అవినాష్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే గా పోటీ
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 2024లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తారని, ప్రస్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే మిథునరెడ్డి ఎక్కడ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేస్తారో ఇంకా చెప్పలేదు. రాయచోటి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని చెబుతున్నారు.
మారుతున్న కడప రాజకీయ ముఖంచిత్రం
ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప రాజకీయ ముఖచిత్రం మార్చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను భారీగా సీఎం జగన్ మార్చివేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని ఇప్పటికే వై ఎస్ జగన్ సంకేతాలు ఇచ్చారు. ఇంటా, భయటా ఒకే సిద్దాంతం అన్న నినాదానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. జగన్ సొంత జిల్లాలో కూడా అభ్యర్థులను మార్చివేస్తున్నారు. జిల్లాలో తిరిగి తన పట్టును సాధించడానికి అభ్యర్థుల మార్పులు, చేర్పులు జగన్ చేపట్టారు. ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న వై ఎస్ అవినాష్ రెడ్డిని కమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ సూచించారాని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే గా ఉన్న జగన్ మేనమామ రవేంద్రనాథ రెడ్డికి 2024 అసెంబ్లీ టికెట్ లేదని జగన్ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాలో రెండు ఎస్సీ నియోజక వర్గాలు వున్నాయి. బద్వేల్, రైల్వే కోడూరు వున్నాయి. ఈ రెండు నియోజక వర్గాల్లో కూడా అభ్యర్థులను మార్చుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మైదుకూరు, రాజంపేటలలో కూడా అభ్యర్థులను మార్చుతున్నట్లు తెల్సింది. కడప సెంటిమెంట్ ముస్లింలకు ఇస్తారా లేక మరొకరిని ఎంపిక చేస్తారా అన్నది ఇంకా తేల్చలేదు. జమ్మలమడుగు లో ప్రస్తుతం ఎమ్మెల్యే గా డాక్టర్ సుధీరరెడ్డి వున్నారు. ఇక్కడ కూడ మార్పు చేస్తారా అన్నది చర్చలు జరుగుతున్నాయి. ప్రజాదరణ ఉన్న నేతలకే టికెట్లు ఇస్తానన్న మాటకే జగన్ సై అంటున్నారు. పని చేయని నేతలకు టికెట్లు ఇవ్వబోనని ముందు నుంచి జగన్ చెప్పుతున్నారు. పార్టీకి కట్టుబడి ఉండాలని ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ లకు జగన్ తేల్చిచెప్పారు. మార్పు, చేర్పుల వల్ల మంచి ఫలితాలు వుంటాయోనని వై సీ పీ ముఖ్య నేతలు చర్చిచుకుంటున్నారు.