- ముర్ముకు 540 మంది ఎంపీలూ, సిన్హాకు 208 మంది
- భారత రిపబ్లిక్ చరిత్రలో రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ
ఎన్ డీ ఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవికి ఎన్నికైనారు. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై తేలికగా గెలుపొందారు. ముర్ముకు యాభైశాతం కంటే అధికంగా ఓట్లు వచ్చినట్టు మూడోరౌండ్ చివరలోనే తేలింది. నాలుగో రౌండ్ లెక్కపెట్టడానికి ముందే ఆమె గెలిచినట్టు భావించి అస్సాం ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ముర్ము స్వగ్రామంలో గిరిజన యువతుల నృత్యం చేస్తూ ఆనందం ప్రకటించారు. రేపు ప్రధాని నరేంద్రమోదీ, తదితరులు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. 25వ తేదీని నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ద్రౌపది ముర్ము 20 జూన్ 1956న మయూర్భంజ్ జిల్లాలోని ఉపర్ బెడ్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి, తాత కూడా పంచాయతీ సర్పంచ్ లుగా ఎన్నికైనారు. ముర్ము కౌన్సిలర్ గా ఎన్నిక కావడం ద్వారా రాజకీయాలలో అడుగుపెట్టారు. ముందు కొంతకాలం అధ్యాపకురాలుగా పని చేశారు. అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారు. ఆ తర్వాత ఒడిషా ఇరిగేషన్ శాఖలో జూనియర్అసిస్టెంట్ గా చేరారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి ఎంఎల్ఏగా ఎన్నికైనారు. బీజేపీ-బీజేడీ మిత్రమ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణా శాఖలను నిర్వహించే సహాయమంత్రిగా స్వతంత్ర ప్రతిపత్తితో కొన్ని మాసాలు పని చేశారు.
రెండు వేల పదిహేను మే 18న జార్ఖండ్ గవర్నర్ గా పదవీబాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఒక ఆదివాసీ మహిళను దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం అదే ప్రథమం. రఘుబీర్ దాస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక బిల్లుపైన సంతకం చేయడానికి ముర్ము నిరాకరించారు. ఆదివాసుల భూములను వాణిజ్య ప్రయోజనాల నిమిత్తం కౌలుకు ఇవ్వడానికి అవకాశం కల్పించే బిల్లు అది. దాని వల్ల ఆదివాసులకు జరిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆయన చెప్పలేకపోయారు. గవర్నర్ సంతకం చేయలేదు. బిల్లు చట్టం కాలేదు.
ద్రౌపది ముర్ము జీవితంలో విషాదఛాయలు లేకపోలేదు. భర్త శ్యాంచంద్ర ముర్ము 2014లో చనిపోయారు. ఇద్దరు కుమారులు కూడా మరణించారు. వారి జ్ఞాపకార్థం ఒక విద్యాలయం నెలకొల్పి నిర్వహిస్తున్నారు.
ఒక గిరిజన మహిళ గవర్నర్ గా పని చేయడం, చాలా హుందాగా నడుచుకోవడం, ఇప్పుడు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం స్వాగతించవలసిన పరిణామం. అంతా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అమలు జరిగిన వ్యూహం. ఆంధ్రప్రదేశ్ పత్యేకత ఏమిటంటే ఆ రాష్ట్రంలో ఓట్లన్నీ ముర్ముకే పడ్డాయి. తక్కిన రాష్ట్రాలలో కూడా ఓట్లు చీలాయి. ప్రతిపక్షం అధికారంలో ఉన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్ఏ సీతక్క ముర్ముకు ఓటు వేసినట్టు చెబుతున్నారు. మొత్తం 540 మంది పార్లమెంటు సభ్యులు ముర్ముకు ఓటు వేయగా యశ్వంత్ సిన్హాకి 208 మంది ఓటు చేశారు. ప్రతిపక్షాలకు చెందిన 17 మంది ఎంపీలు తమ అభ్యర్థికి ఓటు చేశారని బీజేపీ నాయకులు ప్రకటించారు. వారి లెక్కల ప్రకారం ముర్ముకు 523 ఓట్లు మాత్రమే రావాలి. కానీ వచ్చిన ఓట్ల సంఖ్య 540. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలను తృణమూల్ కాంగ్రెస్ బహిష్కరిస్తుందని అంటున్నారు. ప్రతిపక్షాలు ఈ విధంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే బీజేపీకి అంతకంటే కావలసింది ఏమున్నది?