ఒక ఈసడింపు ఒక మహాకళాకారుడిని సృష్టించింది.సంగీతం లోకానికి కొత్త `ద్వారం`తెరిచింది. ఆంధ్రదేశానికి అనర్ఘ సంగీత రత్నాన్ని ప్రసాదించింది. వయోలిన్ వాద్యంలో అత్యున్నత శిఖరాన నిలిపింది.
ఆ సంగీతరత్నమే…. ద్వారం వెంకటస్వామి నాయుడు. పదేళ్ల వయస్సులో చూపు మందగించింది. ఒకరోజు తరగతి గదిలో అక్షరాలు రాయలేకపోతే `గుడ్డి వాడికి చదువెందుకు` అన్న గురువు మాటలతో గుడ్లనీరు కక్కకుంటూ ఇంటికి చేరారు. అన్న వెంకటకృష్ణమ నాయుడు దగ్గర వయోలిన్ అభ్యాసం మొదలు పెట్టారు. అలా చిన్నచిన్న కచేరీలలో ప్రశంసలు అందుతున్నా విజయనగరం సంగీత కళాశాలలో చేరి మరిన్ని మెళకువలు నేర్చుకోవాలనుకున్నారు. అక్కడికి చేరుకున్నారు. ఆ సమీపంలోని కోరుకొండలో రాజావారి సమక్షంలో ప్రతి శుక్రవారం జరిగే సంగీతసభలో భాగంగా ఆ రోజు ద్వారం వారికి అవకాశం దక్కింది. రాజావారు అభినందించి, సంగీత కళాశాలలో వయోలిన్ అధ్యాపకుడిగా నియమించారు. ద్వారం విద్యార్థిగా వెళ్లి అయ్యవారుగా ఎదిగారు. అది హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారి పుణ్యమే అని చెప్పకునేవారు ద్వారం. ఆయన ప్రవేశం కోసం వెళ్లినప్పుడు,ఆ కళాశాలలో ప్రిన్సిపాల్ గా ఉన్న ఆదిభట్ల వారు ఆయన విద్యను కొంత పరీక్షించి `రేపు కోరుకొండ రాజమందిరానికి రా. ఆనంద గజపతి వారు కూడా విన్నాక నీకు ప్రవేశం ఇవ్వాలో? వద్దో నిర్ణయిస్తాం`అని చెప్పారు.కచేరీ మొదలయ్యాక రాజావారు, దాసుగారు పరస్పరం చూసుకున్నారట. `అబ్బాయ్! ఏమీ అనుకోకు నీకు విద్యార్థిగా ప్రవేశం ఇవ్వడం కుదరదు…కష్టం…`అని దాసుగారు తాపీగా చెప్పారు. దాంతో నిరాశపడిన నాయుడుతో `పుంభావ సరస్వతివి. నీవు విద్యార్థివి ఏమిటి? నువ్వే గురువువి` అని ఆశీర్వదించారు.
అక్కడి నుంచి ద్వారం వారి వాయులీన సంగీత జైత్రయాత్ర మొదలైంది. ఉత్తర దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పట్టణాల్లో సంగీత కచేరీలు చేశారు. అనేక సన్మానాలు అందుకున్నారు. 1931లో విశాఖలో ఒక కార్యక్రమంలో ఆంధ్ర విశ్వకళాపరిషత్ అప్పటి ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వయోలిన్ తోపాటు వజ్రపుటుంగరంతో సత్కరించారు .1935లో జయపూర్ మహారాజా సువర్ణఘంటా కంకణం బహూకరించారు.1940లో మైసూర్ మహారాజా నుంచి బంగారు రాజముద్రికతో పాటు `సంగీత రత్నాకర` బిరుదును అందుకున్నారు. అదే ఏడాది ఆంధ్ర విశ్వకళాపరిషత్ `కళాప్రపూర్ణ`తో, మరుసటి సంవత్సరం మద్రాస్ మ్యూజిక్ అకాడమీ `సంగీత కళానిధి`తో సత్కరించాయి.1953లో రాష్ట్రపతి పురస్కారం, 1957లో పద్మశ్రీ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్ స్వీకరించారు. 1964లో రాష్ట్ర ఆస్థాన సంగీత విద్వాంసుడిగా నియమితులయ్యారు.ఆ సందర్భంగా సంగీత నాటక అకాడమీ సన్మానం అందుకున్న రాత్రి (నవంబర్ 25) గుండెపోటుతో కన్నుమూశారు. ఇదే నెల 8వ తేదీన (1893)లో జన్మించిన ఆయన ఇదే నెలలో కన్నుమూశారు.
ఆయన ఎన్నో సన్మాలను అందుకున్నా `ఫిడేల్ నాయుడు‘ అన్న కవి మారేపల్లి రామచంద్రరావు పిలుపే ఎంతో ఇష్టమట. ద్వారం వారి కచేరీ ఆసాంతం విన్న మారేపల్లి వారు వేదికపైకి వెళ్లి తన వేలికి ఉన్న వజ్రపు ఉంగరాన్ని ఆయన వేలికి తొడిగి`అదరగొట్టేశావు ఫిడేల్ నాయుడు`అని ఆనందబాష్పలు రాల్చారు.
అనంతర కాలంలో ద్వారం వారిని కలిసిన చిన్ననాటి గురువు `అనాడు నిన్ను తిట్టినుందకు నన్ను మన్నించునాయనా? నువ్వు ఇంత ఉన్నతుడివి అవుతానని ఎరగనురా`అని కన్నీళ్లు పెట్టుకుంటే….‘నిజమే మీరు అలా అనకపోతే నాకు ఈ స్థాయి ఎక్కడ?’ అని పాదాభివందనం చేశారట.
(నవంబర్ 25 ద్వారం వారి వర్థంతి)