- టెండర్లను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ
మరికొద్ది రోజుల్లో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. గతంలో తిరిగిన డబుల్ డెక్కర్ బస్సులతో పోలిస్తే సాంకేతికంగా మంచి సామర్థ్యం ఉన్న ఇంజిన్, హైదరాబాద్ రోడ్లకు అనువైన బస్సు బాడీ వంటివి ఉండాలని ఆర్టీసీ టెండరు దాఖలు సమయంలోనే స్పష్టం చేసింది. ఇటీవల బస్సుల తయారీకి టీఎస్ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించగా.. అశోక్ లేలాండ్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. అయితే బీఎస్-6 ప్రమాణాల మేరకు బస్సులను తయారు చేయాలంటే ఖర్చుల అంచనాలు తయారు చేసేందుకు మరి కొంత సమయం కావాలని కోరటంతో టెండర్ల గడువును అధికారులు ఇటీవల పొడిగించారు. అయితే చివరకు అశోక్ లేలాండ్ సంస్థ ఒక్కటే టెండర్ దాఖలు చేసింది.
Also Read: సాగర్ లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్
తొలివిడతలో 25 బస్సులు:
దీంతో బస్సులను సమకూర్చేందుకు లేలాండ్ సంస్థ ముందుకు వచ్చింది. డబుల్ డెక్కర్ బస్సుల టెండర్‌పై త్వరలో ఆర్థిక కమిటీ చర్చించనున్నది. ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన అనంతరం నగర అవసరాలకు తగ్గట్టుగా బస్సులను తయారు చేసే పనిలో ఆశోక్ లేలాండ్ కంపెనీ నిమగ్నమైంది. తొలుత 40 బస్సులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలనే భావించినా ఖర్చుకు వెనుకాడటంతో తొలి విడతలో 25 బస్సులకు మాత్రమే ఆర్డరు ఇవ్వనున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ కు డబుల్ డెక్కర్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టాలంటూ ఇటీవల మంత్రి కేటీఆర్‌ను ఓ సిటిజన్ ట్విట్టర్‌లో కోరారు. డబుల్ డెక్కర్ బస్సుల అంశాన్ని పరిశీలించాలంటూ ఆర్టీసీ అధికారులను మంత్రి కేటీఆర్ కోరారు. దీనికి వెంటనే స్పందించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం టెండర్లు ఆహ్వానించారు. గతంలోనూ నగరంలోని పలు ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగాయి.
Also Read: మూడో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు