- శతకాల లేమిపై పెదవి విప్పిన కొహ్లీ
- మూడంకెల స్కోర్ల కన్నా గెలుపే మిన్న
గత 580 రోజులుగా అంతర్జాతీయ శతకాలు తనకు చిక్కకుండా పోతున్నతీరు పైన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తొలిసారిగా పెదవి విప్పాడు. పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండోవన్డేలో తమ జట్టు ఘోరపరాజయానంతరం కొహ్లీ పలు అంశాల గురించి తన మనసులోమాట బయటపెట్టాడు.
గత 12 సంవత్సరాల తన అంతర్జాతీయ కెరియర్ లో ఏనాడూ మూడంకెల స్కోరు కోసం తాను ఆడలేదని, జట్టు గెలుపే తనకు ప్రధానమని తెలిపాడు. టెస్టులు, వన్డేలు కలిపి ఇప్పటి వరకూ 70 శతకాలు సాధించిన కొహ్లీ తన చిట్టచివరి సెంచరీని 2019లో సాధించాడు.నాటినుంచి ప్రస్తుత సిరీస్ లోని రెండో వన్డే వరకూ కొహ్లీకి శతకాలు మొహం చాటేస్తూ వస్తున్నాయి.
Also Read: భారత్ కు బెన్.. స్ట్రోక్
ఈడెన్ గార్డెన్స్ లో చివరి శతకం..
2019 సీజన్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన మొట్టమొదటి డే-నైట్ టెస్టులో విరాట్ కొహ్లీ టెస్టుల్లో తన చివరి శతకం సాధించాడు.అంతేకాదు వన్డే క్రికెట్లో సైతం తన ఆఖరి శతకాన్ని 2019 సిరీస్ లో భాగంగా ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా నమోదు చేశాడు. ఆస్ట్ర్రేలియా గడ్డపై ఆడిన టెస్టు సిరీస్ , వన్డే, టీ-20 సిరీస్ లతో పాటు ఇంగ్లండ్ తో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు, ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లతో పాటు తీన్మార్ వన్డే సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో సైతం కొహ్లీ మూడంకెల స్కోర్లు సాధించలేకపోయాడు.
పూణే వేదికగా ముగిసిన రెండోవన్డేలో కొహ్లీ 66 పరుగుల స్కోరుకు లెగ్ స్పిన్నర్ రషీద్ బౌలింగ్ లో కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మొదటి రెండువన్డేలలోనూ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు బాదిన కొహ్లీ ఆఖరి వన్డే పైన దృష్టి పెట్టాడు.
సెంచరీల కోసమే ఆడితే..
తాను సెంచరీల కోసమే ఆడి ఉంటే ఇప్పటికే ఎన్నో వచ్చి ఉండేవని, జట్టు విజయం, ప్రయోజనం కోసమే తాను ఆడిన కారణంగా పలుసార్లు శతకాలు చేజారాయని కొహ్లీ గుర్తు చేశాడు.సెంచరీలు, రికార్డుల కోసమే ఆడే ఆటగాడిని తానుకానని, ఇకముందు కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశాడు. గత పుష్కరకాలంలో కొహ్లీ వన్డేలలో 42, టెస్టుల్లో 28 శతకాలు సాధించడం ద్వారా మాస్టర్ సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
స్టోక్స్, బెయిర్ స్టోలకు హ్యాట్సాఫ్…
రెండోవన్డేలో తాము 326 పరుగుల భారీస్కోరు సాధించి ఓటమిపొందటం పట్ల భారత కెప్టెన్ నిరాశను వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ ను నిరోధించడంలో తాము విఫలమయ్యామనేకంటే ఓపెనర్ బెయిర్ స్టో, ఆల్ రౌండర్ స్టోక్స్ ల పవర్ హిట్టింగ్ కారణంగానే తాము ఓడామని వివరించాడు. విజయానికి ఇంగ్లండ్ అన్ని విధాల అర్హమైన జట్టని ప్రశంసించాడు.వన్డే క్రికెట్ చేజింగ్ లో తాను చూసిన అత్యుత్తమ పవర్ హిట్టింగ్ బెయిర్ స్టో- బెన్ స్టోక్స్ల్ లదేనని విరాట్ కొహ్లీ కితాబిచ్చాడు. ఆదివారం జరిగే ఆఖరివన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని చెప్పాడు.
Also Read: భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ కు గాయాలదెబ్బ