ఆంధ్ర విశ్వకళాపరిషత్తు (విశాఖపట్నం) పేరు చెప్పగానే స్ఫురించే తొలితరం పాలనా ప్రముఖులలో విఎస్ కృష్ణగా ప్రసిద్ధులైన వాసిరెడ్డి శ్రీకృష్ణ స్ఫురిస్తారు. విద్యావేత్తగా,ఆర్థిక శాస్త్రవేత్తగా,ఆంధ్రవిశ్వ విద్యాలయంలో వివిధ హోదాలతో పాటు ఉపకులపతిగా విశేష సేవలు అందించారు.చదివిన ఆర్థిక రంగాంశం కంటే విద్యాంశానికే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు విద్యా రంగానికి విశేష కృషి చేశారు.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పెదపాలెం గ్రామంలో శ్రీరాములు, వీరమ్మ దంపతులకు 1902 అక్టోబర్ 8న జన్మించిన శ్రీకృష్ణ స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు.చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో చదువుకు అంతరాయం కలిగింది. గ్రామంలోని సాంబయ్య అనే ఉపాధ్యాయుడి వద్ద ట్యూషన్ కు చేరగా ఆయనలోని గ్రహణశక్తిని, విద్య పట్ల ఆసక్తిని గమనించి శ్రీకృష్ణను గుంటూరు పాఠశాలలో చేర్పించారు.
గురువు చలువతో ఉన్నత విద్య:
ఉన్నత విద్యను లండన్ లో చదవాలని సాంబయ్య మాస్టారు శ్రీకృష్ణను ప్రోత్సహించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు (అంతకు మందు ఆచార్య ఎన్.జీ.రంగా లండన్ వెళ్లేందుకు కూడా ఆయనే సహకరించారట). ఈయన విషయాన్ని రంగా గారికి వివరించి లేఖ రాసి, శ్రీకృష్ణను బొంబాయి పంపించి అక్కడి నుంచి నౌకా ప్రయాణం ఏర్పాటు చేశారు. గ్రామీణ వాతావరణం నుంచి వెళ్లిన ఆయన నలుగురితో కలియడంలో మొదట కొంత ఇబ్బందిపడినా రంగా గారి చొరవతో అలవాటు పడిపోయారు.
శిష్యుడి ప్రతిభపై సాంబయ్య మాష్టారికి విపరీమైన గురి. శ్రీకృష్ణ లండన్ ప్రయాణం బంధువర్గంలో చాలా మందికి ఇష్టంలేక పోయినా ఆయన ప్రోత్సహించి పంపారట. తనుకు తెలియకుండా అలా చేసినందుకు `మా అనుమతి లేకుండా ఎలా పంపారు` అని శ్రీకృష్ణ మేనమామ ఆయనపై కొంత ఆగ్రహం ప్రదర్శించారట. ` శ్రీకృష్ణ శక్తి సామర్థ్యాలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా నమ్మకాన్ని వమ్ము కానీయక ప్రయోజకుడై తిరిగి వస్తాడు`అని నచ్చెచెప్పారట. ఆశించినట్లే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ధికాంశం ప్రధానాశంగా బీఏ పట్టాతో (1927) తిరిగి వచ్చి మొదట గురువు సాంబయ్య ఆశీస్సులు అందుకున్నారు శ్రీకృష్ణ. కొంతకాలం కోయంబత్తూర్ లో ఇంపీరియల్ బ్యాంకులో పనిచేశారు. ఉద్యోగం నచ్చక రాజీనామా చేశారు. అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి బొబ్బిలి రాజాకు కార్యదర్శిగా వ్యవహరించారు.
ఆంధ్ర విశ్వకళాపరిషత్తుకు….
తనకు ఇష్టమైన విద్యా రంగానికి సేవలు అందించాలనే సంకల్పంతో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా (1932) చేరారు.ఈ ఉద్యోగం రావడానికి మరో కారణం కూడా చెబుతారు. అప్పట్లో విశ్వవిద్యాలయం ఉప కులపతి నియామకంలో డాక్టర్ సర్వేపల్లి ల్ల రాధాకృష్ణన్, రఘుపతి వెంకటరత్నం నాయుడు గార్ల మధ్య గట్టి పోటీ ఉండేదట. సర్వేపల్లికి బొబ్బిలి రాజా వారి నుంచి, నాయుడుగారికి పిఠాపురం రాజా వారి ఆశీస్సులు ఉండేవట.ఒక రకంగా ఈ పదవి ఇధ్దరు విద్యాధికుల మధ్య కంటే రెండు రాజకుటుంబాల మధ్య పోటీ పోటీగా భావించేవారట. శ్రీకృష్ణ చాతుర్యం వల్ల ఉభయపక్షాల నడుమ అవగాహన ఏర్పడి సర్వేపల్లి ఉపకులపతి అయ్యారు.దానిని పరిగణనలోకి తీసుకున్న ఆయన అన్ని అర్హతలు గల శ్రీకృష్ణ సేవలను విశ్వవిద్యాయానికి వినియోగించుకోవాలను కొని ఆర్థిక శాస్త్ర విభాగంలో ఉపన్యాసకునిగా తీసుకున్నారు. `Gold movement In European Trade` అనే అంశంపై వియన్నా విశ్వవిద్యాలయంలో నమోదు చేసుకున్న పరిశోధనను పూర్తి చేయడానికి సర్వేపల్లి అనుమతి కోరి, డాక్టరేట్ తో తిరిగి వచ్చారు. అర్థికశాస్త్ర విభాగంలో లెక్చరర్ గా, రీడర్ గా పనిచేసి, 1938లో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు. 1942లో కొత్తగా ఏర్పాటైన అర్థశాస్త్ర పీఠానికి అధ్యక్షులై, తరువాత విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించారు.
కులపతిగా…
సర్ కట్టమంచి రామలింగారెడ్డి కులపతిగా రాజీనామా చేయడంతో (1949) శ్రీకృష్ణ ఆ పదవిలో నియమితులై పదకొండేళ్లు కొనసాగి విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిర్విరామ కృషి చేశారు. ఇంజనీరింగు, సముద్రశాస్త్ర, గనుల,ధాతు విజ్ఞాన శాస్త్రాలలో నూతన కోర్సులు ప్రవేశపెట్టారు.పరమాణు విజ్ఞాన శాఖకు రూపు రేఖలు దిద్దారు.1957లో ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులయ్యారు. విశ్వవిద్యాలయ నిధలు సంఘం (యూజీసీ) చైర్మన్ గా నియమితులయ్యారు.ఆ పదవిలో ఉండగానే 59వ ఫిబ్రవరి 16వ తేదీన గుండెపోటుతో కన్నుమూశారు.
మేధావిగా….
అర్థ శాస్త్రవేత్తగా ఆయన అంతర్జాతీయ వాణిజ్యం, బ్రిటన్ ఉడ్స్ ఒడంబడిక, ఆ తర్వాత ఏర్పాటైన ద్రవ్యనిధి లాంటి అంశాలకు ఆయన రచనలను ప్రామాణికాలుగా పరిగణిస్తారు. ఆయన రాసిన `బ్రిటన్ ఉడ్స్ అండ్ ఆఫ్టర్” అనే గ్రంథం ప్రపంచ వ్యవహారాల భారతీయ మండలి ( ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్-ఐసీడబ్యూఏ)ప్రచురించింది. కృష్ణా-గోదావరి బేసిన్ చమురు నిక్షేపాల వెలికితీతకు శ్రీకృష్ణ జరిపిన అధ్యయనమే స్ఫూర్తిగా చెబుతారు. రాజోలు తీర ప్రాంతంలో సహజవాయువు, ఇంధన నిక్షేపాలు ఉన్నాయనే దానిని అర్థశాస్త్ర రీడర్ గా ఉన్నప్పుడే గమనించి, మరింత పరిశోధన జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలకు స్పందన రాలేదు.
పుస్తక ప్రియుడు :
శ్రీకృష్ణ సాహిత్యాభిమని, పుస్తకప్రియులు. ఏ మాత్రం తీరిక దొరికినా విశ్వ విద్యాలయం గ్రంథాలయానికి వచ్చేవారట. ఆయన జీవితకాలంలో సేకరించిన, కొన్న గ్రంథాలను విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి బహుమతిగా ఇచ్చారు. విశ్వ విద్యాలయం గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణానికి ఆయన చొరవకాణంగానే అమెరికాలోని ఫోర్డ్ ఫౌండేషన్ నిధులు ఇచ్చింది. 59వ ఫిబ్రవరి 16వ తేదీన గుండెపోటుతో ఆయన కన్నుమూశారు.ఆయన తరువాత ఉపకులపతిగా వచ్చిన శ్రీనివాస అయ్యంగార్ గ్రంథాలయానికి శ్రీకృష్ణ పేరు (Dr.V.S.Krishna Memorial Library) పెట్టడంతో పాటు ఆయన గ్రంథాలయం ముందు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా ఆయనను వారిని చిరస్మరణీయులను చేశారు.
(ఫిబ్రవరి 16న వీఎస్ కృష్ణ వర్ధంతి)