- రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ
- పల్లెలో జన్మించి రాష్ట్రపతి భవన్ లో నివాసం
- 25న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము విపక్షాల ఉమ్మడిఅభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. దేశంలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. ప్రజాస్వామ్య నిర్మాణ సౌందర్యానికి ఇది ఒక మెచ్చుతునక. మొదటి రౌండ్ నుంచే ఆమె విజయయాత్ర ప్రారంభమైంది. ప్రతి రౌండ్ లోనూ గెలుపుపరుగులే తీశారు. మూడో రౌండ్ ముగిసేనాటికే కావాల్సిన ఆధిక్యతను సంపాయించుకున్నారు. ఆమె విజయం నల్లేరుపై బండి నడక వంటిదేనని ఎందరో ముందుగానే ఊహించారు. ఆ అంచనాలే నిజమయ్యాయి. ఇది ఎన్డీఏ విజయం, బిజెపి విజయమని చెప్పాల్సి వచ్చినా,ఇది ముమ్మాటికీ నరేంద్రమోదీ విజయం. అమిత్ షా తదితర ముఖ్యులతో కలిసి రచించిన వ్యూహం సాధించిన విజయం. ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించేంత వరకూ దేశ ప్రజలకు ఏ మాత్రం పెద్దగా పరిచయంలేని పేరు ద్రౌపదీ ముర్ము. ఆ ప్రకటనతో ఆమె వివరాలు సంపూర్ణంగా తెలుసుకుందామనే ఉత్సుకత ప్రజల్లో అపరిమితంగా పెరిగిపోయింది. గూగుల్, వికీపీడియాలో శోధనల సంఖ్య కోట్లు దాటిపోయింది.
Also read: బైడెన్ పరపతి పడిపోతోంది
యశ్వంత సిన్హా అసాధారణ వ్యక్తి
యశ్వంత్ సిన్హా పేరును విపక్షాలు ద్రౌపది పేరు కంటే ముందుగానే ప్రకటించాయి. నిజం చెప్పాలంటే ఎన్డీఏ అభ్యర్థి కంటే విపక్షాల అభ్యర్థి అత్యంత ప్రముఖుడు. ఆయన కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఐ ఏ ఎస్ అధికారి కూడా. పైగా నోరువాయి ఉన్నవాడిగా ప్రసిద్ధుడు. అయినప్పటికీ ఎన్డీఏ / బిజెపి బలం ముందు విపక్షాలు నిలబడలేకపోయాయి. వారి మధ్య ఐకమత్యం పైకి ఉన్నట్లు కనిపించినా, ఆచరణలో వారి అబలత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది. అభ్యర్థి ఎంపిక దశలోనే ఎన్డీఏ మంచి మార్కులు కొట్టేసింది. ఏడు పదులు దాటిన స్వాతంత్ర్య భారతంలో, మొట్టమొదటిసారిగా ఆదివాసీ మహిళను దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడమే గొప్ప ఘట్టం. అందునా వెనుకబడిన రాష్ట్రం నుంచి ఎంచుకోవడం అభినందించాల్సిన మరో అంశం. యశ్వంత్ సిన్హా వలె ప్రసిద్ధత లేకపోయినా ద్రౌపదీ ముర్మును ఎంపికచేయడం గెలుపు పట్ల ప్రధాని నరేంద్రమోదీకి వున్న అచంచలమైన ఆత్మవిశ్వాసానికి, విపక్షాల బలహీనతపై పెట్టుకున్న నమ్మకానికి ఉమ్మడిగా గొప్ప ఉదాహరణ. ఆయన అంచనాలు యధాతధంగా జరిగాయి. విపక్షాల వ్యూహాలు తారుమారయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థిగా ఆదివాసీ మహిళను ఎంపిక చేస్తారని నాకు ముందు తెలియలేదే… అని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నాలుక కరుచుకోవడంలోనే విపక్షాల వ్యూహ వైఫల్యం దాగివుంది. ద్రౌపదీ ముర్ము పేరు కొన్ని రోజుల ముందే బయటకు వచ్చింది. మీడియా కథనాలలో వెల్లడించిన పేర్లలో ఆమె పేరు కూడా ఉన్నదన్నది గమనార్హం. ఈ మాత్రం కూడా తెలియనట్లుగా మమతా బెనర్జీ అటువంటి వ్యాఖ్యలు చేయడం దాటవేట ధోరణికి తార్కాణం. ఒడిశాకు చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం కూడా వ్యూహమే. అందునా ఆదివాసీ మహిళను ఎంచుకోవడం కూడా వ్యూహంలో భాగమే. తటస్థంగా ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరచం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆదివాసీ మహిళను ఎందుకు ఎంపిక చేశారని అడిగే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఎదుటిమనిషిని నోరెత్తనీయకుండా చేయడమే వ్యూహం. మొత్తంగా చూడాలంటే.. అధికార పక్ష సంఖ్యాబలం, వ్యూహాశక్తి, విపక్షాల వైఫల్యం కలిసి ద్రౌపదీ ముర్ము ఘనవిజయంగా అభివర్ణించాలి. రాష్ట్రపతి ఎన్నికలో ఘనవిజయాన్ని సాధించినట్లే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అంతే గెలుపును సొంతం చేసుకుంటుంది.వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి కూడా విపక్షాలు పుంజుకుంటాయనే దాఖలాలు కనిపించడం లేదు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ ను అభ్యర్ధించినప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఎన్నికలలో విపక్షాల గెలుపు అసాధ్యమని ఆయనకు తెలుసు కాబట్టి, ఆ పందెం నుంచి తెలివిగా శరద్ పవార్ తప్పుకున్నారు. తమ అధికారాన్ని లాక్కున్నా, తమ పార్టీని చిన్నాభిన్నం చేసినా, పార్టీలో తమ స్థానమేంటో తెలియని అయోమయంలో పడేసినా, బిజెపి ఎంపిక చేసిన అభ్యర్థికే తమ మద్దతంటూ ఉద్దవ్ ఠాక్రే సైతం ప్రకటించారు.అదీ లెక్క! రాష్ట్రపతిగా సింహాసనంలో కూర్చోబోయే ద్రౌపదీ ముర్ము జీవితం కడు ఆసక్తిదాయకం.ఈ పదవిలో కూర్చోబోతున్న రెండో మహిళగా కూడా రికార్డుకెక్కనున్నారు.
Also read: ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ లో ముసలం
స్వాతంత్ర్య భానూదయం తర్వాతి తరం
ఇంతవరకూ రాష్ట్రపతిగా పదవిలో కూర్చున్నవారంతా స్వాతంత్ర్యానికి ముందుగా జన్మించినవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా ద్రౌపది చరిత్రలో మిగలనున్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ వేళల్లో ఆమె గెలుపు ఒక అందమైన అధ్యాయం. ఒడిశాలోని మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారు. తల్లిదండ్రులు నెలకు కేవలం 10రూపాయలు మాత్రమే ఇచ్చేవారు.ఆ డబ్బుతోనే భువనేశ్వర్ వెళ్లి కాలేజీలో చదువుకున్నారు. వారి ఊరి నుంచి అలా వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆమె కావడం విశేషం. ప్రభుత్వంలో చిన్న గుమస్తాగా ఉద్యోగపర్వం ప్రారంభించి, ఆ తర్వాత ఉపాధ్యాయురాలుగానూ కొంతకాలం పనిచేశారు. సుమారు నాలుగుపదుల వయస్సులో రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా, మంత్రిగానూ పదవులను అలంకరించారు. 2015లో ఝార్ఖండ్ గవర్నర్ గా నియమితులై మరో గౌరవమైన హోదాకు చేరుకున్నారు. నేడు దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి ఆమెను వరించింది. ఇంతటి విజయాల వెనక విషాదాలు కూడా దాగివున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నారు.ఆ తర్వాత భర్తను కూడా కోల్పోయారు. ప్రస్తుతం ఒక కుమార్తె మాత్రం ఉన్నారు. నిరాడంబరతకు నిలయమై, నిరుపేద గతానికి చిహ్నమైన ద్రౌపదీ ముర్ము జీవితం ఒక గొప్పయోగం. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి పదవులు రబ్బరుస్టాంపులుగా మారిపోతున్నాయి అనే చెడ్డపేరును పోగొట్టాల్సిన బాధ్యత వీరిపై ఉంది. పాలకులను,దేశాన్ని సన్మార్గంలో, వైభవప్రాభవంతో నడిపించాల్సిన కర్తవ్యం కూడా ఉంది. ద్రౌపదీ విజయం స్వాతంత్ర్య భారతంలో సరికొత్త అధ్యాయం.
Also read: అవునా, క్లౌడ్ బరస్టా?