- వరంగల్ లో ఉద్రిక్త పరిస్థితులు
- ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడులు
- బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల ప్రతిదాడి
ఆయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి విరాళాలపై అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దని కోరుట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సద్దుమణగక ముందే మరో వివాదం చుట్టుముట్టింది.
ఆయోధ్య రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నేతలు నకిలీ పుస్తకాలతో చందాలు వసూలు చేస్తున్నారని లెక్కలు మాత్రం చూపడం లేదని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి నిన్న (జనవరి 31) చేసిన వ్యాఖ్యలతో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయాలకోసం రాముడిని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ నేతలు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఆయన ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. దీంతో బీజేపీ నేతలు ఛలో వరంగల్ కు పిలుపునిచ్చారు. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది చదవండి: గ్రామాల్లో మార్మోగుతున్న రామ నామం !గందరగోళంలో నాయక గణం
హన్మకొండలోని బీజేపీ కార్యాలయానికి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దొంగపుస్తకాలతో విరాళాలు వసూలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదని బీజేపీ నేతలు అన్నారు. ఇటీవలే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదస్పదమయ్యాయి. అయోధ్య రాముడు మనకెందుకు మన దగ్గర చాలా రామాలయాలు ఉన్నాయని అన్నారు.రాముడి పేరుతో దోచుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ శ్రేణుల దాడిని పట్ల మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సహనం నశించిన బీజేపీ నేతలు భౌతికదాడులకు దిగడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని బీజేపీకి సూచించారు.
ఇది చదవండి: రాజాసింగ్ కు ఏడాది జైలుశిక్ష