- అత్యంత కీలకమైన ఏఐపీ టెక్నాలజీని తయారుచేసిన డీఆర్ డీవో
- అగ్రదేశాల జాబితాలో చోటు సంపాదించిన భారత్
భారత్ చుట్టూ నీటిపైనా నేలపైనా చైనా పన్నుతున్న కుయుక్తుల నేపథ్యంలో మన రక్షణవ్యవస్థను త్వరితగతిన ఆధునీకరించాల్సిన ఆవశ్యకతను రక్షణరంగ నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను లెక్కచేయకుండా సముద్రజలాలపై పెత్తనం చెలాయించేందుకు చైనా వ్యూహరచన చేస్తోంది. చైనా కుయుక్తులను తిప్పికొట్టేందుకు తన తీర ప్రాంతాలను రక్షించుకునేందుకు భారత్ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో జలాంతర్గాములను అభివృద్ధి పరుస్తోంది.
ఇందులో భాగంగా డీజిల్‌తో పనిచేసే సంప్రదాయ జలాంతర్గాముల సమర్థతను మరింత పెంచే దిశగా భారత్ కీలక అడుగులు వేసింది. ఎన్నో ఏళ్లుగా ఇందుకు అవసరమైన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అభివృద్ధిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చేసిన పరిశోధనలు సత్పలతాలను ఇచ్చాయి. ముంబయిలో భూమిపై చేసిన ప్రయోగాల్లో ఇది సమర్థతను చాటిందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. నౌకాదళానికి అవసరాలకు తగ్గట్లుగా మార్చి చేసిన ప్రయోగ పరీక్షల్లో కూడా విజయవంతమైనట్లు డీఆర్ డీవో తెలిపింది. దీని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన డీఆర్‌డీవో, భారత నౌకాదళానికి చెందిన పరిశ్రమలను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, డీఆర్‌డీవో అధిపతి జి.సతీశ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.
స్వదేశీ పరిజ్ఞానంతో పలు ప్రయోజనాలు:
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ అవసరాలకు తగ్గట్లుగా రక రకాల ఏఐపీలను అభివృద్ధి చేసుకున్నాయి. డీఆర్‌డీవో రూపొందించిన ఏఐపీ ఫాస్పారిక్ యాసిడ్ ఫ్యూయెల్ సెల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇతర దేశాల టెక్నాలజీతో పోలిస్తే దీనివల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. జలాంతర్గామిలోనే హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే సౌలభ్యం ఉంది. డీఆర్‌డీవోకు చెందిన నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్) దీన్ని అభివృద్ధి చేసింది. ఫ్రాన్స్ సాయంతో నిర్మిస్తున్న స్కార్పీన్ తరగతి జలాంతర్గాముల్లో దీన్ని అమరుస్తారు.
నిశ్శబ్దంగా పయనించనున్న జలాంతర్గామి:
అణు జలాంతర్గామికి దీర్ఘకాలం పాటు నీటి అడుగున ఉండి సేవలందించే సామర్థ్యం ఉన్నప్పటికీ అందులోని రియాక్టర్ నుంచి నిరంతరం శబ్దాలు వెలువడుతుంటాయి. శత్రు నౌకాదళం ఆ ధ్వనులను గుర్తించి దాడిచేసే ప్రమాదం ఎక్కువడా ఉంటుంది. ఏఐపీ కలిగిన సంప్రదాయ జలాంతర్గాముల్లో ఇలాంటి శబ్దాలు వెలువడే అవకాశం ఉండదు. అందువల్ల ఇది శత్రువుకు దొరికే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి.
ఏఐపీ ప్రత్యేకతలు:
అణుశక్తితో నడిచే జలాంతర్గాములు దీర్ఘకాలం నీటి అడుగున ఉండగలవు. సంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములకు ఆ సామర్థ్యం లేకపోవడంతో బ్యాటరీల ఛార్జింగ్ కోసం తరచూ అవి సముద్ర ఉపరితలంపైకి రావాల్సి ఉంటుంది. దీనివల్ల జలాంతర్గాములకు పోరాట పటిమ తగ్గిపోతుంది. ఈ సమస్యను ఏఐపీ టెక్నాలజీ పరిష్కరిస్తుంది. దీని ఆధారంగా డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములు ఏకబిగిన నీటి అడుగున ఉండటమే కాకుండా పోరాట సామర్థ్యం కూడా అనూహ్యంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి: చైనాకు దీటుగా ఇండియా ఎదగాలి
దొడ్డి దారిన పొందేందుకు పాక్ యత్నాలు:
పాకిస్థాన్ కూడా ఏఐపీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తన వద్ద ఉన్న ‘అగోస్టా 90బి’ తరగతి జలాంతర్గాములకు వీటిని అమర్చాలన్న పాక్ విజ్ఞప్తిని ఫ్రాన్స్ తిరస్కరించింది. దీంతో చైనా నుంచి వాటిని పొందేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికే పాక్ వద్ద ఉన్న సాద్ జలాంతర్గామితో ఈ టెక్నాలజీ ఉన్నట్లు భారత్ గుర్తించింది.
బాలాకోట్ లో భారత వైమానిక దళ దాడి అనంతరం పాక్ నౌకాదళంలోని పీఎన్ఎస్ సాద్ ఆదేశ జలాల నుంచి అదృశ్యమైంది. దీని కోసం భారత నౌకాదళం తీవ్రంగా గాలించింది. అది ఎటువైపు వెళ్లిందో తెలుసుకునేందుకు భారీగా యుద్ధనౌకలు, విమానాలు, జలాంతర్గాములతో అరేబియా సముద్రాన్ని శోధించాయి. సాద్ జలాంతర్గామితో తీవ్ర ముప్పు పొంచి ఉందని భావించిన భారత్ దాని ఆచూకీ తెలుసుకునే వరకు ముమ్మర గాలింపు చేపట్టింది. సాద్ లో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ పరిజ్ఞానం ఉంది. దీనివల్ల అది సాధారణ జలాంతర్గాములతో పోలిస్తే శత్రువు కళ్లుగప్పి ఎక్కువ రోజుల పాటు నీటి కింద ఉండి పోగలదు. పాక్ జలాంతర్గామి కోసం భారత్ సముద్ర జలాలను జల్లెడపట్టింది. ఇందుకోసం శాటిలైట్ల సాయాన్ని కూడా తీసుకుంది. 21 రోజులపాటు నిరంతర నిఘా ద్వారా సాద్ ను పాక్ పశ్చిమ తీరంలో కనుగొన్నారు. బాలాకోట్ దాడుల తర్వాత పీఎన్ఎస్ సాద్ జలాంతర్గామిని కూడా ధ్వంసం చేస్తారేమోనన్న అనుమానంతో పాక్ పశ్చిమ తీరంలో దాచినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో భారత్ ఏఐపీ టెక్నాలజీ అభివృద్ధిపై పరిశోధనలు చేసి ఎట్టకేలకు విజయం సాధించింది. ఏఐపీ పరిజ్ఞానం ఇప్పటివరకు ఉన్న అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్ దేశాల సరసన భారత్ చేరింది.
ఇదీ చదవండి:నమ్మరాని పొరుగుదేశం చైనా