- రెండో దశలో భారీ సంఖ్యలో దాఖలైన నామినేషన్లు
- ఈ-వాచ్ యాప్ ను నిలిపివేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్ల పరిథిలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. 175 మండలాల్లో 3,335 గ్రామ పంచాయతీలకు ఈ నెల 2 నుంచి 4 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 3,335 గ్రామ పంచాయతీల్లో సర్పంచి పదవులకు 19,399 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 33632 వార్డులకు గాను 79,842 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపింది. చిత్తూరు జిల్లాలో 276 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా అత్యధికంగా 2046 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కడప జిల్లాలో 175 పంచాయతీలు, కృష్ణాజిల్లాలో 211 పంచాయతీలుండగా రెండు చోట్లా అత్యల్పంగా 1079 నామినేషన్లు దాఖలయ్యాయి.
వార్డుల వారీ గా చూస్తే విశాఖపట్నంలో 2584 వార్డులకు గాను అత్యధికంగా 8619 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల్లో తక్కువగా కడప జిల్లాలో 1750 వార్డులకు గాను 3492 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింవది. ఈ నెల (ఫిబ్రవరి)8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే వెసులుబాటు ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
Also Read: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కొరడా!
ఈ-వాచ్ సేవలు నిలిపివేసిన హైకోర్టు:
మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య ట్విస్ట్ లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎన్నికల సంఘం తెచ్చిన ఈ-యాప్ పై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ విజిల్ యాప్ ఉండగా మళ్లీ కొత్తగా ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో యాప్ తీసుకురావడం సరికాదని దీనిపై పలు అనుమానాలున్నాయని వైసీపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. యాప్ కు భద్రతాపరమైన అనుమతులు లేవని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వైసీపీ పిటీషన్ తో ఈ-వాచ్ యాప్ ను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెల 9 వరకు ఈ వాచ్ యాప్ సేవలను నిలిపివేయాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
Also Read: ఈ-వాచ్ యాప్ ను ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ