కన్నడ నటులు ఉపేంద్ర, చేతన్ కుమార్
కన్నడచిత్రసీమలో ఇద్దరు సినీప్రముఖుల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. కుల,మత ప్రస్తావనలు తీసుకొని వచ్చి వాతావరణాన్ని కలుషితం చేయవద్దంటూ ప్రముఖ కన్నడ సినీనటుడు ఉపేంద్ర ఒక వీడియో పోస్టు చేశారు. దీనికి ప్రతిగా చేతన్ కుమార్ అనే నటుడు సర్వఅనర్థాలకూ బ్రాహ్మణిజం మూలమనీ, దానిని వ్యతిరేకించవలసి ఉన్నదనీ అంటూ మరో వీడియో పోస్టు చేశారు. ఇది ఇద్దరు నటుల మధ్య భావజాలానికి సంబంధించిన చర్చగా మిగిలితే గొడవ ఉండేది కాదు. కానీ ఈ లోగా కర్ణాటక బ్రాహ్మిణ్ అభివృద్ధి మండలి అధ్యక్షుడు సచ్చిదానందమూర్తి, విప్రయువ వేదిక నాయకులూ ఫిర్యాదు చేయడం, రెండు ఎఫ్ఐఆర్ లను చేతన్ కుమార్ పైన దాఖలు చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. అయితే, తాను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదనీ, బ్రాహ్మణిజం అనే భావజాలానికి వ్యతిరేకమనీ, ఆ భావజాలం బ్రాహ్మణేతర కులాలవారిలోకూడా పెరిగిందనీ చేతన్ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు.
ఇందులో రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించడం, అదే మాట కొనసాగించడం. రెండు, బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ ఆ మాటకు బదులు వేరే మాట ఉపయోగించడం ద్వారా బ్రహ్మణులకు బాధపెట్టకుండా ఉండటం. బ్రాహ్మణిజాన్ని ఎవరు విమర్శించినా బ్రాహ్మణులు భుజాలు తడుముకునే అవకాశం ఉంది. కానీ ఈ రోజు దేశంలో బ్రాహ్మణుల పరిస్థితి అంత ఘనంగా లేదు. నిజం చెప్పుకోవాలంటే అత్యంత దీనంగా ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉంటే 2019 ఎన్నికలలో నాటి అధికారపార్టీ అయిన టీడీపీ ఒక్కటంటే ఒక్క టిక్కెట్టు కూడా బ్రాహ్మలకి ఇవ్వలేదు. టిక్కెట్లు ఇచ్చిన పార్టీలు కూడా ఒకటి, రెండు లేదా మూడు టిక్కెట్లు ఇస్తున్నాయి. ఇందుకు కారణం బ్రాహ్మణులు ఇదివరకు ఉన్న ఆధిపత్య స్థానంలో లేరు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన అసెంబ్లీలలో, పార్లమెంటులో బ్రాహ్మణులు పెద్ద శాతంలో ఉండేవారు. స్వాతంత్ర్య సమరంలో, సంస్కరణ ఉద్యమాలలో ముందు పీటీలో ఉన్నది బ్రాహ్మణులే. అయితే, అదంతా చరిత్ర. వర్తమానంలో పేదరికం బ్రాహ్మణులను పట్టిపల్లార్చుతున్నది. హైదరాబాద్ లో పురోహితులు చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం దగ్గర భోక్తగా పిలుపుకోసం ఎదురు చూడవలసిన రోజులు దాపురించాయి. అటువంటి గడ్డు కాలంలో బ్రాహ్మణులను విమర్శించడం, సమాజంలోని సమస్త రుగ్మతలకూ కారణం బ్రాహ్మణిజం అని దుయ్యపట్టడంతో పేదరికంలో కునారిల్లుతున్నా ఆత్మగౌరవం చావని బ్రాహ్మణుల మనసు నొప్పించినట్టు అవుతోంది. అందుకని బ్రాహ్మణిజం అనే కాలం చెల్లిన భావజాలానికి మరోపేరు పెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మినహా బ్రాహ్మణులు అధికారం చెలాయించే పరిస్థితి ఎక్కడా లేదు. కేంద్రంలో కొంతమంది మంత్రులు బ్రాహ్మణులు ఉండవచ్చు. కానీ సమాజంలో బ్రాహ్మణులకు ప్రాధాన్యం లేదు. ఎందుకంటే జనాభాలో వారి శాతం రెండు, మూడు శాతానికి మించిన రాష్ట్రాలు తక్కువ. జనాభాను బట్టి, ఓటు బ్యాకును బట్టి గౌరవమన్ననలు ఉండే కాలంలో మనం ఉన్నాం. అందుకని బ్రాహ్మణిజం అని పిలిచే పాత భావజాలానికి ఆధిక్య భావజాలమని పేరు పెట్టుకొని పిలిచినట్లయితే గొడవ ఉండదు. ఈ రోజున కొందరు బ్రాహ్మణ ప్రముఖులు సుఖంగా ఉంవచ్చు. పొగరుగా మాట్లాడవచ్చు. ఇంకా మనుధర్మశాస్త్రాన్ని సమర్థించవచ్చును. చింత చచ్చినా పులుపు చావనట్టు ఎగిరెగిరి పడవచ్చు. కానీ సాధారణ బ్రాహ్మలు పొగరుగా మాట్లాడే స్థితిలో లేరు. చచ్చిన పామును కొట్టిన చందంగానే ఉంటుంది వారిపైన ధ్వజమెత్తడం. చేతన్ కుమార్ ఉద్దేశం కూడా బ్రాహ్మణులను విమర్శించడం కాదు. ఆ సంగతి అతను స్పష్టంగా చెప్పారు. కానీ బ్రాహ్మణిజం అనేవరకూ బ్రాహ్మణులు ఆపాదించుకుంటున్నారు. వెనుకబడిన తరగతిగా గుర్తించవలసిన అవసరం ఉన్న బ్రాహ్మణ కులాన్ని విమర్శించడం కంటే ఉపేక్షించడం ఉత్తమం. బ్రాహ్మణిజం అని పిలవడం కంటే ఆధిక్యభావజాలం అంటే అది ఎవరికి ఉంటే వారికి వర్తిస్తుంది కులాలతో నిమిత్తం లేకుండా. ఆధిక్యభావం ఉన్నవారు ఈ రోజున బ్రాహ్మణులలో ఉన్నారు. కానీ వారికంటే చాలా అధికంగా ఇతర ప్రవృద్ధకులాలలో ఉన్నారు. మనువాదానికి మించిన ప్రమాదకరమైనవాదాలను విశ్వసించేవారు ఉన్నారు. మనువాదాన్ని సమర్థిస్తున్నవారి సంఖ్య గనణీయంగా తగ్గించి. కొత్త తరహా ఆధిక్యవాదం మనువాదం స్థానంలో వచ్చిచేరింది. మనువాదాన్ని వ్యతిరేకించినవారిలో ఆధునిక బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అందువల్ల కాలం చెల్లిన మనువాదాన్నీ, బ్రాహ్మణవాదాన్ని వదిలివేసి ఇప్పుడు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న భావజాలాన్ని ‘ఆధిక్యభావం’ అని అంటే బాగుంటుంది. అసలే పేదరికంతో, నిరుద్యోగంతో అలమటిస్తున్న బ్రాహ్మణులకు మనస్తాపం కలగకుండా ఉంటుంది.
-కేరా