- కరోనా తగ్గిందనే భ్రమలు వద్దు
- కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి
- సకల జాగ్రత్తలూ తీసుకుంటే క్షేమం
కోవిడ్ తగ్గుముఖం పట్టిందని సంబరాలు చేసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) మరోమారు హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన వారంలో మరణాల సంఖ్య 40 శాతనికి పైగా పెరిగిందని వెల్లడించింది. భారత్ వంటి దేశాల్లో లెక్కల్లో చేసిన సవరణలు, అమెరికాలో మరణాల నమోదు ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఈ సంఖ్య పెరిగినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. ఇక్కడే మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని కూడా గుర్తెరగాల్సివుంది.
Also read: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కు ఎసరు
ఆందోళన కలిగించే విషయం
పోయిన వారంలో ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల కొత్త కేసులు నమోదు అయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. చాలా దేశాల్లో కరోనా నిబంధనలను ఎత్తివేయడంతో పాటు, పరీక్షలను కూడా తగ్గించాయి. దీని వల్ల వైరస్ వ్యాప్తికి సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలియరావడం లేదు. కరోనా వైరస్ లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇదే ప్రధానమైన సవాల్. కేసులు తక్కువగా కనిపిస్తున్నాయి కదా అని వైరస్ ను తక్కువగా అంచనా వేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండడం, నిబంధనలను పాటించడం అందరి బాధ్యత. పకడ్బందీగా పర్యవేక్షించడం ఆ యా ప్రభుత్వాల బాధ్యత. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే కోవిడ్ మరణాలు భారత్ లోనే తక్కువ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపుగా 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో అత్యంత అప్రమత్తంగా ఉండడం అత్యంత ముఖ్యమైన అంశం. మన వాతావరణం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, మానసిక ప్రవృత్తి, జన్యుపరమైన అంశాలు చాలా మేరకు మనల్ని రక్షించాయని నిపుణులుఅభిప్రాయం. వైద్యపరంగా వనరులు, వసతులు, మౌలిక సదుపాయాల విషయంలో మనం ఇంకా వెనకబడే వున్నామన్నది వాస్తవం. కరోనా ప్రబలిన సమయంలో మన డొల్లతనం బయటపడింది. వైద్య రంగానికి, వైద్య విద్యా రంగానికి, పరిశోధనలకు మన ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులు నామ మాత్రమే. ఇంతపెద్ద దేశానికి చాలినంత అత్యవసర సిబ్బంది మనకు లేరు. నిపుణుల కొరత అట్లే వుంది. కోవిడ్ సమయంలో ప్రాణవాయువు దొరకక ఎంత ఇబ్బంది పడ్డామో ప్రపంచ దేశాలన్నీ గమనించాయి. ప్రభుత్వ రంగ ఆస్పత్రుల్లో పరిశుభ్రత, సదుపాయాలు లేకపోవడం, కొంతమంది ఉద్యోగుల బాధ్యతా రాహిత్యం, రెడ్ టేపిజం వల్ల ప్రజలు ప్రైవేట్ అస్పత్రుల వైపు పరుగులెత్తారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల నుంచి రక్తాన్ని పిండుకున్నాయి.
Also read: తెలుగు తేజాన్నిచాటిన త్రిబుల్ ఆర్
రక్తం పిండుకున్న ప్రైవేటు ఆస్పత్రులు
సేవలు, సదుపాయాల రూపంలో ఒక్కొక్కరి దగ్గర నుంచీ లక్షలాది రూపాయలు గుంజుకున్నాయి. ఆర్ధిక శక్తిలేని పేదవారు,మధ్య తరగతివారు నలిగిపోయారు. ఈ పరిణామాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వాలు ఇప్పటికైనా వైద్యరంగంపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి. సమూలంగా ప్రక్షాళనలు చేపట్టాలి.భారతదేశంలో స్వదేశీ వ్యాక్సిన్లు తయారు కావడం మంచి పరిణామం. అదే సమయంలో, సామర్ధ్యతలో మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాల్సి వుంది. వ్యాక్సినేషన్ లో వేగం పుంజుకోవడం కూడా ఆరోగ్యకరమైన పరిణామం. కాకపోతే, బూస్టర్ డోసుల వినియోగంలో ఇంకా వేగం పెరగాల్సి ఉంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల ప్రభావం కొన్ని నెలల సమయానికే మాత్రమే పరిమితం కావడం ఆలోచించాల్సిన విషయం. కొత్త వేరియంట్లను గమనిస్తూ, తగినట్లు రూపకల్పన చేయడం వ్యాక్సిన్ల తయారీలో ఎదురవుతున్న అతిపెద్ద సవాల్. వాక్సిన్లు తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడం కూడా కీలకం. ఈ దిశగా ఇంకా అవగాహన, ఆచరణ పెరగాల్సివుంది. ఇప్పుడిప్పుడే సమాజం కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ, గడ్డుకాలం నుంచి త్వరగా బయటపడడంలో ప్రజలు, ప్రభుత్వాలు సమిష్టిగా ముందుకు కదలాల్సివుంది.
Also read: ఆదిత్యనాథ్ యోగిమహరాజ్ దిగ్విజయం