వోలేటి దివాకర్
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు బలవంతపు బ్రాహ్మణార్థంలా కనిపిస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెడి నడ్డాతో పొత్తు చర్చల అనంతరం పవన్ హావభావాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. తెలంగాణాలో పొత్తుకు ఆయనను బిజెపి పెద్దలు బలవంతంగా ఒప్పించారన్న ప్రచారం సాగుతోంది. ఎపిలోని తన మిత్రపక్షమైన టిడిపి తరహాలో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని లేదా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఒంటరిపోరుకు సిద్ధం కావాలని భావించారని చెబుతున్నారు. అయితే, ఢిల్లీలోని బిజెపి పెద్దలు ఫెమా లాంటి చట్టాలను బూచిగా చూపించి పవన్ ను పొత్తుకు బలవంతంగా ఒప్పించారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ సతీమణి రష్యాకు చెందినది కావడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఎపిలో బిజెపికి పెద్దగా సీన్ లేకపోవడంతో పవన్ ఎవరితో కలిసినా… వారికి నష్టం ఉండదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఎపిలో ఏ పార్టీ ఎంపి గెలిచినా బిజెపి మిత్రపక్షంగానే ఉంటారన్నది జగమెరిగిన సత్యం.
Also read: టిడిపి, జనసేన చారిత్రాత్మక సమావేశంలో బిజెపికి చోటు లేదా?!.. మరి తెలంగాణాలోనూ అంతేనా?!
ఒకవైపు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కాలికి బలపం కట్టుకుని తీవ్రస్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వంటి వారు విస్తృతంగా ప్రచార ర్యాలీల్లో పాల్గొంటున్నారు. బిజెపి జాతీయ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా సహా రాష్ట్ర బిజెపి నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు కూడా తెలంగాణాలో విస్తృత ప్రచారం సాగిస్తుండగా తెలంగాణాలో బిజెపి మిత్రపక్షం జనసేనాని పవన్ ప్రధాని నరేంద్రమోడీతో కలిసి హైదరాబాద్ లో జరిగిన బిసి ఆత్మగౌరవ సభలో వేదిక పంచుకోవడం మినహా కాలు కదపకపోవడం… నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. మోడీ సభలో కూడా పవన్ తనదైన ఆవేశపూరిత ప్రసంగానికి భిన్నంగా మాట్లాడటం, కనీసం అధికార టిఆర్ఎస్ ను పల్లెత్తు విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం.
తెలంగాణా ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు 8 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆంధ్రావారు ఎక్కువగా నివసించే కూకట్ పల్లి, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, ఎపి సరిహద్దు ప్రాంతమైన వైరా, అశ్వారావు పేట, రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు బిజీపీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచారు. కనీసం తమ అభ్యర్థుల గెలుపుకోసమైనా పవన్ ప్రచారానికి వెళతారా అన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో కలుగుతోంది. ఎపిలో అధికార వైఎస్సార్ సిపి ప్రభుత్వంపై తాటతీస్తా అంటూ ఆవేశంగా ఊగిపోయే పవన్ కు తెలంగాణాలో ఏ మొహమాటాలు అడ్డువచ్చాయో అర్థం కావడం లేదన్న చర్చ సాగుతోంది. తెలంగాణాలో 30 సీట్లలో పోటీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన పవన్ 8 సీట్లకు పరిమితం కావడం, ప్రచారానికి దూరంగా ఉండటం గమనార్హం. ఆపార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు కూడా అభ్యర్థులకు దక్కకపోవడం మరింత విచారకరం.
Also read: త్యాగులు ఎవరు ?…. తిరుగుబాటుదారులెవరు?!
మరోవైపు ఎపిలో ఆయన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో జెండా ఎత్తేయగా, ఆ పార్టీకి చెందిన సామాజిక వర్గీయులు అధికార బిఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ అటు కాంగ్రెస్ ను, తన కుటుంబం అంతా నివసిస్తున్న చోట అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ను నోరు తెరిచి, విమర్శించలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వచ్చేఏడాదిలో ఎపి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమితో బిజెపి జట్టు కడితే సమస్య లేదు. లేనిపక్షంలో తెలంగాణాలో మిత్రపక్షంగా ఉన్న బిజెపికి వ్యతిరేకంగా ఎపిలో పవన్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. బిజెపి దూరంగా ఉండి ఎపి కాంగ్రెస్, వామపక్షాలు ఈ కూటమితో జట్టు కడితే పవన్ బిజెపితో బంధం బీటలు వారే అవ కాశాలున్నాయి.
Also read: చంద్రబాబు అరెస్టు తరువాత….!