హైదరాబాద్ : జవహర్ లాల్ నెహ్రూ ఇండియాను కనుగొంటే పీవీ నరసింహారావు భారత్ ను పునరావిష్కరించారని ప్రఖ్యాత రచయిత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ శశిథరూర్ అన్నారు. పీవీ ఎనిమిదవ స్మారకోపన్యాసం చేస్తూ థరూర్, నెహ్రూ ఆదర్శాలతో పీవీ తన క్షేత్రవాస్తవికతను జోడించి ఆర్థిక సంస్కరణలు కానీ విదేశాంగనీతిలో సంస్కరణలు కానీ ప్రవేశపెట్టారని విశ్లేషించారు. ‘విదేశాంగ విధానంలో పీవీ వారసత్వం’ అనే అంశంపైన డాక్టర్ థరూర్ ప్రసంగించారు. ఇది పీవీ శతజయంతి సంవత్సరం కనుక ఈ ఏడాది నిర్వహించిన స్మారకోపన్యాసాన్ని శశిథరూర్ వంటి అగ్రశ్రేణి మేధావి చేయడం సముచితంగా ఉన్నదని సభికులకు స్వాగతం చెప్పిన ‘సకలం’ సంపాదకుడూ, స్మారకోపన్యాస నిర్వాహకుడూ కె. రామచంద్రమూర్తి అన్నారు.
మాజీ కేంద్ర సమాచార కమిషనర్, బెనెట్ యూనివర్శిటీలో లా డీన్ గా పని చేస్తున్న ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఈ జూమ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ నరసింహారావు స్మారకోపన్యాసం బహుగ్రంథ రచయిత శశిథరూర్ చేయడం విశేషమని ఆయన అన్నారు. పీవీ అనూహ్యంగా ప్రధాని బాధ్యతలు చేపట్టారనీ, రాజీవ్ గాంధీ దారుణ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలనూ, దేశ ప్రధానమంత్రి పదవినీ పీవీ స్వీకరించవలసి వచ్చిందనీ, ఆ విధంగా అసంకల్పితంగా వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకొని దేశానికి ఎనలేని మేలు చేశారనీ పీవీని థరూర్ ప్రశంసించారు. దేశంలోనూ, బయటా పీవీ వ్యవహరించిన తీరు ఆయనను అసాధారణమైన రాజనీతిజ్ఞుడుగా నిలిపాయని చెప్పారు.
ఇదీ చదవండి: తెలుగు నేల కీర్తి పాములపర్తి
పీవీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ లు దేశాన్ని అర్థిక కష్టాలనుంచి బయటపడవేశారనీ, వారిని ఎంత పొగిడినా తక్కువేననీ థరూర్ అన్నారు. ‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్ కి రాజకీయ ఆపద వచ్చినప్పుడు నేను ఆదుకునేవాడిని. నాకు ఆర్థికపరమైన ఇక్కట్లు ఏర్పడినప్పుడు ఆయన నన్ను రక్షించేవారు అని పీవీ చెప్పేవారు’ అని థరూర్ గుర్తుచేశారు. మాజీ ప్రధాని ప్రపంచ శాంతికి పటిష్ఠమైన పునాదులు వేశారనీ, తన విదేశాంగ విధానాలతో దేశానికి భద్రతను పెంచారనీ చెప్పారు. చైనా, పాకిస్తాన్, ఇరాన్, ఇజ్రేల్, అమెరికా వంటి దేశాలతో భారత్ స్నేహంగా ఉండటానికి పీవీ దౌత్య పరిపక్వతే కారణమని కొనియాడారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత్ స్నేహం పెంపొందించుకోవడానికి ఆయన విధానాలు తోడ్పడినాయని అన్నారు. పీవీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో ఉంది. దేశం ఆర్థికంగా ప్రమాదస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించడమే కాకుండా అద్భుతమైన ప్రగతిబాటలోకి నడిపించారనీ, ఇప్పుడు చూస్తున్న ప్రగతికి మూలకారణం పీవీ వేసిన పునాదులేననీ అన్నారు.
పీవీకి పదహారు భాషలు వచ్చినా, పది భాషలలో అనర్గళంగా మాట్లాడటం తెలిసినా, ఎక్కువ సందర్భాలలో మౌనంగా ఉండేందుకు ఇష్టపడేవారని చమత్కరించారు. జమ్మూ-కశ్మీర్ లో, పంజాబ్ లో శాంతి నెలకొల్పడానికి చాకచక్యంగానూ, కఠినంగానూ వ్యవహరించారనీ, మంచి పరిపాలనాదక్షుడుగా పేరు తెచ్చుకున్నారనీ శశిథరూర్ అన్నారు. ‘హాఫ్ లయన్’ పేరుతో వినయ్ సీతాపతి పీవీపైన రాసిన గ్రంధాన్ని శశిథరూర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇదీ చదవండి: బలగం లేని బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ
ఇదీ చదవండి: వారసత్వ పాలనకు స్వస్తిపలికిన పివి
అంతటి మహానుభావుడు గురించి జరిపే కార్యక్రమంలో పాల్గొనే అభిలాష ఉంది. ఈ తరం వారందరూ కడుపు నిండా భోజనం చేస్తూ సాంకేతిక లో ఎదగడానికి కారణం పీవీ నరసింహారావు గారు ఒక్కరే అతిశయోక్తి కాదు.
వారికి రాజకీయ కారణాల వల్ల గుర్తింపు లేక పోయినా నాబోటి వారి మనస్సులో నిలిచి ఉంటారు. నేటి యువతరం, భావితరాలకు తేలిసేటట్టు చేయటానికి ఇటువంటి కార్యక్రమాలు విరివిగా చేయాలి.