- ఏకకాలంలో రెండు డిగ్రీలు
- 2022-23 విద్యాసంవత్సరం నుంచే అమలు
సేవలు,వస్తువుల కొనుగోళ్లు, వినోద రంగాలలో ఏకకాలంలో రెండింటిని, అంతకుమించి అనుభవించే అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. భారతీయ విద్యారంగంలో ఆ సదుపాయాలు ఇప్పటి వరకూ పెద్దగా లేవు. ఇకనుంచి ఆ అవకాశాలు వేళ్లూనుకోనున్నాయి. ఒకే విద్యా సంవత్సరంలో, రెండు డిగ్రీలను తీసుకొనే విధానానికి రంగం సిద్ధమైపోయింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలుకానుంది. ఇది గొప్ప పరిణామం.
Also read: అపూర్వ రాజకీయ విన్యాసం
నూతన విద్యావిధానంపైన దృష్టి
‘నూతన విద్యావిధానం’ పై కేంద్ర ప్రభుత్వం బలంగా దృష్టి సారిస్తోందన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ‘డబుల్ డిగ్రీ’కి పచ్చజెండా ఊపడం ముదావహం. ఈ దిశగా మార్గదర్శకాలు సిద్ధమైనట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) ఛైర్మన్ ఎం జగదీష్ కుమార్ మాటలను బట్టి తెలుస్తోంది. ఈ విధానాన్ని ఆచరణలో పెట్టాలని యూజీసీ ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లమా కోర్సుల విషయంలో విద్యార్థులకు ఇది మంచి వెసులుబాటు. విద్యాకేంద్రాలకు నేరుగా వెళ్లి చదువుకొనేవారికి, ఆన్ లైన్, మిగిలిన విధానాలలో కోర్సులు పూర్తి చేయాలనుకొనే వారందరికీ మార్గం సులభతరం కానుంది. ప్రస్తుతం సాంకేతిక విద్యా కోర్సులకు మాత్రం ఈ విధానంలో అవకాశాన్ని కల్పించలేదు. భవిష్యత్తులో కల్పించే అవకాశాలు లేకపోలేదు. మానవీయశాస్త్రాలు (హ్యుమనిటీస్), సైన్స్, కామర్స్,మేనేజ్ మెంట్ మొదలైన సబ్జక్ట్స్ లో నచ్చిన విధంగా రెండు డిగ్రీలను పొందవచ్చు. ప్రవేశానికి సంబంధించిన నియమావళి, ప్రవేశ పరీక్షల విషయంలో ఆయా విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర ఉంటుందని సమాచారం. ఉదాహరణకు ఒక విద్యార్థి బికామ్ తో పాటు మాధమాటిక్స్ లోనూ ఏకకాలంలో డిగ్రీలు సంపాయించవచ్చు. దీనివల్ల విద్యార్థుల మనోవికాసానికి, బహుముఖీనమైన జ్ఞాన సంపదకు, బహురంగాల్లో ఉద్యోగ, ఉపాధులు, పరిశోధనలకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సమయం కూడా కలిసి వస్తుంది. ‘డబుల్ డిగ్రీ విధానం’ విద్యాసంస్థలన్నింటికీ తప్పనిసరి కాదు. ఒకే రకమైన కోర్సుల ప్రవేశం విషయంలోనూ ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని సమాచారం. ప్రపంచంలో ఒకప్పుడు భారతదేశం జ్ఞానభూమిగా విలసిల్లేది. ఎక్కడెక్కడ నుంచో వచ్చి మన దగ్గర చదువుకొనే వారు. పూర్వం సంప్రదాయ గురుకుల విధానం ఉండేది. విద్యాపరమైన అంశాలతో పాటు కళలు, క్రీడలు, వ్యాయామం, యోగాభ్యాసం మొదలైనవి విద్యాబోధనలో భాగంగా ఉండేవి.
Also read: చిన్న జిల్లాలతో పాలనాసౌలభ్యం
ప్రాచీన విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన బ్రిటిష్ ముష్కరులు
బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించినప్పటి నుంచీ మన విద్యా విధానం భ్రష్టు పట్టిందని, ముఖ్యంగా లార్డ్ మెకాలే వల్ల చాలా నష్టం జరిగిందనే విమర్శలు తరచూ వింటూనే ఉన్నాం. సర్వశాస్త్రాలు వేదాలలోనే ఇమిడి ఉన్నాయని పూర్వులు చెప్పేవారు. అంత గొప్ప వేదవిజ్ఞానం,సంబంధిత సామాగ్రి,తాళపత్రాలు దోపిడికి గురైనాయని అంటారు. భారతీయ విజ్ఞానసర్వస్వం విదేశాలకు ఎత్తుకుపోయారని చెబుతారు. వేదవిజ్ఞానంలో ప్రస్తుతం మనకు మిగిలివున్నది చాలా చాలా తక్కువని సమాచారం. నలంద,తక్షశిల, వల్లభి, శారదా పీఠ, పుష్పగిరి విహార, విక్రమశిల, సోమపుర మహావిహార,విక్రమపుర విహార,మిథిల,నదియా మొదలైన ఎన్నో విద్యాలయాలు ప్రాచీనకాలంలో సర్వజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లేవి. అన్ని విషయాలపైన సముచితమైన జ్ఞానాన్ని పొందుతూ, ఒకొక్క శాస్త్రంలో నిష్ణాతులుగా రాణించగలిగిన విద్యావిధానం భారతదేశంలో ప్రాచీనకాలంలో ఉండేది. డబుల్ డిగ్రీ కోర్సుల విధానం చాలా దేశాల్లో ఎప్పటి నుంచో అమలవుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలలో ఎక్కువగా అందిస్తున్నారు. ఒకే విశ్వవిద్యాలయం లేదా వేరు వేరు విశ్వవిద్యాలయాల నుంచి ఏకకాలంలో ‘డబుల్ డిగ్రీ’ చెయ్యాలనే కల చాలామందికి ఉండేది. ఇప్పుడు అది సాకారం కానుంది. దీనివల్ల సర్టిఫికెట్స్ అందడంతో పాటు సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది. విద్యార్జన చేయాలనుకొనేవారికి మనసుకు నచ్చిన ఏ విషయాలనైనా ( సబ్జక్ట్స్), వాటి సంగమాలనైనా పొందే వెసులుబాటు ఉండడం ముఖ్యం. చదివిన చదువులు వృధా అవ్వకూడదు. వ్యక్తికి, సమాజానికి, దేశానికి, మానవజాతికి,లోకానికి ఉపయోగపడాలి.కేవలం కోర్సులు,డబుల్ డిగ్రీలు పెరగడం వల్ల ఉపయోగం లేదు.బోధనలో,సాధనలో నాణ్యత,ప్రామాణికతలు అత్యంత ముఖ్యం. పరిశోధనలు పెరగడం అంతే ముఖ్యం. ప్రతిభావంతుడికి, పేదవాడికి విద్య దగ్గరయితే జాతి మరింతగా పురోగతి చెందుతుంది.
Also read: కష్టాల కడలిలో శ్రీలంక