- ప్రభుత్వం వేధిస్తోంది, వేటాడుతోంది
- ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన రోజునే నన్ను బదిలీ చేశారు
- అసత్య ఆరోపణలతో అరెస్టు చేయాలని యోచిస్తోంది
- నా వ్యధను ఆలకించడం అసోసియేన్ విధి
విజయవాడ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తనను పనిగట్టుకొని వేధిస్తున్నదని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ చాప్టర్ కార్యదర్శికి మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాధినేతగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే (30 మే 2019) తనను ఏసీబీ డైరెక్టర్ జనరల్ పోస్టు నుంచి బదిలీ చేసి జీఏడీకి రిపోర్టు చేయమని ఆదేశించారనీ, అప్పటి నుంచి ఏడు మాసాలపాటు పోస్టింగ్ ఇవ్వకుండా, జీతం చెల్లించకుండా వేధించారనీ 3 జనవరి 2021న రాసిన లేఖలో రావు తెలియజేశారు. వెంకటేశ్వరావు లేఖ పూర్తిపాఠం:
‘‘నన్ను ఏదో ఒక హోదాలో నియమించి, తన జీతం బకాయీలతో సహా చెల్లించాలంటూ 6 జనవరి 2020న జీఏడీకి రాసిన లేఖలో అభ్యర్థించాను. 28 జనవరి 2020న మరోసారి నా సంగతి గుర్తు చేస్తూ మరొక లేఖ రాశాను. నాకు పోస్టింగ్, జీతం లేకుండా ఉంచిన కాలంలో నాపైన కేసుకానీ, విచారణ కానీ ఏమీ లేదు. నా 30 ఏళ్ళ సర్వీసులో ఏసీఆర్ లో ప్రతికూలమైన అంశం ఏదీ నమోదు కాలేదు.
ఇది చదవండి: జగన్ ఫిర్యాదుపై జస్టిస్ రమణ స్పందన కోరిన సుప్రీం చీఫ్ జస్టిస్
‘‘నా విజ్ఞప్తులకు సమాధానం రాలేదు. రెండేళ్ళ కిందట డీజీపీ కార్యాలయం కొనుగోలు చేయాలని తలపెట్టిన పరికరాల వ్యవహారంపైన దర్యాప్తు చేయాలంటూ డీజీపీ (హెచ్ఓపిఎఫ్) 2 ఫిబ్రవరి 2020న ఏడీజీ,సీఐడీకి ఒక మెమో ఇచ్చారు. ఆ చేయని కొనుగోలులో ఒక రూపాయ ఖర్చు చేయడం కానీ అక్రమంగా ఎవరైనా సొమ్ము చేసుకోవడం కానీ జగలేదని చెప్పడం ఇక్కడ అప్రస్తుతం కాదు.
‘‘ఆ విచారణను సీఐడీలో డీఎస్ పి కి 3 ఫిబ్రవరి 2020న అప్పగించారు. 6 ఫిబ్రవరి 2020న ఒక నివేదికను తయారు చేశారు. 7 ఫిబ్రవరి 2020 ఆ నివేదికను రాష్ట్రప్రభుత్వానికి పంపించారు. ఆ మరునాడే 8 ఫిబ్రవరి 2020న నన్ను సస్పెన్షన్ లో పెట్టారు.
‘‘నేను దేశద్రోహానికి ఒడిగట్టినట్టు అభూతకల్పనలతో, నిరాధారమైన ఆరోపణలతో సంతకం లేని ప్రకటనలను స్థానిక, జాతీయ మీడియాకు అందించి పెద్ద ఎత్తున సస్పెన్షన్ గురించి ప్రచారం చేయించారు. నేను అడ్వకేటుకు భారీ ఫీజు చెల్లించి క్యాట్ లో ఒక అప్పీల్ ను సమర్పించాను. ఆ అప్పీల్ ను క్యాట్ తోసిపుచ్చింది. నేను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు అనుమతించింది. నాకు అన్ని జీతభత్యాలూ ఇచ్చి ఉద్యోగంలో తిరిగి నియమించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇది చదవండి: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
‘‘అయితే, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వును అమలు చేయకపోగా ఆరు మాసాల తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. నా వ్యక్తిగత సంపాదనలో పొదుపు చేసుకున్న మొత్తం నుంచి ఖర్చులను భరించవలసి వచ్చింది. నన్ను సస్పెండ్ చేసిన తర్వాత పది మాసాలకు నాపైన రాష్ట్రప్రభుత్వం ఆరోపణలు (ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్) విడుదల చేసింది. ఆ ఆరోపణలలో ఆధారం కానీ రుజువులు కానీ ఏమీ లేవని వాటిని చదివిన తర్వాత అర్థమైంది. విచారణ అధికారి ముందు అన్ని ఆరోపణలూ నిరాధారమైనవని నేను రుజువు చేయగలను.
‘‘ఈ లోగా నాకు అందిన సమాచారం మేరకు నాపైన క్రిమినల్ కేసు పెట్టి నాకు ముందస్తు బెయిలు కూడా దొరకకుండా వెంటనే అరెస్టు చేయాలనీ, 48 గంటలు కానీ అంతకంటే ఎక్కువ సమయం కానీ కస్టడీలో ఉన్నాననే కారణంగా నన్ను మరోసారి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పథకం రచించినట్టు తెలుస్తోంది.
‘‘నేను ఈ వాస్తవాలన్నిటినీ రికార్డు చేస్తూ మీకు తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత త్వరలో ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి అసోసియేషన్ ఎగ్జిక్యుటివ్ కమిటీ ఎంతవరకూ, ఏ విధంగా జోక్యం చేసుకోగలదో నిర్ణయించాలి. అన్నీ అసోసియేషన్ స్వభావానికీ, నిబంధనలకూ తగిన విధంగానే జరగాలి.
‘‘అసోసియేషన్ నుంచి నేను ప్రత్యేకమైన ఉపకారం ఏమీ కోరడం లేదు. ఇది ఒక అధికారిని తన నిగూఢమైన లక్ష్యాలకోసం ఎటువంటి ఆధారాలూ లేకుండా ప్రభుత్వం అదేపనిగా వేధిస్తోంది కనుక, నాకు వ్యతరేకంగా ఎటువంటి సాక్ష్యధారాలు లేకుండా అబద్దపు ఆరోపణలతో విచారణ పేరుతో యాతనపెడుతోంది కనుక మన సంఘం దృష్టికి తీసుకొని వస్తున్నాను.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘‘లోగడ ఇటువంటి పరిస్థితులలోనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జోక్యం చేసుకొని న్యాయం చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా పని చేస్తున్న కె.వి. రాజేద్రనాథ్ రెడ్డి ని 2009 డిసెంబర్ లో సస్పెండ్ చేసినప్పుడు అప్పుడు ఆయన విజయవాడ సిటీ కమిషనర్ గా ఉన్నారు. స్థానిక ఎంపీ (లడగపాటి రాజగోపాల్) హాస్పిటల్ నుంచి తప్పించుకొని పొవడానికి సహకరించాడనే ఆరోపణ రాజేంద్రనాథ్ రెడ్డి మీద వచ్చినప్పుడు నాతో సహా కొందరు ఆఫీసర్లు అప్పటి డీజీపీని కలుసుకొని వారం రోజులలోగా ఆయనను ఎటువంటి ఆరోపణలూ లేకుండా తిరిగి ఉద్యోగంలో పెట్టిన సంగతి గుర్తు చేస్తున్నాను.
‘‘ప్రతి కేసూ ప్రత్యేకమైనదని అంగీకరిస్తున్నాను. ఒక సారి అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తే నా వివరాలు నేను చెబుతాను. ఏ సభ్యుడికైనా అనుమానాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేస్తాను. ఎటువంటి నిర్ణయానికి రావాలో సర్వసభ్య సమావేశం వివేకానికి వదిలిపెడతాను. ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చునో లేదో జనరల్ బాడీ నిర్ణయించవచ్చు.
‘‘న్యాయమైన, నిస్పాక్షికమైన విచారణ మాత్రమే నేను కోరుతున్నాను. రూల్ ఆప్ లా, నాచురల్ జస్టిస్ సూత్రాలకు కట్టుబడి ఏ అధికారి అయినా విచారణ జరిపించాలనే విషయాన్ని అధికారులందరూ గుర్తుపెట్టుకొని బాధ్యతాయుతంగా మెలగాలని నేను కోరుకుంటున్నాను.
‘‘ప్రస్తుత ప్రభుత్వం ఒక అధికారిని అవమానాలకు గురి చేస్తూ, వేటాడుతూ ఉంటే ఆ విషయంలో జోక్యం చేసుకోవడం అటుంచి, ఆ వాస్తవాన్ని గుర్తించడానికైనా అంగీకరించని అసోసియేషన్ ఉండీ ప్రయోజనం లేదన్నది నా అభిప్రాయమని వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందుకే సాధ్యమైనంత త్వరలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నాను.
మీ విశ్వాసపాత్రుడు
ఏ.బి. వెంకటేశ్వరరావు (ఐపీఎస్)
1989 ఆర్.ఆర్. ఏపీ
ఇది చదవండి: ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్