- మాజీ ప్రధాని ఊరుకు మహర్దశ పట్టేది ఎప్పుడు?
- గ్రామ వాసుల్లో ఆశలు నింపిన కేసీఆర్
- పీవీ పేరిట పరిశోధనా సంస్థ, విశ్వవిద్యాలయం స్థాపించాలని ఆకాంక్ష
నిన్నటి మొన్నటి వరకు కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామం వంగర. ఇప్పుడు వరంగల్ నగరానికి కూత వేటు దూరంలో జిల్లాల పునర్విభజనలో వరంగల్ రూరల్ కు మార్చబడిన ఈ ఊరు ప్రత్యేకత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు నివసించిన ఆయన స్వగ్రామం కావడం. వంగర తెలంగాణలోని అన్ని గ్రామాల మాదిరిగానే వెనుకబడిన గ్రామం.
దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే :
పీవీ ఎమ్మెల్యే నుండి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధామంత్రిగా పనిచేసి డెబ్భై ఏళ్ల రాజకీయ జీవీతంలో వంగర లో గడిపింది ఆయన కొంతకాలం మాత్రమే. అయితే “ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే” అన్న ఆయన మాటల వల్ల తన బాల్య జీవితానికి వంగర ఒక జ్ఞాపకంగా పదిలపర్చుకున్నారు. ఆయనతో వ్యవసాయ బావుల్లో ఈత కొట్టిన వారు, పానాది(త్రోవ) లో పరిగి రేగు పండ్లు తిన్న వారంతా పరమపదించారు. ఒక్కరో ఇద్దరో వయో వృద్ధులు ఊర్లో ఉన్నా వారికి పీవీ తో ఉన్న అనుబంధం తక్కువే. వరంగల్ (అర్బన్) జిల్లాలోని భీమదేవర పల్లి మండలంలోని రూపు రేఖలు నిన్నటి వరకు కూడా మారలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల పీవీ కి వందనాలు చేస్తూ ఆయన నివసించిన ఇంటిని స్మారక భవనంగా మారుద్దామని శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తానని ప్రకటించడంతో వంగర గ్రామస్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
మురికినీరు, బహిరంగ మూత్రవిసర్జన :
ఊర్లో పొంగి పొర్లుతున్న మురికి నీరు, బహిరంగ మూత్ర విసర్జనలు, బహిర్భూమిలో చెత్త చెదారానికి చెక్ పెట్టి దేశానికే ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దే ప్రక్రియకు కేసీఆర్ స్వీకారం చుడుతున్నారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడక, దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట లాగా వంగర గ్రామం ఈ ఏడాదిలో కొత్త రూపు దిద్దుకుంటుందనే ఆశలు వంగర యువతలో చిగురిస్తున్నాయి. వంగర ప్రస్తుత అసెంబ్లీ నియోజకవర్గం హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వోడితేల సతీష్ కుమార్ కూడా పివికి సమీప బంధువు కావడం కూడా గ్రామ ప్రజల ఆశలకు రెక్కలొచ్చాయి. వంగరకు వరంగల్, హైదరాబాద్, కరీంనగర్లతో బాగా సంబంధం ఉంది. గ్రామ ప్రజలు చాలా మంది ఈ పట్టణాలతో వ్యాపార, వాణిజ్య, విద్య ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.
ఇదీ చదవండి: బలగం లేని బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ
7 వేల జనాభా :
సమీప రైల్వే స్టేషన్ ఉప్పల్ కూడా 23 కి.మీ దూరంలో ఉంది. 1500 ఇళ్ళు, దాదాపు ఏడు వేల జనాభా గలిగిన వంగర గ్రామ పంచాయితీలో మహిళల జనాభా ఎక్కువ. పక్కనే ఉన్న ముల్కనూరు సహకార సొసైటీ మాదిరిగా మహిళా ఆర్థిక పటిష్టత కోసం ఇక్కడ మహిళలు ఆరాట పడుతున్నారు. వ్యవసాయం ప్రధాన ఆధారమైన వంగర గ్రామ ప్రజల్లో వరంగల్, హుజూరాబాద్ కు సరఫరా చేయడానికి కూరగాయల సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సరియైన సాగు పట్ల వీరిని ప్రేరేపించే వ్యవసాయ అధికారులు వస్తే గ్రామ ఆర్థిక పటిష్ట తకు బీజం పడుతుంది.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి :
కేసీఆర్ వంగర గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేయడానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. నిజానికి పీవీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా తెలంగాణకే కాకుండా దేశానికి, ప్రపంచానికి ఆర్థిక సంస్కరణల యోధుడిగా పేరు గాంచారు. మైనార్టీ ప్రభుత్వాన్ని చాణక్యనీతితో చాకచక్యంగా నడిపిన ధీరుడిగా పీవి కీర్తి గడించారు. తన గ్రామం భారత దేశంలో ఒక కుగ్రామంగానే భావించారు. ప్రత్యేకించి తన గ్రామం పట్ల శ్రద్ధ చూపలేదు.
ఇదీ చదవండి: వారసత్వ పాలనకు స్వస్తిపలికిన పివి
ఘనంగా శతజయంతి ఉత్సవాలు :
పీవీ వందేళ్ల పండుగను తెలంగాణ ముద్దు బిడ్డగా పీవీని కీర్తించి, పట్వారీ నుండి ప్రధాన మంత్రిగా ఎదిగిన ఆయన గ్రామాన్ని ప్రపంచం కీర్తించేలా చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దానిలో పీవీ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ఏడాది పొడుగునా జరగనున్నాయి. హుస్నాబాద్, వరంగల్ మార్గంలో ప్రధాన రహదారిపై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగర కు నాలుగు లైన్ ల రహదారిగా మార్చి ఎల్కతుర్తి, ముల్కనూరు నుండి కూడా వంగర గ్రామానికి నేరుగా రహదారులను అభివృద్ధి చేసి పారిశుధ్యం, ఇంటింటికి మరుగు దొడ్డి, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు, వంగర సైదాపూర్ మీదుగా ఉప్పల్ రైల్వే స్టేషన్ కు, హుజురాబాద్ కు రెండు వరుసలో రోడ్లను ఏర్పాటు చేసేలా కేసీఆర్ వంగర గ్రామాభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
స్మారక కేంద్రంగా పీవీ నివాసం :
ఇక పీవీ ఇంటిని స్మారక గృహంగా మార్చి దేశ విదేశాల్లో ఆయనకు వచ్చిన ప్రసంశా చిహ్నా లతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి టూరిజం శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఆ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ పలుసార్లు వంగర సందర్శించి పీవీ గృహాన్ని సుందర నందనవనంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇవన్నీ కార్యరూపం దాల్చడానికి మరో రెండేళ్లు పట్టవచ్చు. లేదా కేసీఆర్ తలుచుకుంటే ఆర్నెళ్లలో ఈ మౌలిక సదుపాయాలు అన్ని గ్రామానికి రావచ్చు.
చిగురించిన కొత్త ఆశలు :
ఈ వ్యాస రచయిత నిన్న వంగర గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామస్తుల్లో కొత్త ఆశలు కనబడ్డాయి. పీవీ ఎప్పుడు గ్రామానికి వచ్చినా ఇంటి పక్కనే ఉన్న శివాలాయనికి వెళ్లి నమస్కారం చేసి వచ్చే వారట. ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది. అలాగే ప్రధాన గ్రామంలో మురికి నీరు ఏరులై పారుతోంది. బావుల వద్దకు వెళ్ళే రోడ్లు పానాదులు (ఎడ్ల బండ్లు వెళ్లే దారులుగానే ఇంకా ఉన్నాయి). ట్రాక్టర్లు వెళ్లే దారులుగా తీర్చి దిద్దాలి. గ్రామ ఆర్థిక స్థోమత రెక్కాడితే కానీ డొక్కాడే స్థితిలోనే ఉంది. వరంగల్ కు కూత వేటు దూరంలో ఉన్న భీమదేవర పల్లి, వంగర గ్రామాల మధ్య ప్రభుత్వ భూమి కూడా చాలానే ఉంది. పీవీ పేరిట ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ఇక్కడ పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమనం చేసే అవకాశాలు దండిగా ఉన్నాయి. దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
విజ్ఞానపీఠం :
పీవీ విజ్ఞాన పీఠాన్ని ఏర్పాటు చేసి రచయితలను ప్రోత్సహించి ఆయన మీద రీసెర్చ్ చేసే విజ్ఞాన పరిశోధనా వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన పేరిట ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలనే అభిలాష కూడా గ్రామస్తుల్లో ఉంది. ఇప్పుడిప్పుడే పర్యాటకుల తాకిడి వంగరకు పెరుగుతోంది. ఎన్ని కోట్లు పివి స్మారక పీఠానికి కేటాయించారో ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయి గాని తెలుగు రాష్ట్రాలలోని మారు మూల ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులకు కనీసం భోజన సదుపాయం కల్పించాలి. ‘పీవీ నడయాడిన ఈ నేలను చూస్తే మా జన్మ ధన్యమైంది. ఆకలి దప్పులను మరిచాం” అనే అభిమానులకు అన్న ప్రసాదాలు అందజేసే సదుపాయాం కల్పిస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది!
ఇదీ చదవండి: తెలుగు నేల కీర్తి పాములపర్తి