సోమవారం తెల్లవారు జామున మృతి చెందిన డాక్టర్ కొల్లూరు చిరంజీవి తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడే కాదు ,తొలి నక్సలైట్ నాయకుడి గా ఆయన ఉద్యమ ప్రస్థానంలో స్థానం నిలిచి ఉంది.
పీపుల్స్ వార్ నక్సలైట్లు పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ప్రధాన అనుచరుడిగా 1972 నుంచి 1977 వరకు ఆయన అజ్ఞాత జీవితం గడిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి ఆదిలాబాద్ జిల్లా లక్షేట్ పెట్ పోలీస్ సర్కిల్ పరిధిలోని తపాలపూర్ గ్రామానికి చెందిన ( ప్రస్తుతం జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గ్రామం ఉంది) భూస్వామి పితాంబరంరావు హత్య, ఆయన ఇంటిపై దాడి కొద్ది రోజుల్లో మరో సారి అదే గ్రామం పై దాడి చేసి భూస్వామి పీతాంబర్ రావు ఇద్దరి కొడుకులనూ, ఇద్దరు పౌరులనూ, పక్కనే ఉన్న తిమ్మాపూర్ గ్రామంలో భూస్వామి కమ్మల వెంకటి హత్య సంఘటనతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. తొలిసారి నక్సల్ కార్యకలాపాలు రాష్ట్రంలో పురుడు పోసుకున్నాయి అంటూ పోలీసులు రికార్డులో నమోదు చేశారు.
నక్సలైట్ గా కేసు నమోదు:
ఆదిలాబాద్ జిల్లా లక్షేట్ పెట్ పోలీస్ సర్కిల్ పరిధిలోని నాటి కలమడుగు పోలీస్ స్టేషన్లు (ప్రస్తుతం జన్నారం పోలీస్ స్టేషన్ ) తపాలపూర్ హత్య, సంఘటనలు A-1 గా కొండపల్లి సీతారామయ్య, A-2 కొల్లూరి రవీందర్ తో పాటు మరో 14 మంది నక్సల్స్ పై కేసు నమోదు అయింది.
Also Read: దళం లో చేరాడా ?
ఇందులో మాజీ మావోయిస్టు సుప్రీం కమాండర్ గణపతి ,ఉరఫ్ లక్ష్మణరావు, పేరును A-8 గా చేర్చారు. డాక్టర్ చిరంజీవి అజ్ఞాతంలో చంద్రయ్య, కనకయ్య, ఎస్ పి రామ్ మోహన్ రావు, రమేశ్ వర్మ, ప్రసాద్ అనే మారుపేర్లతో కార్యక్రమాలను నిర్వహించినట్లు పోలీస్ వర్గాలు రికార్డులలో నమోదు చేశారు. కొల్లు శివాజీ, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, కుమార్ రెడ్డి ,నల్ల అధి రెడ్డి, విశ్వేశ్వరరావు, పి నారాయణ , ముంజల రత్నయ్య, బద్దం శంకర్ రెడ్డి ,తుషార్ భట్టాచార్య, ప్రభాకర్, పోశెట్టి, రామ్ రెడ్డి లు తపాల పూర్ సంఘటనలో పాలు పంచుకున్నట్టు పోలీసులు రికార్డుల్లో నమోదు చేశారు.
కత్తులు, గొడ్డలితో దాడులు:
1977 సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో తిమ్మాపూర్ గ్రామ భూస్వాములపై దాడులు హత్యల సంఘటనలో నక్సల్స్ గొడ్డలి, కత్తులతో దాడి చేసి హతమార్చారని, కేవలం రెండు తుపాకులు, నాటు బాంబులు వారి వద్ద ఉన్నాయని పోలీసులు చార్జిషీట్లో పేర్కొనడం గమనార్హం.
నాగపూర్ లో చిరంజీవి అరెస్ట్:
A-2 చిరంజీవిని నాగపూర్ పోలీసులు 1977 మార్చి 25న వనజ నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ఆయన భార్యను 1977 మార్చి 20న నాగపూర్ లో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. A-1 కొండపల్లి సీతారామయ్యను 26 మార్చి 77 న పోలీస్ ఇన్స్పెక్టర్ సోలంకి అరెస్టు చేయగా, A-8 గణపతి ఉరఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు ను 26, ఏప్రిల్ 1977 న నిజామాబాద్ లో మెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం జువ్వాడి రత్నాకర్ రావు
అప్రూవర్ గా మారాడా?
డాక్టర్ కొల్లూరు రవీందర్ తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కోలా శివాజీ ఉరఫ్ కృష్ణ లు పోలీసులకు చిక్కి అరెస్టు కాగా వారు పోలీసులకు అప్రూవర్గా మారి ఇచ్చిన సమాచారం మేరకు పలువురు నక్సల్స్ ను పోలీసులు పట్టుకున్నారు అనే చర్చ నాటి నక్సల్ పార్టీలో జరిగింది. దీనికితోడు పోలీస్ రికార్డులలో సైతం వారు అప్రూవర్ గా పేర్కొంటూ కోర్టులో చార్జిషీట్ సమర్పించడంతో చర్చ వాస్తవం కావచ్చు అంటూ నాటి వామపక్ష భావజాల సానుభూతిపరులు చర్చించుకున్నారు.
ఉద్యమాల్లో కీలకపాత్ర:
వరంగల్ పట్టణం క్రిస్టియన్ కాలనీకి చెందిన డాక్టర్ కొల్లూరు చిరంజీవి (74) కాకతీయ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తొలి మలి దశ ఉద్యమాల్లో ఆయన పాత్ర కీలకం. అయితే, కొండపల్లి సీతారామయ్య ప్రధాన అనుచరుడిగా 1972 నుంచి 77 వరకు ఆయన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నక్సల్ ఉద్యమం ఉద్ధృతికి క్రియాశీలక పాత్ర పోషించారు. దున్నేవాడిదే భూమి, వెట్టిచాకిరి నిర్మూలన, రైతు కూలీ కు రేట్లు పెంచడం కోసం పోరాటం చేశారు. నక్సల్ ఉద్యమంలో చేరిన విద్యావంతులను గ్రామాలకు తరలండి అనే నినాదంతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో నెల రోజుల పాటు క్యాంపులను , శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేశారు. భౌతికంగా డాక్టర్ చిరంజీవి లేకున్నా ఆయన చేసిన పోరాటాలు చరిత్ర పుటలలో నిలిచిపోతాయి.
Also Read: ఆలయ టెండర్ ప్రకటన లో అయోమయం, నిర్లక్ష్యమా? నిద్రమత్తా ?