- ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ
- రామ్ నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, నరేంద్రమోదీ, సోనియాగాంధీ హాజరు
- పార్లమెంటు సమావేశంలో వేదికపై అయిదుగురిలో ఇద్దరు తెలుగు ప్రముఖులు
రాష్ట్రపతిగా ద్రౌపది మున్రు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించిన తొట్టతొలి ఆదివాసీ మహిళ మున్రు చేత ప్రమాణం చేయించారు. ఈ వేడుక మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ నేత సోనియాగాంధీల సమక్షంలో జరిగింది. ‘జోహార్, నమస్కార్!’ అంటూ మొట్టమొదటి ట్వీట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చారు. అత్యున్నత పదవిలో తన విధులను సక్రమంగా నిర్వహించేందుకు భారతీయులు శుభాకాంక్షలు తోడ్పడతాయని ఆమె అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, మున్రు సొంతరాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ సభకు హాజరైనారు.
ద్రౌపది మున్రు ముందుగా రాజఘాట్ కు వెళ్ళి జాతిపితకు వందనం చేశారు. తర్వాత మాజీ రాష్ట్రపతి కోవింద్ నూ, ఆయన సతీమణిని కలుసుకున్నారు. గురువారంనాడు యశ్వంత్ సిన్హాను ఓడించి రాష్ట్రపతిగా ఎన్నికై సంచలనం కలిగించిన 64 సంవత్సరాల మున్రు ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 160 మైళ్ళ దూరంలోని రాయ్ రంగాపూర్ కు చెందిన ఆదివాసీ మహిళ. ఆ గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన రెండవ మహిళ మున్రు. మొదటి మహిళ మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్. జార్ఖండ్ గవర్నర్ గా 2015 ప్రమాణం స్వీకరించినప్పుడు ఆ రాష్ట్రానికి ఆమె తొలి మహిళా గవర్నర్. దేశంలోనే తొలి ఆదివాసీ మహిళా గవర్నర్.
అనంతరం పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో పేదలు కలలు కనవచ్చనడానికీ, ఆ కలలను సాకారం చేసుకోవచ్చుననడానికీ తన ఎన్నికే నిదర్శనమని చెప్పారు. ప్రాథమిక విద్య పొందడమే తన బాల్యంతో తన స్వప్నమనీ, దిగువ వర్గాల సంక్షేమం కోసం పాటుపడతాననీ చెప్పారు.
‘మీ భవిష్యత్తును నిర్మించుకోవడంతో పాటు దేశభవిష్యత్తుకు పునాదులు వేయండి. రాష్ట్రపతిగా మీకు నామద్దతు ఉంటుంది,’ అని ఆమె దేశ యువతకు పిలుపునిచ్చారు. అన్నట్టు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ద్రౌపది మున్రు ప్రసంగించిన సమయంలో వేదికమీద మొత్తం అయిదుగురు ఉన్నారు. ఆ అయిదుగురులో ఇద్దరు తెలుగు ప్రముఖులు- వెంకయ్యనాయుడు, ఎన్ వి రమణ – కావడం చారిత్రక విశేషం. తక్కిన ముగ్గురు రాష్ట్రపతి మున్రు, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ.