- స్పిన్ పిచ్ పైన ఇంగ్లండ్ తో తాడోపేడో
- నెగ్గితేనే ఫైనల్స్ బెర్త్ ఆశలు సజీవం
- నదీం స్థానంలో అక్షర్ పటేల్
- బెస్ పోయే,మోయిన్ అలీ వచ్చే.
భారత్- ఇంగ్లండ్ జట్ల నాలుగుమ్యాచ్ ల సిరీస్ రెండోటెస్టుకే వేడెక్కింది.చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా శనివారం నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ పోరు ఆతిథ్య భారత్ కు చావో బతుకో సమరంలా మారింది.ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ రెండోటెస్టులో ఆరునూరైనా భారత్ నెగ్గితీరాల్సి ఉంది.
ముగ్గురు స్పిన్నర్లతో భారత్:
చెపాక్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో 227 పరుగుల భారీఓటమితో కుదేలైన భారతజట్టు.రెండోటెస్టుకు మాత్రం సాంప్రదాయ స్పిన్ వికెట్ తో ప్రత్యర్థికి సవాలు విసురుతోంది. అంతేకాదు ఇద్దరకు బదులు ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో ఇంగ్లండ్ ను దెబ్బకు దెబ్బతీయాలన్న పట్టుదలతో సిద్ధమయ్యింది.తొలిటెస్టుకు భిన్నంగా ఒకటి లేదా రెండుమార్పులతో విరాట్ సేన బరిలోకి దిగనుంది. సిరీస్ తొలిసమరంలో విఫలమైన లెఫ్టామ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను తుదిజట్టులోకి తీసుకోనున్నారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను సైతం జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.
Also Read: భారత్ తో టీ-20 సిరీస్ కు ఇంగ్లండ్ జట్టు
టాస్ నెగ్గితే మ్యాచ్ నెగ్గినట్లే
తొలిటెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ పరిస్థితులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని నాలుగో ఇన్నింగ్స్ల్ లో భారత్ ను కుప్పకూల్చడం ద్వారా భారీవిజయం సొంతం చేసుకోగలిగింది. రెండోటెస్టులో సైతం టాస్ మరోసారి కీలకం కానుంది. టాస్ నెగ్గినజట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని భారీతొలిఇన్నింగ్స్ స్కోరుతో మ్యాచ్ నెగ్గే అవకాశం ఉంటుంది.మ్యాచ్ కోసం సిద్ధం చేసిన నల్లమట్టి వికెట్ రెండోరోజునుంచే స్పిన్ బౌలర్లకు అనుకూలించడం ఖాయమని ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ బెన్ స్టోక్స్ ముందుగానే జోస్యం చెప్పాడు. భారత టాపార్డర్ స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ,వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు భారీస్కోర్లు సాధించగలిగితేనే విజయానికి మార్గం సుగమమవుతుంది.
Also Read: రెండో టెస్టుకు ఆర్చర్ దూరం
ఇంగ్లండ్ జట్టులో మార్పులు:
ఇంగ్లండ్ టీమ్ మేనేజ్ మెంట్ తుదిజట్టులో పలు మార్పులు ప్రకటించింది. తొలిటెస్టులో మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన ఆఫ్ స్పిన్నర్ బెస్, స్వింగ్ కింగ్ జిమీ యాండర్సన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ లకు విశ్రాంతి ఇచ్చింది. మోచేతిగాయంతో ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ సైతం జట్టుకు దూరం కావడంతో నాలుగు మార్పులతో ఇంగ్లండ్ తుదిజట్టును ప్రకటించింది.స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ పేస్ బౌలింగ్ బాధ్యతలను, మోయిన్ లీ, లీచ్ స్పిన్ బౌలింగ్ విధులు నిర్వర్తించనున్నారు.
భారత్ విరుచుకుపడటం ఖాయం-రూట్:
తొలిటెస్టులో 227 పరుగుల భారీ ఓటమి పొందిన భారతజట్టు తమపైన దెబ్బతిన్న బెబ్బులిలా విరుచుకు పడటం ఖాయమని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ భావిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే తాము పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.ఎనిమిదిసంవత్సరాల సుదీర్ఘవిరామం తర్వాత భారతగడ్డపై టెస్టువిజయం సాధించిన ఉత్సాహంతో వరుసగా రెండోవిజయానికి ఇంగ్లండ్ ఉరకలేస్తోంది. మరోవైపు గత నాలుగేళ్లలో స్వదేశీ సిరీస్ ల్లో తొలి టెస్టు ఓటమి పొందిన భారత్ తొలివిజయానికి తహతహలాడుతోంది.
గేట్లు తెరుచుకోనున్న చెపాక్ స్టేడియం:
ప్రస్తుతసిరీస్ లోని తొలిటెస్టును అభిమానులు లేకుండానే గేట్లు మూసి మరీ నిర్వహించారు. అయితే రెండోటెస్టు నుంచి కోవిడ్ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా స్టేడియం కెపాసిటీలో సగం మందిని మాత్రమే అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది.చెపాక్ స్టేడియం సీటింగ్ సామర్థ్యానికి అనుగుణంగా రోజుకు 18 వేల నుంచి 20 వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్వాహక తమిళనాడు క్రికెట్ సంఘం నిర్ణయించింది.మ్యాచ్ చూడటానికి వచ్చే అభిమానులు సామాజికదూరం పాటించడంతో పాటు మాస్క్ లు విధిగా ధరించాలని నిర్వాహక సంఘం సూచించింది.
Also Read: భారత్ తొలి ఓటమికి కారణాలు ఎన్నెన్నో!
భారత్ కు ఫైనల్స్ బెర్త్ సంకటం:
టెస్ట్ లీగ్ ఫైనల్స్ చేరాలంటే ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ ను 2-1 , లేదా 3-1తో నెగ్గితీరాల్సిన భారత్ ఇప్పటికే 0-1తో వెనుకబడి ఉంది. మిగిలిన మూడుటెస్టుల్లో ఓటమి లేకుండా కనీసం రెండుమ్యాచ్ లు గెలిచితీరాల్సి ఉంది. అదే ఇంగ్లండ్ మాత్రం ఇప్పటికే 1-0 ఆధిక్యం సాధించడంతో మిగిలిన మూడుమ్యాచ్ ల్లో రెండు నెగ్గినా టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది.రానున్న ఐదురోజుల ఈ స్పిన్ బౌలర్ల సమరంలో భారత్ నెగ్గుకు వస్తుందా? 1-1 తో ఇంగ్లండ్ తో సమఉజ్జీగా నిలువగలుగుతుందా? తెలుసుకోవాలంటే కొద్దిరోజులపాటు వేచిచూడక తప్పదు.