కుండపోతల వానలు కురిసి, కురిసి,
పూర్ణ గర్భిణియై పొంగి పోయె చెఱువు
కదను ద్రొక్కెడు చోట గంగమ్మ తల్లి
తీర్థజన సంద్రమయ్యె ధాత్రీ తలమ్ము!
ఆ దిగువనే వసించెడు పేదవారి
కదియె మరునాడు ప్రబల భీతావహమ్ము
మేఘగర్జా నినాద గంభీరరాత్రి
“కొట్టుకొని పోవునో చెఱ్వుకట్ట” యనుచు!
-నివర్తి మోహన్ కుమార్
తెగుచున్న గీత
క్రొత్తగా పెళ్ళైన దంపతులు. భార్య చేతిని పరీక్ష చేస్తూ ఫలితం చెబుతున్నాడొక హస్తసాముద్రిక వేత్త:
“గురుని సమున్నతప్రతిభ, గోపుర శృంగము వోలె శుక్రుడున్;
కరము శిరీష పేశలము కాంత!
స్ఫురించును రెండె శంఖముల్:
తరగని దివ్య చక్రములు తక్కిన వ్రేళుల, నీవు, నీ మనో
హరుడును, ప్రేమ జీవన కృతార్థత గాంచి సుఖింత్రు కోమలీ!”
తరుణి హసించె, చెక్కిళుల తన్మయమై ప్రసవించు గుంతలన్;
“సురుచిరమయ్యె నీ హృదయ సుందర రేఖయు! కాని, హస్తమం
దిరువది యేండ్ల పిమ్మట సుమీ! తెగుచున్నది గీత!” యన్నచో,
పరమ గభీరమయ్యె ముఖపద్మము, చూపులు వ్రాలె నేలపై!
“వెరువకుమమ్మ! గండములు వీడి లభించును భూరి సంపదల్!
చెరగని భాగ్యరేఖయును, జీవిత రేఖయు, పుత్ర రేఖయున్!
మరువకు నాదు పల్కులు, సుమంగళిగా తుది శ్వాస!” యన్నచో,
విరిసె విశాల నేత్రముల, వెన్నెల రాత్రులు, వెండి వెల్గులన్!
నివర్తి మోహన్ కుమార్
Also read: అ త డు
Also read: కృపజూడు భారతీ
Also read: శాంతి యాత్ర
Also read: నా తెలంగాణా
Also read: ఉత్తరాభిమన్యుల వివాహంలో తెలుగుదనం