- ప్రజాస్వామ్య ప్రయోగానికి తెలుగు రాష్ట్రం వేదిక కావడం విశేషం
- ఇది జయప్రదమైతే ఇతర రాష్ట్రాలలోనూ అమలు
- పరిమితమైన ఓటర్లకు మాత్రమే ఈ వసతి
సాంకేతికత కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న నవీన నాగరిక సమాజంలో ఎన్నో వింతలు విశేషాలు చూస్తున్నాము. దేశ పాలనకు అత్యంత కీలకమైన ఓటింగ్ విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి, వస్తూనే వున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటగా ఒక ప్రయోగం చేసింది. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి ఇంటి దగ్గర నుంచే ఈ – ఓటు వేసే విధానానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ – ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం రూపొందించిన ఈ -ఓటు విధానంలో ఖమ్మంలో పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినప్పటికీ, ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను చేపట్టారు. సాంకేతికంగా ఎటువంటి సమస్యలు రాకపోవడం, చాలా వేగంగా పోలింగ్ నమోదవడంతో ఈ విధానం విజయవంతమవుతుందనే విశ్వాసం అధికారులలో కలిగింది.
Also read: తెరపైకి మళ్ళీ శశికళ
యాప్ ద్వారా పోలింగ్
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ యాప్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు.2128మంది ఓటర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టినప్పటికీ, భవిష్యత్తులో దీనిని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా 15-20 ఏళ్ళ నాటి ఫోటోను కూడా సరిపోల్చగలిగల సాంకేతిక వ్యవస్థను ఇందులో పొందుపరిచారు. ఇంగ్లిష్ తో పాటు తెలుగు భాషలో వివరాలను విశదపరుస్తున్నారు. ఎలా నమోదు చేసుకోవాలి? ఓటు ఎలా వెయ్యాలి? తదితర విషయాలు తెలుసుకొనేలా వీడియోలను అందుబాటులో ఉంచారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగించారు. ఓటరు పేరు, ఆధార్, లైవ్ లొకేషన్, ఇమేజ్ మ్యాచింగ్ వంటివాటిని సరిచూస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో,ఆన్ లైన్ విధానంలో వేసిన ఓట్లు చెరిగిపోకుండా తిరిగి లెక్కించే సదుపాయం ఉంది. భద్రతా ప్రమాణాల కోసం ఈ డేటా మొత్తాన్ని స్టేట్ డేటా సెంటర్ లో భద్రపరుస్తారు. మొత్తంమీద ఈ అత్యాధునిక ఓటింగ్ విధానానికి తెలంగాణ ముఖద్వారం కావడం విశేషం. కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టిన తర్వాత, ఆరోగ్య రక్షణ కోసం అత్యాధునిక సాంకేతికతను మరింతగా సద్వినియోగం చేసుకొనే భావనలు పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచం వైపు అడుగులు పడడంలో వేగం బాగా పెరుగుతోంది. కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఈ ఓటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతానికి వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, అత్యవసర విభాగాల్లో సేవలు అందిస్తున్నవారు, ఎన్నికల కార్యక్రమంలో విధులు నిర్వహించేవారు, ఐటీ రంగానికి చెందినవారి వరకూ మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పేపర్ బ్యాలెట్ విధానం ఎక్కువ కాలం రాజ్యమేలింది. రిగ్గింగ్ భయాలు, సమయం, డబ్బు, శ్రమ వృధా మొదలైన కారణాలతో దానిని రద్దు చేయాలనే డిమాండ్లు పెరిగాయి. వాటి స్థానంలో ఈ.వి.ఎంలు వచ్చేశాయి. ఈ.వి.ఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. 1990లలో ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఆరంభించారు.1998-2001 మధ్య దశలవారీగా పరిచయం చేయడం ప్రారంభమైంది.
Also read: కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమైందా?
ఇవిఎంలపై విమర్శల వెల్లువ
ప్రస్తుతం ఎన్నికలు పూర్తిస్థాయిలో ఈ.వి.ఎంల ద్వారానే జరుగుతున్నాయి. ఈ విధానం పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గెలిచిన పార్టీలు, అభ్యర్థులు మిన్నకుంటున్నారు. ఓడిపోయిన పక్షాలు విమర్శనా బాణాలు ఎక్కుపెడుతున్నాయి. ముఖ్యంగా ఎన్ డి ఏ ప్రభుత్వంపై ఎక్కువగా వచ్చాయి. ఓటమిపాలైనవారు కోర్టుగడపలు తొక్కుతూనే ఉన్నారు. ఈ సందర్భంలో, ఈ.వి.ఎంలకు తోడుగా వి.వి.పి.ఏ.టి ( ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ) వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చేట్లుగా న్యాయస్థానాలు ఆదేశించాయి. అయినప్పటికీ టాంపరింగ్ పై అనుమానాలు, విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. వ్యవస్థలను నడిపించే పాలకులే ఈ తప్పుడు అభ్యాసాలకు మూలవిరాట్టులని ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ అంశాలపై ఎన్నో కేసులు న్యాయస్థానాల్లో మగ్గుతూనే ఉన్నాయి. ఈ.వి.ఎంలు రాకముందే కొందరు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ, కొందరు సమర్థిస్తూ న్యాయస్థానాలని ఆశ్రయించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్,దిల్లీలో ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ప్రదర్శించారు. ఈవీఎం విధానం రాజ్యాంగబద్ధమేనని 2002 ప్రాంతంలో సుప్రీంకోర్టు స్పష్టపరచింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రయోగానికి కేరళ, గోవా కూడా వేదికగా నిలిచాయి. ఇప్పుడు అత్యాధునికంగా స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటి దగ్గర నుంచే వేసే ఈ -ఓటింగ్ ప్రయోగానికి తెలుగురాష్ట్రమైన తెలంగాణ వేదిక కావడం ముదావహం. ఇందులో పాలుపంచుకున్న బృందాన్ని అభినందిద్దాం. ఇందులో మంచిచెడులు ఇంకా పూర్తిగా తెలియరావాల్సి వుంది. ఇది విజయవంతమైతే మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో ఇంకా తెలియాలి. ఈ -ఓటింగ్ విధానాన్ని అమలుచేయాలంటే పార్లమెంట్ లో చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టి,ఆమోదం పొందడం మొదలైనవి ఉన్నాయని అనుకోవాలి. ఎన్నికల విధానంలో పారదర్శకత లోపిస్తోందనే మాటలు దశాబ్దాలుగా వింటున్నాం. మొత్తంగా ఎన్నికల విధానంలోనే ఎంతో ప్రక్షాళన జరగాలని మేధావులు సూచిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో అవినీతిపరులు,అక్రమార్కులు పెరుగుతున్నారన్నది చేదునిజం.ఈ -ఓట్ ప్రయోగం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో వేచిచూద్దాం. ప్రజాప్రయోజనంగా, దేశహితంగా ఉండే ఏ విధానాన్నైనా స్వాగతించవచ్చు.
Also read: డిజిటల్ డబ్బుల దిశగా ప్రపంచం అడుగులు