(గదబపాలెం ఆదివాసీల భూమి హక్కుల సాధనపై , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ గాను, భారత ప్రభుత్వం ఇంధన కార్యదర్శిగా పని చేసిన విశ్రాంతి సీనియర్ IAS అధికారి శ్రీ EAS శర్మ మరియు వారి శ్రీమతి రాణి శర్మ గార్ల స్పందన)
అజయ్,
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాత మల్లమ్మ పేట శివారులో, గదబలు దశాబ్దాలుగా సాగుచేస్తున్న భూములను, విదేశాలలో నివసిస్తున్న భూ రాబందులు స్థానిక రెవెన్యూ, సర్వే అధికారులతో కుమ్మక్కయి, గ్రామ రికార్డులు తారుమారు చేసి, ఎలా ఆక్రమించారో , మీ సహాయంతో, నిస్సహాయులైన గదబలు ఎలా ఏళ్ల తరబడి ఉద్యమం చేసి, అదే అధికారుల చేత వారు 2022 లో గదబలకు వ్యతిరేకంగా పంపించిన రిపోర్టులు తప్పని ఒప్పించారో, మీరు పంపించిన వీడియో ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తున్నది. మీరు గదబలతో చేసిన ఉద్యమం గురించి ఆదివాసీ గ్రామాల్లో విస్తృతంగా తెలియాలి. మీ అందరికీ నా హృదయపూర్వక మైన అభినందనలు.
నా ఉద్దేశంలో, మీ వీడియో వల్ల తెలుస్తున్నదేమంటే, పెద్ద జీతాలు తీసుకుంటూ, ఆదివాసీ ప్రజల హక్కులను, ముఖ్యంగా PVTG తెగకు చెందిన ఆదివాసీల హక్కులను, పరిరక్షించ వలసిన ఉన్నత అధికారులు, వారి బాధ్యతలు నిర్వర్తించకపోవడమే కాకుండా, ధనికులైన భూ కబ్జాదారులకు అనుకూలంగా, చట్టవ్యతిరేకంగా ప్రవర్తించడం. లేకపోతే, గదబ ఆదివాసీలు ఏళ్ల తరబడి ఉద్యమం చేస్తే కాని, రెవెన్యూ అధికారులు కళ్ళు తెరిచి, వారి సాగు హక్కు ను గుర్తించరా?. అటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి.
అనకాపల్లి, ASR జిల్లా, మిగిలిన జిల్లాల్లో, వందలాది గ్రామాలలో, పెద్ద ఎత్తున భూ కబ్జాదారులు, ఆదివాసీల భూములను అక్రమంగా గ్రామ రికార్డులను తారుమారు చేసి, ఆ భూములు తమవే అని నమ్మిస్తున్నారు. ఈ వీడియో చూసి అయినా, ఉన్నత అధికారులు మేలుకుని, ఆదివాసీల సమక్షంలో, వారు సాగుచేస్తున్న భూములను సమగ్రంగా సర్వే చేయించి, వారి హక్కులను పరిరక్షిస్తారని ఆశిస్తున్నాను.
రాజ్యాంగం మనకిచ్చినది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అటువంటి ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వాధికారులు, ప్రజల గడప వద్దకు వెళ్లి, వారి సమస్యలను పరిష్కరించాలి కాని, ప్రజలు తమ వద్దకు వచ్చి, పదేపదే అర్ధించమనడం, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచినట్లు అవుతుంది. వారి బాధ్యతలను, ఇప్పటికైనా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను
ఈ అ స శర్మ
16-1-2024