Thursday, November 21, 2024

టీకామహోత్సవంలో ఏమున్నది గర్వకారణం?

భారత్ 21 అక్టోబర్ తేదీన వందకోటి కోవిద్-19 టీకా వేసింది. తన లోకసభ నియోజకవర్గమైన వారణాసికి చెందిన ఒక వ్యక్తికి దిల్లీలోని ఒక ఆస్పత్రిలో టీకా ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి అక్కడే ఉన్నారు. తన ప్రభుత్వం సాధించిన విజయంపైన తన అభిప్రాయాన్ని ఒక ఆంగ్లదినపత్రిక కోసం వ్యాసంగా రాశారు. ఈ సందర్భంగా ఆయన దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆదివారం చేసే మన్ కీ బాత్ ప్రసంగంలో దీనిని ఒక అంశంగా వినియోగించారు. వీటికి లింక్ లను నరేంద్రమోదీ.ఇన్ (narendramodi.in)కి వెళ్ళి దయజేసి చూడండి. ఈ ఘటనను ఒక సంబరంగా, ఉత్సవంగా జరుపుకోవడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ముందుగానే సకల సన్నాహాలూ చేసింది. ఒక పాట రాయించారు. ప్రముఖ గాయకుడి చేత దాన్ని పాడించారు. వంద భవనాలను మువ్వన్నెలలో (మూడు రంగులలో) అలంకరించారు. భారత్ ను అభినందిస్తూ అనేక దేశాధినేతలూ, అంతర్జాతీయ సంస్థల అధిపతులూ సందేశాలు పంపించారు.  బిల్ గేట్ రాసిన కాలమ్ ని ఒక పత్రిక ప్రచురించింది. ఒక పింక్ పేపర్ (వ్యాపార, ఆర్థికాంశాలను ప్రధానంగా ప్రచురించే పత్రిక)లో ఒక బీజేపీ ముఖ్యమంత్రి వ్యాసం ప్రచురించారు. టీకా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఒక నీతిఆయోగ్ సభ్యుడు కూడా ప్రశంసాత్మకంగా కాలమ్ రాశారు. దేశమంతటా పత్రికలు బీజేపీ మంత్రుల, నాయకుల ప్రశంసలతో కూడిన ప్రకటనలను ప్రచురించాయి. ఈ ఘనకార్యాన్ని ప్రస్తుతిస్తూ వారు సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. దేశం అంతటా గ్రామాలలోనూ, వీధులలోనూ చిన్న నాయకులు వేలాది సంబర కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఈ గొప్ప విజయం గురించి  21 నుంచి 24వ తేదీ (ఆదివారం) వరకూ నాలుగు పగళ్ళూ, నాలుగు రాత్రులూ వార్తాపత్రికలనూ, టీవీ చానళ్ళనూ వార్తలతోనూ, అభిప్రాయాలతోనూ ముంచెత్తారు. సోషల్ మీడియాలో ఈ అంశాలే అత్యధికంగా ట్రెండ్ అయ్యాయి. ఈ సంబరాలలో ఉద్దేశించిన సందేశం ఏమిటో, అది ఏమి చెబుతోందో, ఏమి దాచుతోందో చూద్దాం. ఇది పండుగ చేసుకోవలసినటువంటి ఘనకార్యమని ప్రస్తుత ప్రభుత్వం భావించి ఎందుకు హడావుడి చేసిందో, అది మన గురించి, ఈ దేశ పౌరుల గురించి ఏమని భావిస్తున్నదని చెప్పాలనుకుంటున్నదో పరిశీలిద్దాం.

Also read: ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది

ఒక మైలురాయి మాత్రమే

వందకోట్లంటే మాటలు కాదు. పెద్ద సంఖ్య. వందకోట్ల కోవిద్ – 19 టీకాలు వేయడం అన్నది ఒక మైలురాయి అనడంలో సందేహం లేదు. ఒక మైలు రాయి మాత్రమే. అంతవరకే. అంతకంటే ఎక్కువ కాదు. ఇండియా వంటి దేశానికి అది అంత పెద్ద లక్ష్యమని అనుకుందామా? ఇండియాను అంత చిన్నదిగా ఊహిద్దామా? ఒక జాతికి అది అంత ఎత్తులో ఉన్న లక్ష్యమా? కనీసం నాలుగు దశాబ్దాలుగా రకరకాల టీకాలు జయప్రదంగా ఇస్తూవచ్చిన దేశానికి, టీకాల తయారీలో ప్రపంచానికి కేంద్రమైన దేశానికి, సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపచంలో కెల్లా అత్యుత్తమమైన ప్రతిభావంతులైన వ్యాపావేత్తలను అందించిన దేశానికి ఇది అంతటి సమున్నత లక్ష్యమా?  లక్ష్యాన్ని కష్టసాధ్యమైనదిగా, ఉన్నతమైనదిగా, ఉత్కృష్టమైనదిగా అభివర్ణించి అటువంటి సమున్నతమైన లక్ష్యం సాధించామని ప్రభుత్వం స్వయంగా చెప్పుకోవడం అవసరమా? మనం ఎవ్వరికీ తీసిపోలేదనే సర్టిఫికెటు మనకు అవసరమా? ప్రపంచంలోని అగ్రరాజ్యాల సానుకూల స్పందన అవసరమా? పది సంవత్సరాల కిందట సైతం మన దేశానికి కొత్త విద్యార్థిలో సాధారణంగా ఉండే భయసందేహాలు లేవు. ఇప్పుడెక్కడినుంచి అకస్మాత్తుగా వచ్చాయి?

నేను చెప్పదలచిన విషయం మీకు తేలికగా బోధపడటానికి ప్రధాని రాసిన వ్యాసంలో తన లక్ష్యాన్ని ఎట్లా గంభీరంగా అభివర్ణించారో చూపిస్తాను. ఒక టీకా వాయిల్ ఉత్పత్తి కేంద్రం నుంచి టీకా కేంద్రం వరకూ ఏ విధంగా ప్రయాణం చేస్తుందో దూరాభారాలకు సంబంధించిన అన్ని వివరాలూ ఆ వ్యాసంలో రాశారు. అదంతా ఎంత పెద్ద వ్యవహారమో చెప్పడానికి కాలవ్యవధిని కూడా ప్రస్తావించారు.

‘‘ఆరోగ్య కార్యకర్త ఒక టీకా ఇవ్వడానికి రెండు నిమిషాలు పడుతుందని అనుకుందాం. ఈ మహోన్నత లక్ష్యం చేరడానికి 41 లక్షల పని రోజులు (మ్యాన్ డేస్), అంటే 11వేల పనిగంటలు పట్టి ఉంటుంది.’’ ఇది ఏ వస్తువైనా గమ్యం చేరడానికి సాధారణంగా తీసుకునే సమయమే కాదా? దీన్ని ఇంత గొప్పగా చెప్పుకోవాలా? కానీ ప్రధాని, అధికారపార్టీ అధినేత చెప్పుకోవాలని అనుకుంటున్నారు. అటువంటి బృహత్తర లక్ష్యాలను సాధించడంలో ఈ దేశానికి గల పూర్వానుభవాల గురించి చెప్పుకోవలసిన అవసరం ఉన్నదని ఇద్దరు నాయకులూ అనుకోలేదు. ప్రధాని ఏ రోజు ఏ పత్రికలో వ్యాసం రాశారో అదే రోజు అదే పత్రికలో బిల్ గేట్స్ కూడా వ్యాసం రాశారు. ఆయన ఏమని రాశారో చూడండి:

‘‘ఎన్నో రోగనిరోధక టీకాలను పెద్ద ఎత్తున ప్రజలకు జయప్రదంగా ఇచ్చిన సుదీర్ఘమైన అనుభవాన్నీ, పరిజ్ఞానాన్నీ, యంత్రాంగాన్నీ ఇండియా సద్వినియోగం చేసుకున్నది. ’’

ఇంకా ఇలా రాశారు:

‘‘ఇండియాలో అమలు చేసిన ‘‘అందరికీ రోగనిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమం (యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం)’’ ప్రపంచంలో అత్యంత విస్తారమైన ప్రజారోగ్య కార్యక్రమాలలో ఒకటి. ప్రతి సంవత్సరం అప్పుడే పుట్టిన 2.7 కోట్ల మంది శిశువులకు ప్రాథమిక టీకా వేస్తారు. ఒకటి నుంచి అయిదేళ్ళలోపు వయస్సు కలిగిన 10 కోట్ల మంది పిల్లలకి బూస్టర్ డోసులు వేస్తారు. ఇండియాలో సుమారు 27వేల శీతల గిడ్డంగుల సదుపాయం ఉంది. పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ నిర్మించేందుకు పెక్కు సంవత్సరాలుగా పెట్టుబడులు పెట్టి కృషి చేస్తున్నారనీ, దేశంలోని మారు మూలల ప్రాంతాలలో సైతం ఆరోగ్య సేవలు అందిస్తున్నారనీ ఈ దిమ్మతిరిగిపోయే అంకెలు సూచిస్తున్నాయి. కోవిద్ మహమ్మారి సంభవించినప్పుడు ఈ వ్యవస్థ కీలకమైన ఆదరువుగా పనికొచ్చింది.’’

భారత్ లో టీకాల శక్తి గురించి గేట్స్ ఇలా అన్నారు:

‘‘మహమ్మారి రాకమునుపే భారతీయ టీకాలు లక్షలమంది జీవితాలను కామెర్లు, న్యుమోనియా, డయేరియా (అతిసార) వంటి అంటువ్యాధుల నుంచి రక్షించాయి.’’

భారత్ బలం గురించి గేట్స్ చెబుతున్న విషయాలను మన ప్రధాని, అధికారపార్టీ పెద్దలు అంగీకరించడానికి కూడా నిరాకరిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి.

Also read: లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్

ీఐపీ సంస్కృతి నిజంగా లేదా?

ప్రధాని తన వ్యాసంలో, ఉపన్యాసంలో స్వల్పమైన అవరోధాలనూ, లేనిపోని సవాళ్ళనూ ప్రస్తావిస్తారు. వాటిని శక్తిమంతమైన తన ప్రభుత్వం ఎట్లా అధిగమించిందో చెబుతారు. ఉదాహరణ: టీకాలు వేసే కార్యక్రమంలో వీఐపీ సంస్కృతి లేనేలేదని చెప్పారు. ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. వీఐపీలు కానీ తాము ప్రత్యేక హోదా కలిగినవారమని భావించేవారు కానీ ఎవ్వరూ టీకాలు వేయించుకోవడానికి క్యూలో నుంచో లేదు. ఇది నాకు స్వయంగా తెలిసిన విషయం. వారు నేరుగా టీకాలు వేసే కేంద్రానికి వెళ్ళారు. టీకాలు వేయించుకొని రెండు నిమిషాలలో బయటికి వచ్చారు. ఇది టీకాలు ఉచితంగా వేసే కేంద్రాల సంగతి. ప్రత్యేక హోదా కలిగినవారికోసం ఉద్దేశించిన కేంద్రాలలో టీకాలు వేయించుకున్న చాలామంది ప్రముఖులు నాకు తెలుసు. ప్రధాని చెప్పిన మరో విషయం ఏమంటే వందకోట్ల టీకాలు ఉచితంగా  ఇచ్చారని. ఇది అబద్ధమని స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో వేసిన మొత్తం టీకాలలో కనీసం 25 శాతం టీకాలు డబ్బులు చెల్లించి వేయించుకున్నవే. ప్రధాని చెప్పిన మరో అబద్ధం వెల్లడిస్తాను. ఆయన ఏమి అన్నారంటే:

‘‘నిత్యావసరాలకు సైతం విదేశీ బ్రాండ్లనే విశ్వసించేవారు మనలో కొందరు ఉన్నారు.’’ ‘మనలో కొందరు’ అని ఆయన అంటారు. ఆ తర్వాత వాక్యంలో ‘భారత ప్రజలు’ అంటూ మాట్లాడతారు. ఆయన అన్న మాటలివి:

‘‘అయితే, కోవిద్-19 టీకాల వంటి కీలకమైన అంశానికి వచ్చే సరికి భారత ప్రజలు ‘మేడ్ ఇన్ ఇండియా’ (ఇండియాలో తయారైన) టీకాలనే విశ్వసించారు. భారత దేశంలో అత్యంత అధికంగా వాడిన టీకా మందు స్వదేశంలో ఉత్పత్తి అయిన విదేశీ బ్రాండ్ అనే విషయం మరచిపోకూడదు. తక్కువ వినియోగించిన టీకా మందు ఇండియాలో ఉత్పత్తి అయిన భారతీయ బ్రాండ్.  మేడ్ ఇన్ ఇండియా టీకాలను విశ్వసించిన ప్రజలలో ‘మనలో కొందరి’ని కలిపారో, లేదో తెలియదు. విజయాల జాబితాకి ఈ బూటకపు విజయాన్ని కూడా జోడించారు.  నిజమైన విజయం కాదు. అనేక వ్యాధుల నివారణకు వినియోగించే టీకాలన్నీ భారత్ లో ఉత్పత్తి అయినవే, భారత ప్రజలు దశాబ్దాల తరబడి విశ్వసిస్తున్నవేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదే మొదటి సారి కాదు.

పోర్టల్ గురించి ప్రస్తావన

కోవిన్ (COWIN) పోర్టల్ గురించి ప్రధాని మాట్లాడారు. అక్కడికి ఇదేదో సమస్యలకు అతీతమైనదీ, అవాంతరాలు కలిగించనిదీ అయినట్టు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ సదుపాయం లేని వారు ఈ పోర్టల్ తో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో పునరుక్తి దోషం ఉంటుందనే భయంతో ఇక్కడ నేను చెప్పడం లేదు.  సుప్రీంకోర్టు చేసిన కటువైన వ్యాఖ్యల నుంచి అది తప్పించుకోలేకపోయింది. ఆ తర్వాత చాలా రోజులకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి అనే నిబంధనను సడలించారు.

ప్రధాని రాసిన అదే వ్యాసంలోని మరో అంశం చూద్దాం. అయన ఇలా అన్నారు:

‘‘ప్రపంచమంతటా కోవిద్-19 స్వైరవిహారం చేస్తున్న 2020 ప్రథమార్ధంలో ఆ మహమ్మారితో టీకాలతో పోరాడాలని మనకు స్పష్టంగా అర్థమైంది. అందుకని తొందరగానే మనం సంసిద్ధులం కావడం ప్రారంభించాం. 2020 ఏప్రిల్ నుంచి కోవిద్ తో పోరాటానికి వ్యూహరచన చేశాం, ప్రవీణుల బృందాలను ఏర్పాటు చేశాం.’’

కోవిద్ మహమ్మారిని అంతిమంగా  టీకాల సహాయంతోనే పోరాడాలని తనకు తెలుసునని ప్రధానమంత్రి అన్నారు. ఆ లోగా లైట్లు ఆర్పివేయడం, దివ్వెలు (ప్రమిదలు) వెలిగించడం, కంచాలు మోగించడం, చప్పట్లు కొట్టడం కూడా పని చేస్తాయని బహుశా ఆయన ప్రయత్నించి ఉంటారు. ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కి చెందిన అప్పడాలు తినడం, ఒక యోగా గురువుకు చెందిన ఫ్యాక్టరీ నుంచి తెచ్చిన మందు తీసుకోవడం, ఒంటి నిండా ఆవు పేడ పూసుకోవడం, ఆవు మూత్రం సేవించడం, కొన్ని అక్షరాలు ఉచ్ఛరించడం వల్ల తప్పని సరిగా అంటువ్యాధి నయం అవుతుందని ప్రధాని మంత్రిమండలి సభ్యులూ, పార్టీ  సహచరులూ శక్తివంచనలేకుండా ప్రచారం చేశారు.

మనం తొందరగా సంసిద్దులం కావడం ప్రారంభించాం అని అదే పేరాలో రాశారు. కోవిద్ రెండో తరంగం మనల్ని ఊపిరాడకుండా చేసి వేధించినప్పుడు మనం ఎంతటి అస్తవ్యస్తంగా ఉన్నామో, ఎటువంటి సంక్షోభంలో ఉన్నామో మీకు గుర్తుండే ఉంటుంది. దేశంలో టీకాలు ఉత్పత్తి చేసే రెండు ప్రధాన సంస్థలకు మనం ముందస్తుగా ఏమీ చెల్లించలేదు. ఏప్రిల్ నాటికి చాలా చిన్న ఆర్డరు పెట్టాం. దేశంలో టీకాలు వేసుకోదగిన వయసులో ఉన్నవారందరికీ టీకాలు వేయించాలంటే మనకు కనీసం 180 కోట్ల డోసులు కావాలని మనకు తెలుసు. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి 26 కోట్ల డోసులకూ, భారత్ బయోటెక్ కు అయిదు కోట్ల డోసులకూ ఏప్రిల్ నాటికి ఆర్డర్లు పెట్టాం. అప్పటికే చాలా దేశాలు  ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి టీకా ఉత్పత్తి సంస్థలలో రిస్కు తీసుకొని పెట్టుబడులు పెట్టాయి. పదికోట్ల డోసులకు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి గేట్స్ ఫౌండేషన్ ముందస్తుగా డబ్బు చెల్లించింది. పరిస్థితి చేయి దాటిపోయేటప్పటికీ ఆ సంస్థ  అంతర్జాతీయంగా పంపిణీ చేయవలసిన డోసులను పంపకుండా ప్రభుత్వం అడ్డుకొని ఆ సంస్థ ఉత్పత్తి చేసిన డోసులన్నిటినీ దేశంలో వినియోగానికి బలవంతంగా ఇప్పించింది. ప్రధాని అభిప్రాయం ప్రకారం త్వరగా సిద్ధం కావడమంటే ఇదే కాబోలు! సాక్ష్యాధారాల ఆధారంగా విధాన నిర్ణయం జరగకపోవడం పట్ల బాధ వెలిబుచ్చుతూ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఒకరు 2020మేలో రాజీనామా చేసిన సంగతి గుర్తకు తెచ్చుకోవాలి. ప్రవీణుల బృందం సంగతి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మందలించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు 2020 జూన్ లో నిద్రలేవాలంటూ ప్రభుత్వాన్ని మందలించి కుదిపిలేపిన తర్వాతనే టీకాల సేకరణ, ధరల నిర్ణయం వంటి విధానాలు గాడిలో పడ్డాయి. మొదట్లో ప్రభుత్వం 50 శాతం డోసులనే సేకరించాలనీ, పాతిక శాతం డోసులు రాష్ట్రాలు సేకరించాలనీ, తక్కిన పాతిక శాతం ప్రైవేటు కొనుగోలుదారులు సేకరించాలనీ కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలు దిక్కుతోచక అటూఇటూ  పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ టెండర్లు వేసి భంగపడ్డాయి. మరో విషయం చెప్పుకోవాలి.  దేశీయ ఉత్పత్తిదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం డోసుకు రూ. 150లు చెల్లించి కొంటుంది. రాష్ట్రాలు మాత్రం కోవీషీల్డ్ డోసుకు రూ. 300లు, కొవాగ్జిన్ డోసుకు రూ. 600లు సొంత వనరుల నుంచి చెల్లించి కొనుగోలు చేయాలనే నిర్ణయం కూడా చేశారు. 45 ఏళ్లకు పైబడిన వయస్సు ఉన్నవారికీ, ఆరోగ్యరంగ కార్యకర్తలకీ (ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లకీ) టీకాలు ఇప్పించే బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. సుప్రీంకోర్టు ఒత్తిడి పెంచిన తర్వాతనే 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్నవారికి ఇచ్చేందుకోసం టీకా డోసులు సేకరించి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వం అంత తేలికగా లొంగలేదు. రకరకాల ధరలు నిర్ణయించడాన్నీ, పరిమితమైన బాధ్యత తీసుకోవడాన్నీ గట్టిగా సమర్థించుకున్నది. కోర్టు తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన తర్వాతనే బెట్టు సడలించింది. దేశంలో టీకాల విషయంలో గందరగోళం జరిగిన నాటి దుర్బర దశను గుర్తు చేయకూడదని ప్రధాని, ఆయన ప్రభుత్వం కోరుతున్నారు. కొత్తగా నెలకొల్పిన ‘పీఎం కేర్స్ ఫండ్’ మతలబు ఏమిటో, దాని వివరాలు ఏమిటో చెప్పడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. టీకాల కోసం బడ్జెట్ లో కేటాయించిన రూ. 35,000 కోట్లు ఎట్లా ఖర్చు చేశారో మనకు తెలియవలసి ఉన్నది. మనం తెలుసుకోవడం వారికి ఇష్టం లేదు.

అక్టోబర్ 21న మహోత్సవం కంటే ముందు టీకాలకు సంబంధించి మనం సాధించిన చిన్న విజయం ఒకటి ఉన్నది. అది సెప్టెంబర్ 17వ తేదీనాడు ఒకే ఒక రోజులో రెండు కోట్ల మందికి టీకాలు వేసి ప్రధానికి జన్మదిన కానుక దేశం సమర్పించింది. ఆ రోజుకు మందూ, ఆ రోజు తర్వాతా చాలా తక్కువ సంఖ్యలో టీకాలు వేశారనే వాస్తవాన్ని మనం గుర్తించాలని ప్రభుత్వం కోరుకోవడం లేదు.

తప్పుడు ఉదాహరణలూ, దబాయింపులూ

ప్రపంచం అంతా కలిసి ఏడు బిలియన్ (ఏడు వందల కోట్ల) డోసుల టీకాలు ఇస్తే ఇండియా ఒక్కటే వందకోట్ల టీకాలు వేసిందంటూ బీజేపీ అధ్యక్షుడు ఒక వార్తాపత్రికలో రాసిన వ్యాసంలో గొప్పగా పేర్కొన్నారు. సరే. చైనా తప్ప ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో కూడా వందకోట్ల టీకాలు వేయవలసిన అవసరం లేదనే విషయం మనం తెలుసుకోవాలని ఆయన కోరుకోవడం లేదు. ఉదాహరణకు అమెరికాను తీసుకోండి. ఆ దేశంలో టీకాలు వేయించుకోదగిన వయస్సులో ఉన్న జనాభా అందరికీ రెండు డోసులు మాత్రమే కాకుండా బూస్టర్ (మూడో) డోసు కూడా టీకాలు వేసనప్పటికీ వందకోట్ల డోసులు కావు. ప్రపంచంలోని మిగిలిన ప్రతి దేశం సంగతీ అంతే. దీనికి ఒకే ఒక మినహాయింపు, జనభాలో మనదేశంతో పోల్చదగిన దేశం ఒక్క చైనా మాత్రమే. దాన్ని పరిశీలిద్దాం. చైనా వందకోట్ల టీకాలు వేయడం ఈ సంవత్సరం జూన్ నాటికే పూర్తి చేసింది. అంటే మనకంటే నాలుగు మాసాలు ముందే. ఆగస్టు నాటికి రెండు వందల కోట్ల డోసులు పూర్తి చేసింది. అంటే, వందకోట్ల మైలు రాయి దాటిన తర్వాత రెండు మాసాలకే రెండు వందల కోట్ల లక్ష్యం ఛేదించింది. కానీ మన అధికార పార్టీ నాయకులు తప్పుడు ఉదాహరణల వైపు చూడమంటారు. మనకంటే తక్కువ జనాభా ఉన్న దేశాలను గమనించమంటారు. సంతోషించి సంబరాలు చేసుకోమంటారు. టీకాలు వేసుకున్నవారి సంఖ్య దేశ జనాభాలో ఫలానా శాతం అంటూ లెక్కలు వేసేవారిని అధికారపార్టీ అధ్యక్షుడు కోప్పడతారు. మొత్తం సంఖ్య మాత్రమే చూడాలంటూ గద్దిస్తారు. కానీ చైనా గురించీ, దాని అంకెల గురించీ ప్రధాని కానీ, అధికారపార్టీ అధ్యక్షుడు కానీ, ప్రభుత్వంలో, పార్టీలో ఉన్న పెద్దలు కానీ పొరపాటున కూడా మాట్లాడరు. అంకెలలోనూ, శాతాలలోనూ చైనా మనకంటే చాలా ముందుంది.  చైనా 104 కోట్ల మందికి, అంటే 75 శాతం జనాభాకి,  పూర్తిగా టీకాలు వేసిందని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్శిటీ డాష్ బోర్డు చెబుతోంది. మనం ఇప్పటి వరకూ 28 వేలకోట్ల మందికి, అంటే జనాబాలో 21 శాతం మందికి మాత్రమే టీకాలు వేయించాం. ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమంటే చైనా ఘనకార్యం చేసింది, మౌనంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నది – ఒక పాట కానీ, ఒక నృత్యం కానీ, ఒక బడాయి కానీ లేకుండా.

మనం సంబరాలు చేసుకోవాలనిీ, ఉద్సవం జరుపుకోవాలనీ ప్రధాని, ప్రభుత్వం కోరుకుంటున్నారు. ప్రతి చిన్న విషయం సాధించినా సంబరం చేసుకోమంటున్నారు. అంతే కాదు. మన సామూహిక జ్ఞాపకఫలకంలో నుంచి గతాన్ని చెరిపివేయమంటున్నారు. చెప్పుకోదగినది ఏదీ గతంలో జరగలేదనీ, అంతా ఇప్పుడే జరుగుతోందనీ నమ్మమంటున్నారు. నిర్లక్ష్యాన్ని, అభద్రతాభావాన్ని, ముందస్తు తయారుగా లేకపోవడాన్ని, తడబాటునూ, సంక్షోభాన్ని గుర్తు చేసి మాట్లాడేవారిని దుష్టులుగా, విలన్లుగా పరిగణించాలని కోరుకుంటారు. సమీప గతంలో జరిగిన విషయాలు సైతం మనం మరచిపోవాలని వారు కోరుకుంటారు. ఈ ఏడాది మార్చి, ఏప్రల్, మే, జూన్ లో జరిగిన సంగతులు కూడా విస్మరించమంటారు. మనందరం మన కుటుంబ సభ్యుడినో, బంధువునో, ప్రియతమ మిత్రుడినో, తెలిసినవారినో కోల్పోయామనే వాస్తవాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోకూడదని వారు అనుకుంటారు. ఆస్పత్రులలో పడకలు లేక, వెంటిలేటర్లు లేక, ఆక్సిజన్ లేక, సకాలంలో వైద్య సహాయం అందక వారంతా చనిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవద్దంటారు.

ఇటువంటి కోరికలు ఏ ప్రభుత్వానికి ఉంటాయి?

పవిత్ర గంగానదిలో కొట్టుకొచ్చిన వందలాది శవాల గురించి మరచిపోవాలంటారు. మన నగరాల పేవ్ మెంట్ల మీద శవాలు గుట్టలుగా పడి ఉన్న సంగతినీ, శ్మశానాల దగ్గర పొడవైన క్యూలనూ  మన సామూహిక జ్ఞాపకంలో నుంచి చెరిపేసి తొలగించమంటారు. ఒక చిన్న మైలు రాయిని ఘనాతిఘన విజయంగా సంభావించి సంబరం చేసుకోమంటారు. మనం ఏడవకూడదు, సంతాపం ప్రకటించకూడదు, ఆగ్రహించకూడదు, నిరసన వ్యక్తం చేయకూడదు, వారిని లెక్క అడగకూడదు, సంజాయిషీ అడగకూడదు. గతించిన అంశాలను గుర్తు పెట్టుకొని బాధపడటం నకారాత్మకంగా, నెగెటివ్ గా, ఆలోచించడం కాదా? సంబరాలలో పాలు పంచుకొని దేశభక్తులు కండి. విషాదాన్ని గుర్తుపెట్టుకొని దేశభక్తిలేనివారుగా ఎందుకు ఉండాలి? సంబరం చేసుకోండి. సకారాత్మకంగా ఆలోచించండి. ముందడుగు వేయడం నేర్చుకోండి.

చిన్న విషయానికి కూడా ఉత్సవం చేసుకోవాలని ఏ ప్రభుత్వం కోరుతుంది? మామూలుగా, సర్వసాధారణంగా జరిగే విషయాన్ని అసాధారణమైన బ్రహ్మాండమైన విజయంగా భావించి జయజయధ్వానాలు ఏ ప్రభుత్వం చేయమంటుంది? అసలు నిజమైన విజయాలు ఏవీ సాధించలేని ప్రభుత్వమే ఆ విధంగా కోరుకుంటుంది. గతాన్ని మనం మరచిపోవాలని ఏ ప్రభుత్వం కోరుకుంటుంది? ఆత్మవిశ్వాసం లేని, తన దక్షత పట్ల నమ్మకం లేని ప్రభుత్వమే ఆ విధంగా కోరుకుంటుంది. ఏ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది? చాలా నిజాలు దాచవలసిన అవసరం ఉన్న ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది. ఈ మాయలూ, గమ్మత్తులూ చేయడానికి ఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది? పౌరులంటే చాలా చులకనైన అభిప్రాయం కలిగిన ప్రభుత్వం. మసిపూసి మారేడుకాయ చేసినా వారు తెలుసుకోలేని అమాయకులని అనుకునే ప్రభుత్వం.

స్టాలిన్ గురించి నీనా పాబ్లెజోవా ఈ విధంగా అన్నారు: ‘‘ఆయన బాల్కనీలో నిలబడి అబద్దం చెబుతారు. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతారు. కానీ అతడు అబద్దం చెబుతున్నాడని ప్రతి ఒక్కడికీ తెలుసు. వారికి తెలుసునని ఆయనకూ తెలుసు. ఆయన అబద్ధాలూ చెబుతూనే పోతారు. అందరూ విని కరతాళధ్వనులు చేస్తున్నారని ఆనందిస్తారు.’’

మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదనీ, అది మన  వాస్తవికత కారాదని మాత్రమే నా ఆకాంక్ష. మనం అక్కడికి వెళ్ళే మార్గంలో లేమన్నదే నా ఆశాభావం.

Also read: కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…       

(Midweek Matters-35 episodeకి స్వేచ్ఛానువాదం)

Dr. Parakala Prabhakar
Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles