- వెలిగే సంప్రదాయ జ్యోతులు
- అంతిమ విజయం ధర్మందేనని చాటిన రోజు
దివ్య దీపావళి పర్వదినం భవ్య మోహనంగా జరుగుతున్న పుణ్యక్షణాలు ఇవి. అంతటా వెలుగుదివ్వెలు మెరిసి మురిసే ముచ్చటైన పండుగరోజులివి. అమావాస్యనాడు వచ్చే వెన్నెలరోజు లివి. పున్నెము పున్నమిగా సాగే భారతీయమైన వెలుగు ఇది. అష్టలక్ష్మీ కటాక్షానికి ఆలవాలమై నిలిచి వెలిగే గొప్ప ఆధ్యాత్మిక జ్యోతి ఇదే. శ్రీలక్ష్మికి జోతలు సమర్పించే వేడుక ఇదే. భారతీయ సంస్కృతిని ఇన్నేళ్ల నుంచి వెలిగిస్తున్న సంప్రదాయ జ్యోతులు దీపావళి నాడు అఖండంగా వెలుగుతాయి. అబాలగోపాలం ఆనందతాండవం చేస్తారు. అమ్మ కరుణకు కైజోతలు అర్పిస్తారు. చీకటి ముసిరినప్పుడే వెలుతురు విలువ తెలుస్తుంది. అజ్ఞాన ఆంధకారం ఆవహించినప్పుడే జ్ఞానజ్యోతుల అవసరం తెలుస్తుంది. జగతిని జాతిని వెలిగించే వేదికలు, వేడుకలు రెండూ అవసరం.
Also read: కలవరం కలిగిస్తున్న కరోనా వేరియంట్
రెండింటికీ ప్రతిబింబం దీపావళి
ఆ రెండింటికీ ప్రతిబింబం దీపావళి. దివ్వీ దివ్వీ దీపావళి… అంటూ చిన్నపిల్లలు ఆడుకొనే సంస్కృతి నిన్నమొన్నటి వరకూ పల్లెల్లో ఉండేది. సాయంతన వేళ దీపాలు వెలిగించి పితృదేవతలకు దండం పెట్టుకుంటే అనేక అంశాలకు దారి దొరుకుతుంది. అమ్మ లక్ష్మి ఆశీస్సులు కూడా పుష్కలంగా దొరుకుతాయి. దేవతలు, పితృదేవతలు ఇద్దరినీ స్మరిస్తూ సాగించే ఆధ్యాత్మిక ప్రయాణం రెట్టింపు ఫలితాలను ఇస్తుందని పెద్దల మాట. దీపావళి ఈనాటిది కాదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా ఈ పర్వాన్ని పవిత్రంగా జరుపుకున్నారు. నాటి ప్రజలు కూడా అంతకు మించిన అనందంతో సంబరాలు జరుపుకున్నారు. నరకాసురుడిని, రావణుడిని చంపి అధర్మాన్ని పాతిపెట్టి, అన్యాయాన్ని పాతరేసినందుకు లోకమంతా నాడు దీపావళి జరుపుకుంది. ఇప్పటికీ తలుచుకుంటోంది. పాపం కొంతకాలం రెపరెపలాడినా తుది విజయం ధర్మందేనని ఆ కథలుగాథలు చెబుతున్నాయి.
Also read: వీరవిధేయుడు విజేత కాగలరా?
వెలిగేదీ, వెలిగించేదీ ధర్మమే
ఎప్పటికైనా వెలిగేది, వెలిగించేది ధర్మమేనని దాని సారాంశం. దీపావళి నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. కొత్తబట్టలు, పిండి వంటలు, వెలుగుదివ్వెలు,పూజలు, పునస్కారాలు, కీర్తనలు, సంకీర్తనలు ఎలాగూ ఉంటాయి. దీపాలంకరణ, లక్ష్మీపూజ ప్రధానంగా జరుపుకుంటాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. అన్ని చీకట్లను పోగొట్టే శక్తికి ప్రతిరూపం. దీపం ఎన్నింటినో అందిస్తుంది. జీవితాలను వెలిగిస్తుంది. అందుకే దీపాలను వెలిగించి పాపాలను తొలగించుకోమన్నారు. దీప దర్శనం, దీపారాధనం పుణ్యప్రదం. పంచభూతాలలో అగ్ని ప్రధానమైంది. సమస్త జీవకోటికి అవసరమయ్యే వెలుగు, వెలుతురు, ఆహారం, ఆరోగ్యం అన్నీ అగ్ని నుంచే అందుతాయి. దీపాల వెలుగులో మూడు రంగులు దాగి ఉంటాయి. నీలం, పసుపు, తెలుపు. సత్త్వ, రజ, తమో గుణాలకు ప్రతిబింబంగా, లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి ప్రతిరూపంగానూ ఈ మూడింటిని చూస్తారు. బాణసంచాను కాల్చడం వెనకాల కూడా శాస్త్రీయత దాగివుంది. ఆ వెలుగులు,ఆ శబ్ద తరంగాలు తేమ వల్ల పుట్టుకువచ్చిన క్రిమికీటకాలను నాశనం చేస్తాయి.
Also read: శేషేంద్ర కవీంద్రుడు
ఆనందంలో అప్రమత్తం
అయితే, కాలక్రమంలో ఇవి కాలుష్యాన్ని పెంచేశాయి. ఈ నేపథ్యంలో హరిత దీపావళి వైపు అడుగులు పడుతున్నాయి. హరిత టపాసులు ( గ్రీన్ కాకర్స్) వల్ల వాయు, ధ్వని కాలుష్యం తక్కువ ఉంటుందని, ఆరోగ్య సమస్యల్ని తగ్గించవచ్చని అంటున్నారు. వీటిపై నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) ముద్ర ఉంటుందని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకుందాం. పేదరికం నుంచి దేశం పూర్తిగా విముక్తి చెందిన రోజే నిజమైన పండుగ రోజు.ఆ దిశగా ఆశాదీపాలు వెలిగించుకుందాం.
Also read: భారత్ కు ఐఎంఎఫ్ తీపి కబురు