- దిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల వితరణ
- కిషన్ రెడ్డి మూడు మాసాల జీతం
- ఎంపీలూ, ఎంఎల్ ఏలూ రెండు మాసాల జీతం
- అపర్ణాకనస్ట్రక్షన్స్ 6కోట్లు, మైహోమ్ సంస్థ 5 కోట్లు
- సినీప్రముఖుల ఉదార విరాళాలు
వరద తాకిడికి గురైన హైదరాబాద్ ను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎం రిలీఫ్ ఫండ్ – సీఎంఆర్ ఎఫ్) విరాళాల వరద ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి కె. పలణిస్వామి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పిలుపునకు స్పందించి పది కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు అర్వింద్ కేజ్రీవాల్, మమతాబెనర్జీ కూడా మంగళవారం ఉదయం స్పందించారు. దిల్లీ ముఖ్యమంత్రి 15 కోట్లు రూపాయల విరాళం ప్రకటించగా, మమతా దీదీ రెండు కోట్ల రూపాయల సాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి తమ ప్రభుత్వాలు అండగా ఉంటాయని దిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు తెలిపారు. పళణిస్వామికీ, కేజ్రీవాల్ కీ, మమతకూ ఫోన్ చేసి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
అపర్ణ కనస్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ సంస్థ ఆరు కోట్ల రూపాయల సహాయం ప్రటించింది. మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు అయిదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. దేశీయాంగశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వరదబాధితుల సహాయం కోసం మూడు మాసాల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఆయన స్వయంగా హైదరాబాద్ లో నష్టపోయిన ప్రాంతాలను సందర్శించారు. ఎంపీలూ, శాసనసభ్యులూ రెండు మాసాల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.
టాలీవుడ్ స్టార్స్ ఆపన్న హస్తం
వరుణదేవుడి ఆగ్రహానికి ఆగమాగమైపోయిన భాగ్యనగరిని ఆదుకోవడానికి తెలుగు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. వందేళ్ళలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విలయం నుంచి హైదరాబాద్ ను ఆదుకోవడానికి తమ వంతు విరాళాలు ప్రకటించారు.
గడచిన వందేళ్ళలో ఎన్నడూ జరగని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ తీవ్ర నష్టానికి గురైనదని మోగా స్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. వేలాదిమంది నిరాశ్రయులైనారనీ, ప్రకృతి బీభత్సానికి అల్లాడిపోతున్న ప్రజలకు బాసటగా తన వంతుగా కోటి రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నాననీ ఆయన ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు నీట మునిగి లక్షలాదిమంది నిరాశ్రయులైనారనీ, వారిని ఆదుకునేందుకు తనవంతుగా కోటి యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపుతున్నాననీ అగ్రశ్రేణి కథానాయకుడూ, మహాబలి హీరో ప్రభాస్ తెలియజేశారు.
తెలంగాణలో అసాధారణంగా కురిసిన వర్షాలు ఊహకందని నష్టాలను మిగిల్చాయనీ, బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమనీ, తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాననీ ప్రిన్స్ మహేష్ బాబు ప్రకటించారు.
భారీ వర్షాలూ, వరదలూ హైదరాబాద్ నగరంలోని ప్రజాజీవితంలో విధ్వంసాన్ని సృష్టించాయనీ, ఈ విపత్తును ఎదుర్కోటానికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రంగంలో దిగిందనీ, వరద బాధితులకు సాయంగా రూ. 550 కోట్లు ప్రకటించడం హర్షణీయమనీ ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున ప్రశంసించారు. తన వంతు విరాళంగా యాభైలక్షల రూపాయలు ఇస్తున్నట్టు వెల్లడించారు.
భారీ వర్షాలతో, వరదలతో ఎంతో మంది జీవితాలు అతలాకుతలమైనాయనీ, అందరం కలిసి హైదరాబాద్ ను పునర్మించాలనీ, తన వంతు విరాళంగా యాభై లక్షల రూపాయలు అందజేస్తున్నాననీ జూనియర్ ఎన్.టి.ఆర్ ప్రకటించారు.
ప్రకృతి విపత్తు కారణంగా ప్రజల జీవితాలు కకావికలమైన నేపథ్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరి పది లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్టు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక, హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ప్రకటించారు నగరానికి అండగా నిలుద్దామని పిలుపిస్తూ తన వంతు పది లక్షల రూపాయల విరాళం అందిస్తున్నట్టు హీరో విజయ్ దేవరకొండ తెలియజేశారు. తోచినంత సాయం చేయవలసిందిగా తన అభిమానులకూ, ప్రజలకూ విజయ్ విజ్ఞప్తి చేశారు.
ఇది వరకూ కేరళ, చైన్నైలో జలవిలయం సంభవించినప్పుడూ, సైనికుల కోసం విరాళాలు ఇచ్చిన తెలుగు సినీ ప్రముఖులు ఇప్పుడు కూడా సమధికోత్సాహంతో విరాళాలు ప్రకటించారు. తాను అయిదు లక్షల విరాళం ఇస్తున్నట్టు అనిల్ రావిపూడి ప్రకటించారు. తాను సైతం అయిదు లక్షలు ఇస్తున్నట్టు హరీష్ శంకర్ తెలియజేశారు. కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ జలవిపత్తులో మునిగినప్పుడు అంతా తానే అన్నట్టు నిర్విరామంగా పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలు కనుక్కుంటున్నారంటూ రామ్ ప్రశంసించారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కూడా అయిదు లక్షల రూపాయలు ప్రకటించారు. చిత్ర దర్శకుడు త్రినాథ్ మేకసూరి తన వంతు విరాళంగా 50 వేల రూపాలయు ప్రకటించారు.