- దిల్లీ, అస్సాం, గుజరాత్ లలో భూకంపాలు
- టర్కీ, సిరియా ప్రమాద ఘంటికలు ఇక్కడిదాకా వినిపిస్తున్నాయి
తుర్కీయే, సిరియా భూకంప ప్రళయ ఘోషలు ఆగకముందే మన దేశంలోనూ అక్కడక్కడా సంభవించిన ప్రకంపనలు భయకంపితులను చేస్తున్నాయి. అస్సాంలోని నాగోన్ ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ఇది ఆదివారం జరిగింది. మొన్న శుక్రవారం నాడు గుజరాత్ లో అర్ధరాత్రి భూమి స్వల్పరీతిలో కంపించింది. రెక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రత నమోదైంది.ఈ నెల మొదటి వారంలో మణిపూర్ లోని ఉఖ్రుల్ లో ఉదయాన్నే రెక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో భూమి వణికింది. ఒక నెల రోజుల క్రితం దిల్లీ మహానగరాన్ని మొదలుకొని మరికొన్ని ప్రాంతాలలో ఇదే వాతావరణం ఏర్పడి ప్రజలను భయకంపితులను చేసింది. ఈ సంఘటనల నేపథ్యంలో భారతదేశంలో భూకంపాల తీరుతెన్నులపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి సుమారు 59 శాతం భూభాగం భూకంపాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత భూఫలకం ఏడాదికి 47మిల్లీమీటర్ల వేగంతో ఆసియా ఫలకంలోకి చొచ్చుకొని పోతోంది. మన దేశంలో భూకంపాలు పుట్టుకురావడానికి దీనిని ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also read: మరుపేలరా ఓ మానవా!
ఏ జోన్ తీవ్రత ఎంత?
గత భూకంపాల అనుభవాలపై మన దేశంలోని ప్రాంతాలను నాలుగు మండలాలుగా విభజించారు. వీటిల్లో 5 జోన్లు ఉన్నాయి. ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం జోన్ :5 గా వర్గీకరించారు. జోన్:2 ను తీవ్రత తక్కువ కలిగిన ప్రాంతంగా చెబుతారు.కశ్మీర్, పశ్చిమ,మధ్య హిమాలయాలు, ఉత్తర, మధ్య బీహార్, ఈశాన్య భారత ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు ముప్పు అత్యధికంగా ఉండే ప్రాంతాలుగా గుర్తించారు. దక్షిణాది భూభాగాలు, గోరఖ్ పూర్, చండీగడ్ లోని కొన్ని ప్రాంతాలు స్వల్పమైన తీవ్రత కలిగినవిగా చూస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ నష్టం ఎక్కువ సంభవించే జాబితాలోనే ఉంది. చెన్నై, బెంగళూరు, ముంబయి, కోల్ కతా మొదలైనవి మధ్యస్థ ప్రభావం కలిగిన నగరాల శ్రేణిలో ఉన్నాయి. ఈ ముప్పై ఏళ్ళల్లో మన దేశం కూడా భూకంప చేదు అనుభవాలను ఎదుర్కొన్నది. 1993లో లాతూర్ లో వచ్చిన భూకంపంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. 2001లో సంభవించిన భుజ్ భూకంపం కూడా చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది.ఎంతటి ఆధునిక శాస్త్ర అభివృద్ధి జరిగినా ప్రకృతి వైపరీత్యాలను ఎప్పుడు వస్తాయో ఏ స్థాయిలో ఉంటాయో కచ్చితంగా అంచనా వేయలేం. వచ్చే విపత్తులను దృష్టిలో పెట్టుకొని నష్టం శాతాన్ని ఎంతోకొంత తగ్గించుకొనే జాగ్రత్తలను పాటించడమే మనం చేయగలిగినది. భూకంప ప్రూఫ్ బిల్డింగ్ పాలసీని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి.
Also read: కళాతపస్వికి పర్యాయపదం
ముందు జాగ్రత్తలు ముఖ్యం
భూకంపాలు వచ్చినప్పుడు భవనాలు కుప్పకూలిపోవడం వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణాలు, మౌలిక సదుపాయాలను నిర్మించేప్పుడు ప్రభుత్వాలు నిర్దేశాలను పాటించడం క్షేమదాయకం. భవనాల నిర్మాణం, మరమ్మత్తులు, పటిష్ఠతలకు సంబంధించిన కొన్ని సూచనలను నిపుణులు రచించారు. ప్రభుత్వాలు వీటిని పర్యవేక్షణ చేస్తాయి.ఈ పర్యవేక్షణలో అధికారులు రాజీ పడకూడదు, ప్రలోభాలకు లొంగకూడదు. వీటన్నిటి కంటే స్వయంక్రమశిక్షణ ముఖ్యం. భూమి ప్రయాణాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలి. ప్రకృతికి కోపం రాకుండా చూసుకోవాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు బెంబేలెత్తిపోవడం, హడావిడి నిర్ణయాలు తీసుకోవడం కాదు. ముందు జాగ్రత్తలే ముఖ్యం.
Also read: రాహుల్ జైత్రయాత్ర