`కల్యాణం వెంకట సుబ్బయ్య` గొప్ప కళాకారుడు. ఆరున్నర దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయినా ఆ పేరుతోనే గుర్తించడం కష్టం.`ఈలపాట` రఘురామయ్య అంటే చప్పున స్ఫురిస్తారు. ఎనిమిదవ ఏట `రామదాసు`నాటకంలో రఘురాముడి పాత్రధారణతో మెప్పించిన ఆయనను `ఇక మీదట సుబ్బయ్య కావు…రఘురాముడివి`అని విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు ఆశీర్వదించారు.
’ఈలపాట`
రంగస్థలంపై పౌరాణిక పాత్రలను అద్భుతంగా ఫోషించిన నటులు ఎందరో ఉన్నారు. `ఈలపాట`తో రఘురామయ్య ప్రత్యేకతను సాధించారు. అనేక మంది నటులు శ్రీకృష్ణ పాత్రధారణలో పద్యాలను ఆలపించారు. ఈయన గాత్రంతో పాటు `నాలుక క్రింద వేలును ఉంచి పాడుతూ అపూర్వ సృష్టి చేశారు. ఆంధ్రనాటక రంగంలోనే కాదు ప్రపంచ నాటక రంగంలోనే ఇది అద్భుత ప్రక్రియ.ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,తొలి ఉపరాష్ట్రపతి, అనంతర రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మున్నగువారు ఆయన `వేలి మురళీ గానాన్ని`ఆస్వాదించేవారు.ఆయనకు ప్రత్యేక సమయం కేటాయించి అడిగి మరీ పాడించుకోవడంలోనే రఘురామయ్య ప్రతిభ అర్థమవుతుంది. విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగూర్ `ఆంధ్ర నైటింగేల్` అని ప్రశంసించారు.
Also Read: కాటన్ కు వెన్నుదన్ను వీణెం
నటన ప్రస్థానం
తన పేరును మార్చేసిన రఘురాముని పాత్రతోనే సి.పుల్లయ్య దర్శకత్వంలో చలనచిత్ర రంగ ప్రవేశం (`లవకుశ`…1932)లో చేశారు. రంగస్థలం, వెండితెరపై తొలి పాత్ర (రాముడు) కావడం కాకతాళీయం. రఘురామయ్య వందకు పైగా చలనచిత్రాలలో నటించారు.సంఖ్యాపరంగా అన్ని చిత్రాలలో నటించిన ఏకైక రంగస్థల నటుడిగా నిలిచారు.అయినా సినిమాల కారణంగా రంగస్థలాన్ని మరువ లేదు. `రంగస్థలం కన్నతల్లి…సినిమా పెంచిన తల్లి` అనేవారు. సుమారు ఇరవై వేల రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. దగ్గరి దగ్గరి కేంద్రాలలో ఒకే రాత్రి మూడు మూడు ప్రదర్శనలలో పాల్గొన్న అరుదైన ఘనత కూడా ఆయనదే. సినిమాలతో తీరికలేని సమయంలో కూడా నాటక ప్రదర్శనలంటే ప్రాణం పెట్టేవారు.పల్లె పట్టణం అనే తేడా లేకుండా రవాణా సదుపాయాలు లేని మారుమూల గ్రామాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. రాముడు, కృష్ణుడు, దుష్యంతుడు, భవానీ శంకరుడు లాంటి పురుష పాత్రలతో పాటు రుక్మిణి,శకుంతల, చిత్రాంగి, చింతామణి లాంటి స్త్రీ పాత్రలను పోషించారు. తిరుపతి వేంకటకవులు మహా భారతం ఆధారంగా రాసిన నాటకాలలోని పద్యాలు ఆలపించేందుకే తప్ప నటించేందుకే అవకాశం లేదని భావనను మార్చివేశారు. ఆ పద్యాలోని పదాలను అర్థవంతంగా విడగొడుతూ, వాటికి అనుగుణంగా నటించి `వన్స్ మోర్`లను అందుకున్న అరుదైన నటుడు.అలనాటి రంగస్థల నటదిగ్గాజాలు స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, పులిపాటి వేంకటేశ్వర్లు, పృధ్వి వేంకటేశ్వరరావు, ఆచంట వెంకటరత్నంనాయుడు, పారుపల్లి సుబ్బారావు, ధూళిపాళ సీతారామశాస్త్రి తదితరులతో నటించారు. విఖ్యాత దర్శకుడు బాపు రూపొందించిన చిత్రం `రామాంజనేయ యుద్ధం` చిత్రంలో అంతవయస్సులోనూ ఆంజనేయ పాత్రకు నేపథ్య గానం అందించారు. ఆ పాటలు (సాకేత సార్వభౌమా, రామ నీలమేఘ శ్యామా) శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి.
Also Read: నట `మిక్కిలి`నేని
క్రమశిక్షణ
నటీనటులకు ఆరోగ్యంపై ప్రత్యేకించి క్రమశిక్షణ అవసరం అనేవారు రఘురామయ్య. దానిని ఆచరించి చూపారు.నిత్యం వ్యాయామం, యోగాభ్యాసం చేస్తూ నిత్యనూత నంగా కనిపించేవారు.కనుకనే 72వ ఏట కూడా నటుడిగా నీరాజనాలు అందుకున్నారు. 1972లో నిప్పన్ కల్చరల్ ఎక్స్చేంజ్ సొసైటీ మద్రాసు శాఖ ఆధర్వంలో వివిధ దేశాల పర్యటనలో భాగంగా జపాన్ లోని ఒక వేదాంత సొసైటిని సందర్శించారట. ఆ సమయంలో ఆయన శ్రీకృష్ణ వేషధారణలో నిలుచున్నప్పుడు అక్కడివారు సాష్టాంగ పడ్డారట.ఆ ఆశ్రమంలో మూడురోజులు ఆతిథ్యం స్వీకరిం చారు. ధురలవాట్లకు దూరంగా ఉండడం వల్లనే ఏడు పదుల వయసులోనూ రోజుకు రెండు వందల పద్యాలు అవలీలగా పాడగలిగేవారట.
జీవిత విశేషాలు
గుంటూరు జిల్లా సుద్దపల్లిలో 1901 మార్చి 5వ తేదీన జన్మించిన రఘురామయ్య పెద్దగా చదువుకోలేదు. ఆంధ్ర నాటకరంగంలో చిరస్మరణీయలు యడవల్లి సూర్య నారాయణ, దంటు వెంకట కృష్ణయ్య గార్ల ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు.ఒకసారి అటుగా వస్తున్న వారిద్దరు ఎక్కడి నుంచో వినివిస్తున్న గానమాధుర్యానికి నిలిచిపోయారు. ఆ గాయకుడి జాడ కోసం చూశారు. ఒక పొదలో బాలుడు నోటిలో వేలుపెట్టుకొని మధురంగా పాడుతున్న తీరు గమనించి వివరాలు అడిగారు.`నా పేరు వెంకటసుబ్బయ్య. పశువులు కాచుకుంటాను. తోచక ఇలా పాడుకుంటాను` అని వినయంగా చెప్పారు.మెరిసే కళ్లు, అందమైన ముఖం, ఉంగరాల జట్టు…వీటన్నిటి చూసి తమతో తీసుకువెళ్లి నాటక శిక్షణ ఇప్పించారు యడవల్లి,దంటు. అలా నేర్చుకున్న సంగీతం, జన్మతః ప్రాప్తించిన గాత్రసౌందర్యం, `ఈలపాట` నైపుణ్యం, చక్కటి ఆహార్యంతో నాటి ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేశారు.
Also Read: సరళ స్వభావుడు… సుమధుర గాత్రుడు
సత్కారాలు
భారత ప్రభుత్వం ఆయనను `పద్మశ్రీ`తో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వ ఇచ్చింది. వివిధ సాంస్కృతిక సంస్థలు చేసిన సత్కారాలు, సన్మానాలు సరేసరి.మారుమూల పల్లెలో పుట్టి, ప్రాథమిక విద్య కూడా దాటకపోయినా వ్యక్తి తెలుగువారి నటనా కళా కౌశలాన్నిఅంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహానటుడు డెభయ్ అయిదో ఏటా నటరాజులో ఐక్యమయ్యారు.
(మార్చి 5న `ఈలపాట` రఘురామయ్య జయంతి)
I frequently read your blog admin try to discover it quite fascinating. Thought it was about time i show you , Sustain the truly fantastic work
This waspretty beneficial material. Overall I think this is well worth a bookmark, thanks