అమెరికా రోడ్లపై
నా మొదటి కారు నడుపుతున్నప్పుడు
జారు రాజు కున్నంత గీర జోరు
అడగకుండానే వచ్చి చేరాయి.
‘ఈజీ మనీ’ వచ్చి చేరడంతో జీవితంలోని పాత పేజీలను
ఒక్కొక్కటే చింపేయడం మొదలు పెట్టాలనుకున్నా.
నాతో కలిసి వర్షపు గుంటల్లో
చిందులు వేసిన నేస్తాలను,
మల్లి రెడ్డి తోటలో లేత మామిడి పిందెల్ని
తస్కరించిన తొడుదొంగల్ని,
చిట్టి వాగు ఒడ్డున చేసిన చిలిపి పనులకు
కర్నూలు పోయి కడుపు తీయించు చున్న
కనక మహా లక్ష్మిని,
కట్టకట్టి అటక లోపల దాచేయాలనుకున్నా.
నన్ను చేయి పట్టి నడిపించిన పెద్దలను,
నాకు గోరుముద్దలు పెట్టిన
అమ్మలను, అక్కలను, అత్తలను,
నన్ను ముద్దాడిన దగ్గరి, దూరపు చుట్టాలను,
నా ఉన్నతి చూసి గర్వించిన ఊరిని
మరపు పొరల అడుగున
మడిచి పెట్టాలనుకున్నా.
రెండు దోసిళ్ళ గంజిలో ఒక్క అన్నం మెతుకు
కోసం వెతికినప్పటి క్షణాలను
పగలు ఎండ మామను, రాత్రి చంద మామను
చూపించిన చూరు లోని చిల్లులను,
అర్థరాత్రి వచ్చిన వర్షంతో గుడిసె నీటి గుండమై,
దానిలో నా నులక మంచం తేలి యాడినప్పుడు
నేను భయం తో అరచిన అరుపులను
కాగితం పడవలుగ చేసి అమెజాన్ ప్రవాహంలో
ముంచేస్తామని అనుకున్నా.
కానీ అది అనుకున్నంత సులభమేమి
కావడం లేదు…
అన్ని జ్ఞాపకాలు, పెళుసు పాత కాగితాలు కావు…
ఎన్నో, ఎన్నెన్నో కఠిన శిలా శాసనాలు.
Also read: మళ్లీ మనిషిగా పుడదాం
Also read: నేటి భారతం
Also read: వ్యధ
Also read: అక్షర క్షేత్రం
Also read: చవుడు భూమి