అమరావతి: తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేయడానికి తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తిని వైఎస్ సీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చరిత్రాత్మకమైన పాదయాత్ర చేసినప్పుడు డాక్టర్ గురుమూర్తి ఆయన వెంటే నడిచారు. డాక్టర్ గురుమూర్తి ఫిజియోథిరపిస్టు. ఉత్సాహవంతుడు, యువకుడు అయిన వైద్యుడిని అభ్యర్థిగా నిర్ణయించడంపట్ల పార్టీలో సంతృప్తి వ్యక్తం అవుతున్నది. బల్లి దుర్గాప్రసాద్ కోవిద్ కారణంగా కన్నుమూసినందువల్ల ఈ ఉపఎన్నికల అవసరం ఏర్పడింది. దుర్గాప్రసాద్ కుటుంబం నుంచి ఆయన భార్యను కానీ కుమారుడిని కానీ అభ్యర్థిగా నిర్ణయిస్తారని అందరూ ఊహించారు. అందరి ఊహలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి గురుమూర్తిని ఎంపిక చేశారు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు శనివారంనాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని వారికి చెబుతూ భవిష్యత్తులో ఎంఎల్ సీ అవకాశాన్ని దివంగత నేత కుటుంబానికి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
టీడీపీ అభ్యర్థిగా తిరిగి పనబాక లక్ష్మి
అధికారపార్టీ పకడ్బందీగా అభ్యర్థిని నిర్ణయించగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ 2019లో దుర్గాప్రసాద్ చేతిలో ఓడిపోయిన పనబాక లక్ష్మిని మళ్ళీ రంగంలో దింపాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా యూపీఏ హయాంలో పని చేశారు. ఆమె బాపట్ల నుంచి ఒకసారి, నెల్లూరు నుంచి మూడు విడతలూ లోక్ సభకు ఎన్నికైనారు.
బీజేపీ, జనసేనలో అస్పష్టత
బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో బలిజలూ, కాపులూ ఎక్కువగా ఉంటారు కనుక జనసేన అభ్యర్థిని రంగంలో దింపుతే బాగుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిని నిలబెడతామంటూ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల తిరుపతిలో ప్రకటించడంతో జనసైనికులకు దిక్కుతోచడం లేదు. బీజేపీతో పొత్తు ఉండటం వల్ల ఇద్దరూ కలసి మాట్లాడుకొని నిర్ణయానికి రావాలి. కానీ వీర్రాజు ఏకపక్షంగా తన పార్టీ వైఖరిని ప్రకటించారు. జనసేన నాయకులు ఏమీ పాలుపోక మౌనం వహించారు.