంపై వేణునాదం విన్పించారు.
అమెరికా నగరాలలో సంగీత కచేరీ
అమెరికాలో జార్జియా రాష్ట్రంలో భారతీయ సంగీతం, సంస్కృతి, జ్ఞాన సాధన, చింతన ధారలను ప్రచారం చేసే ఒక పత్రిక వెలువడుతున్నది. ముఖ్యంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి కార్యక్రమ నిర్వహణ విశేషాలను ప్రకటిస్తుంది ఈ పత్రిక. పన్నెండేళ్ళ కిందట ‘అట్లాంటా’ నగరంలో ‘ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ సొసైటీ ఆఫ్ గ్రేటర్ అట్లాంటా అనే సాంస్కృతిక సంస్థ విజయ రాఘవరావు సంగీత కచేరీ ఏర్పాటు చేసింది. ఆయన గొప్ప నర్తకుడు కూడా. దేశవిదేశాలలో అనేక నృత్యప్రదర్శన లిచ్చాడు. పసిపిల్లల వంటి పరమ ఉల్లాస ప్రవృత్తి ఆయనది.
సోనీ కంపెనీ రికార్డు
సోనీ కంపెనీ వాళ్ళు విజయ రాఘవరావు హంసధ్వని గంటన్నరసేపు ఆలపించగా రికార్డు చేశారు. ‘భువన్ షోమ్’ కూడా వారు ప్రదర్శించి చూపారు. ఏల్చూరి విజయ రాఘవరావు ఇంగ్లీషులో, తెలుగులో కవిత్వం రాశారు, కథలు రాశారు. 1991 జనవరి- ఫిబ్రవరి ఇండియన్ లిటరేచర్ (సాహిత్య అకాడమి)లో ఆయన సాహిత్య ప్రస్థాన వ్యాసం ప్రచురితం. అందులో సంగీత సాహిత్యాలలో ఆయన ప్రజ్ఞ, హదయ వైశాల్యం ఎంతో గొప్పగా ఆవిష్కృతమైనాయి.
సంగీత నాటక అకాడెమీ అవార్డు
ఆయనకు 1970 లో భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన పద్మశ్రీ వచ్చింది. 1982 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. జాతీయ అంతర్జాతీయ స్వర్ణ పతక సమ్మానితుడు గా సంగీత ప్రపంచం లో నిలిచి పోయాడు.
(నవంబర్ 30 ఏల్చూరి విజయరాఘవ రావు వర్ధంతి)
చాలా బాగా రాశారు. తిరునాళ్లు తరలివచ్చి కన్నె పిల్లలు పాట రికార్డింగుని ఒక పాట పుట్టింది అని ఒక రూపకం, రేడియో రికార్డింగులు ఎంత శ్రమతో కూడినవో తెలియ జేసే విధంగా ప్రసారం చేశారు. గొప్ప సంగీతకర్త ఆయన.