Monday, January 27, 2025

నాగచైతన్య, సమంతల విడాకులు సరే, అసలు పెళ్ళి నమోదు చేసుకున్నారా?

ఎవరు చరిత్రహీనులు-7

సమంత – నాగచైతన్య

ప్రేమకు ప్రతిరూపాలు

ఎక్కడ చుసినా ఈ రెండు పేర్లు ప్రముఖంగా వినిపించాయి, వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు అందమైన జంట, క్యూట్ కపుల్, ప్రేమగల జంట, ప్రేమకు చిరునామా వీరే అని చాలా గొప్పగా పొగడటం, కీర్తించటం, వాహ్ వావ్ .. ఓహ్ ఒకటా రెండా చాలా పేర్లు పెట్టి, పెట్టుకొని పిలుచుకున్నారు. ఈ ఇద్దరు విడిపోతున్నారు, విడిపోయారు అని చాలా ప్రచార మాధ్యమాలలో, అందులో అంతర్జాలంలో ఇంకా ఊహకందని ప్రచారం జరిగింది. 02-10-2021 నాడు ఈ ఇద్దరు అంతర్జాలం (ఇంస్టాగ్రామ్) ను వేదికచేసుకొని భార్యాభర్తలుగా ఈ రోజు నుండి విడిపోతున్నట్లు వారి అభిమానులకు, ప్రపంచానికి చెప్పుకున్నారు, చెప్పారు. ఈ ఇద్దరి కథ సుఖాంతం అందాము, అనుకుందాము అనుకుంటే మళ్ళీ,  రోజు ఒక శీర్షికతో  ఈ ఇద్దరి గురించి  మాధ్యమాలలో అందులో అంతర్జాలంలో వస్తున్నాయి. వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ? ప్రచార మాధ్యమాలకు వేరే ఇక ఏ వార్తలూ దొరకటం లేదా? పోనీ, సినిమా ఫీల్డ్ కు చెందినవారి గురించిన వార్తలే వార్తలుగా రాయాలి అనుకుంటే, రాసే వారికి  చాలా వార్తలు దొరుకుతాయి. కానీ, అది కాదు. పనికట్టుకొని ఈ ఇద్దరికి చెందిన వార్తలను మాత్రమే రాస్తున్నారు? ఇంత పెద్ద శీర్షికలతో రాస్తున్నారు, రాసుకుంటున్నారు. ఎందుకు ?

వరుడూ, వధువూ వేర్వేరు మతాలవారైతే….

అక్కినేని నాగచైతన్య హిందువు, సమంత రుతుప్రభు క్రిస్టియన్. 2010 లో వచ్చిన “ఏ మాయ చేసావే” అనే తెలుగు సినిమాలో మొదటి సారిగా హీరోయిన్ గా సమంత రుతుప్రభు నటించారు. నాగచైతన్యకు ఈ సినిమా తెలుగులో రెండవది. ఈ సినిమా నుండి ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చివరికి 7 అక్టోబర్ 2016 న రెండుకుటుంబాల పెద్దల సమక్షంలో భార్య భర్తలుగా హిందూ సాంప్రదాయంగాను, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకొన్నారు. అయితే ఇది ఒక మతాంతర వివాహంగాను, ప్రత్యేక వివాహాల చట్టం కింద ఈ వివాహం గుర్తింపు పొందుతుంది.  

వేర్వేరు మతాలకు చెందిన ఏ ఇద్దరు పెళ్లి చేసుకున్నా అది ప్రత్యేక వివాహాల చట్టంకింద రిజిస్టర్ చేసుకోనంత వరకు ఆ పెళ్లి పెళ్లిగా పరిగణన పొందదు. ఒకే మతానికి చెందిన ఏ ఇద్దరైనా వారి సాంప్రదాయం ప్రకారం కులాంతర వివాహం జరిగితే ఆ మతసంప్రదాయం ప్రకారం ఆ పెళ్లిని పరిగణిస్తారు. ఉదాహరణకు ఇద్దరు హిందువులు గాని, ఇద్దరు ముస్లీమ్ లు గాని, ఇద్దరు క్రిస్టియన్ లు గాని లేక ఏ ఇతర మతస్థులుగాని బౌద్ధ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించుకున్నట్లైతే ప్రత్యేకంగా ఆ పెళ్లిని ప్రత్యేక వివాహాల చట్టం కింద నమోదు (రిజిస్టర్) చేసుకోవాలి. అప్పుడే బౌద్ధ వివాహంగా గుర్తిస్తారు. దానికి చట్టబద్ధత వస్తుంది. వివాహం రిజిస్టర్ కాని పక్షంలో ఆ వివాహాలను ఆయా మతసాంప్రదాయం ప్రకారమే చూస్తారు. ఆయా మతసాంప్రదాయం ప్రకారమే చట్టబద్ధత కల్పిస్తారు.  బౌద్ధ వివాహంగా గుర్తించరు. చెప్పుకొనేటందుకు మాత్రమే పనికివస్తుంది. ఇక్కడ, ఒకే మతానికి చెందిన ఇద్దరు వేరే మత సాంప్రదాయం ప్రకారం అనగా, ఉదాహరణకు బౌద్ధ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొన్నట్లయితే ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం ఆ పెళ్లి నమోదు కావాలి. అప్పుడే బౌద్ధ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది అని గుర్తిస్తారు. అప్పుడే బౌద్ధ వివాహానికి చట్టబద్ధత వస్తుంది.

పెళ్లి చేసుకొనే వారిద్దరూ వేరు వేరు మతస్థులు అయినప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరైనా మతం మార్చుకొని ఆ మతాచారం ప్రకారం పెళ్లి జరిపించుకుంటే ఆ మతాచారం ప్రకారం చట్టబద్ధత వస్తుంది. ఇద్దరి మతాలను అలానే ఉంచుకొని పెళ్లి జరిపించుకుంటే అనగా ఒకసారి హిందూమత ఆచారంగానూ, ఇస్లాంమత ఆచారంగానూ లేదా క్రిస్టియన్ మత ఆచారం గాను లేదా ఇంకా ఎదైనా అనగా జైన్, బౌద్ధం, జురాస్తియస్ వగైరా మతాల ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకున్నా చెప్పుకొనేటందుకు, చూపించుకొనేటందుకు మాత్రమే ఉపయోగపడతాయి. సమాజంలో వారి “స్థితి”ని ప్రదర్శించుకొనేటందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకానీ, ఆ పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉండదు. తప్పనిసరిగా ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం ఆ పెళ్లిళ్లు రిజిస్టర్ చేయబడాలి. అప్పుడే ఆ పెళ్లిళ్లకు చట్టబద్ధత, అర్ధం ఉంటుంది.

సమంత, నాగచైతన్య పెళ్ళి గురించి ఆలోచిద్దాం….

ఇప్పుడు సమంత – నాగచైతన్యల పెళ్లి – ప్రేమ పెళ్లి గురించి ఒక్కసారి ఆలోచిద్దాము. వీరిద్దరి పెళ్లి ఘనంగా ఒక్కసారి హిందూ మతాచారం ప్రకారం జరిగింది. అంటే సమంత హిందువుగా మతం మార్చుకోబడి ఉండాలి అందుకే హిందూ మతాచారం ప్రకారం పెళ్లి జరిగింది. అప్పుడే ఆ పెళ్లికి హిందూ మతాచారం ప్రకారం చట్టబద్ధత వస్తుంది. మరొకసారి వీరిద్దరూ క్రిస్టియన్ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకొన్నారు. అంటే నాగచైతన్య క్రిస్టియన్ గా మారిన తరువాతనే క్రిస్టియన్ మతాచారం ప్రకారం పెళ్లి జరిగింది అని భావించుకోవాలి. సో ఈ పెళ్లి క్రిస్టియన్ మతాచారం ప్రకారం జరిగింది కాబట్టి క్రిస్టియన్ మతాచారం ప్రకారం చట్టబద్ధత ఆ పెళ్ళికి ఉంటుంది. వీరిద్దరూ ఒకసారి హిందూ మతాచారం ప్రకారం, మరొకసారి క్రిస్టియన్ మతాచారం ప్రకారం పెళ్లిళ్లు జరిపించుకున్నారు. ఏ మతాచారం పెళ్లి చేసుకున్నప్పటికిని వీరి పెళ్లి ప్రత్యేక వివాహాల చట్టం కింద రిజిస్టర్ కాకపోతే ఈ పెళ్ళికి చట్టబద్ధత ఉండదు. ఇద్దరు భార్య భర్తలుగా చట్టం అంగీకరించదు.

వీరిద్దరూ ఒకసారి హిందూ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోవటం, మరొకసారి క్రైస్తవ మతాచారం ప్రకారం పెళ్లిచేసుకోవటం దేనికి సంకేతం? పెళ్లి అనేది ఒక పవిత్రమైన “కుటుంబ వ్యవస్థకు” సంకేతంగా భారతదేశంలో జీవిస్తున్న భారతీయులు  ఒక “చిహ్నం”గా భావిస్తారు. మరి   ఆ పెళ్లిని వీరిద్దరూ అపవిత్రం చేసినట్లే కదా? ఏ మతాచారాన్ని అవలంబించకుండా, స్థిరమైన ఒక “పద్ధతి”ని పాటించకుండా ఒకసారి హిందూ మతాచారం ప్రకారం, మరొకసారి క్రిస్టియన్ మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోవటం “వివాహం – పెళ్లి” అనే ఒక సాంప్రదాయాన్ని అవమానించటంగా ఎందుకు చూడకూడదు? సరే,  ప్రజలకు, వారి వీరాభిమానులకు చూపించుకొనేటందుకు వారికి ఇష్టమొచ్చినట్లు, వారి బుద్ధికి నచ్చినట్లు రెండు రకాలుగా కాకపోతే పది మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకోని, ఆ పెళ్లి ప్రత్యేక వివాహాల చట్టంకింద రిజిస్టర్ చేయకపోతే ఆ పెళ్లి చెల్లదు, చట్టబద్ధత ఉండదు. మరి వీరు, వీరి పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారా?

సినిమా పెళ్ళి కాదు కదా!

రెండురకాలు, పదిరకాల మతాచారాల ప్రకారం పెళ్లిళ్లు చేసుకొనే వెసులుబాటు ఒక్క సినిమాలలోనే చూపించవచ్చు, చూడవచ్చు. ఆ సినిమా గురించి ప్రచారం చేసుకోవచ్చు.  దీనికి మాత్రమే అలాంటి పెళ్లి ఉపయోగపడుతుంది. చట్టం దృష్టిలో ఇది నేరం. ఇటువంటి “పెళ్లి” చేసుకున్న ఇద్దరినీ “నేరస్థులు” గానే చట్టం పరిగణిస్తుంది. వీరిద్దరి పెళ్ళికి చట్టబద్ధత కలిపించబడినట్టు పెళ్లి చేసుకున్నతరువాత వీరిద్దరూ ప్రకటించలేదు, ప్రచార మాధ్యమాలు 2017 నుండి ప్రకటించలేదు. వీరిద్దరూ హిందూ మతాచారం ప్రకారం ఒకసారి పెళ్లి చేసుకున్నట్టూ,  క్రైస్తవ మతాచారం ప్రకారం మరొకసారి పెళ్లి చేసుకున్నట్లూ ప్రచార మాధ్యమాలలో వచ్చింది కానీ, వీరిద్దరికీ చట్టబద్ధమైన, చట్టబద్ధతిలో పెళ్లి జరిగినట్టు ఎక్కడా రాయలేదు, ఎక్కడా చూపలేదు. వీరి పెళ్లి రిజిస్టర్ అయ్యినట్లు ఎక్కడా .. ఏ మాధ్యమాలనూ వేదిక చేసుకొని వీరిద్దరూ చెప్పినట్లు దృష్టికి రాలేదు. ఏ విలేకరి రాసినట్టు కూడా దృష్టికి రాలేదు.

02-10-2021 నాడు ఇంస్టాగ్రామ్ వేదికగా మేమిద్దరం “భార్య – భర్త”లుగా ఈ రోజునుండి విడిపోతున్నాము, భార్యా భర్తలుగా కలిసి ఉండటం లేదు అని ఎవరికి వారుగా ప్రకటించుకున్నారు. సమాజంలో ఇద్దరు వ్యక్తులు అనగా ఒక మగ – ఆడ భార్య – భర్తలుగా కలిసి జీవించేటందుకు “పెళ్లి” అనేది  ఒక వంతెనగా ఉపయోగబడుతోంది. ఈ పెళ్లి అనేది ఎలా ఉండాలి అని మతాచారాలు, చట్టం రెండూ మార్గం చూపిస్తున్నాయి. పెళ్లి అనే వంతెనకు మతాచారాలు మార్గం చూపిస్తే ఈ మార్గానికి చట్టం అనేది “కాపలా” (గార్డ్ / షీల్డ్) దారుగా ఉంటుంది. ఈ కాపలాదారుడికి “రాజ్యాంగం” వెన్నెముక. ఈ వెన్నెముకను ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు విరచి వాడుకుంటాము అంటే కుదురుతుందా? ఇప్పుడు జరుగుతోంది అదే.

అంతా ప్రచార మాధ్యమాల ద్వారానే

సమంత – నాగచైతన్య లు ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము అని ప్రచార మాధ్యమాల ద్వారా వారే వారి అభిమానులకు, ప్రజలకు చెప్పుకున్నారు. మళ్ళీ వారే రెండు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నాము అని ప్రచారం చేసుకున్నారు. పెళ్లి తంతును కూడా ప్రచార మాధ్యమాల ద్వారా చూపించారు. అభిమానులు చూశారు, ప్రజలూ చూశారు. కొన్ని రోజులవరకూ .. ఓహో — ఆహా .. అని వారి పెళ్లిని చూసిన  అభిమానులు – వీరాభిమానులు అన్నారు. ఇది గతం.

ఇప్పుడు అయ్యో ఏడు ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వీరిద్దరూ నాలుగు ఏళ్లకే విడిపోతున్నారే అని అదే అభిమానులూ, ప్రజలూ బాధపడుతున్నారు. వీరి విడాకులపైన ఊహాగానాలు ఒక స్థాయిలో సాగలేదు. వీరిద్దరి విడాకులపై సాగిన ఊహాగానాలను  ప్రచార మాధ్యమాల విలేకర్లు “పీక్ స్థాయి”కి తీసుకెళ్లారు. ఆ స్థాయి ఎంత అంటే “మీరిద్దరు” విడిపోతే మేం ఆత్మహత్యలు  చేసుకుంటామని అభిమానులు అంటారా, అనబోతున్నారా అనే ఒక పిచ్చి స్థాయికి తీసుకవెళ్లారు. 02-10-2021 నాడు ఆ ఇద్దరి ప్రకటన ఒకవేళ రాకుండా ఇంకా కొన్ని రోజులు అలానే లాగినట్లయితే… అభిమానుల మానసిక పరిస్థితి చెయ్యి జారిపోయేది అనేది వాస్తవం.

కొంత దూరం నడిచిన తర్వాత విడిపోవడం సహజం

వీరిద్దరి ప్రకటన వచ్చాక కూడా ఇంకా ప్రచార మాధ్యమాలు విడచిపెట్టట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడికి పోతున్నారు .. విడాకుల తరువాత నాగచైతన్య ఓ ఇంటివాడు అవుతున్నాడు, విడాకుల తర్వాత కూడా సమంత నంబర్-1, ఇలాంటి శీర్షికలతో నిత్యం వీరిద్ధరి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రచార మాధ్యమాల విలేకర్లు ఆ ఇద్దరినీ, వీరి అభిమానులనూ – వీరాభిమానులనూ, ప్రజలనూ ఇప్పట్లో వదిలిపెట్టేటట్లు కనిపించటం లేదు. ముందు వారి పెళ్ళికి చట్టబద్ధత ఉన్నదా? లేదా? అని తేల్చండి. ఆ తరువాత విడాకులు తీసుకోవాలా? వద్దా? అనే ప్రశ్న. అసలు వీరిద్దరి గురించి ఎందుకు ప్రచార మాధ్యమాలు ప్రముఖంగా తీసుకుంటున్నాయి? వీరిద్దరూ విడిపోతే సమాజానికి నష్టమా? ప్రేమికులకు నష్టమా? ప్రేమ వివాహాలకు నష్టమా?

కొంత దూరం ప్రయాణించాక ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాలు వస్తాయి. విడిపోతారు. భవిష్యత్తులో కలువవచ్చు, కలువకపోవచ్చు. విడిపోవడానికి ఒకరకమైన ఒడంబడిక ఉంటుంది. ఇద్దరు వ్యాపారస్తుల మధ్యన వ్యాపారపరమైన విభేదాలు వస్తాయి. లెక్కలు చూసుకుంటారు. విడిపోతారు. భవిష్యత్తులో మళ్ళీ కలిసి వ్యాపారం చేస్తారా, చేయరా అనేది అప్రస్తుతం ..  విడిపోవడానికి  ఒకరకమైన ఒడంబడిక ఉంటుంది.

ఇద్దరు ప్రేమికులు కొంత దూరం నడుస్తారు .. ఏవో కారణాలతో విడిపోవడానికి సిద్ధం అవుతారు. ఇక్కడ మానసికంగా ధృఢంగా ఉండాలి. పై రెండు సందర్భాలలో కూడా మానసికంగా దృఢంగా ఉండవలిసిందే .. కానీ, ఇక్కడ “నా” అని వచ్చి చేరుతుంది. పై రెండువాటిల్లో “నా” అనేది ప్రభావం మనసులపై చూపదు. ప్రేమికుల మధ్య ఉండే “బంధం” మనసులపై చూపుతుంది. అయినప్పటికీ విడిపోతారు. ఎవరికి వారుగా జీవితాలను మొదలు పెడతారు. గతించిన జ్ఞాపకం, ఒక తియ్యటి జ్ఞాపకంగానో లేదా చేదు జ్ఞాపకంగానో ఉండిపోతుంది. మొదటి రెండు బంధాలకు, ప్రేమికుల మధ్యన ఉండే బంధానికి మధ్యన చిన్న తేడా ఉంది.

ప్రేమికులు పెళ్లితో ఒకటైతే “విజయవంతమైన ప్రేమ”గా నిలబడుతుంది. పెళ్లి జీవితాంతం ప్రేమతోనే నిలబడిపోతే అదే ఆజన్మాంతం ఉంటే ప్రేమను మధించి ఒడిసి పట్టుకున్నవాళ్లుగా చరిత్రలో నిలబడిపోతారు. వీరికి కులం, మతం, చట్టం, రాజ్యాంగం అవసరం ఉండదు. ఇవి వారి బ్రతుకు తెరువుకు ఉపయోగపడే సాధనాలుగా, ఆలంబనగా అవుతాయి.

స్త్రీలను సమాజం ఏ దృష్టితో చూస్తోంది?

ప్రేమించి పెళ్లిచేసుకున్న వారు ఏవో కలహాలతో, అపనమ్మకాలతో, అపార్ధాలతో “భార్య – భర్తల ” బంధం నుండి విడిపోయే జంటలకు .. కులం, మతం, చట్టం, రాజ్యాంగం అవసరం కలుగును. ఇక్కడనే, ఈ పాయింట్ దగ్గరనే స్త్రీల విషయంలో ఎలా చూస్తున్నారు, ఏ దృష్టితో స్త్రీలను సమాజం చూస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. ఒక్క ప్రేమ పెళ్లిళ్ల విషయంలోనే కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల ల్లో కూడా “విడాకులు” తీసుకొనే ఆడవాళ్ళ పట్ల ఎలా ఉంది సమాజం అని అధ్యయనం చేస్తే ..

మహిళా సెలెబ్రెటీల విషయంలో ఒకరకమైన స్పందన, ఉన్నత వర్గాల స్త్రీల విషయంలో ఒకరకమైన స్పందన, సాధారణ మహిళల విషయంలో ఒక రకమైన స్పందన ఉంటుంది అని చెప్పలేము, కానీ హెచ్చు – తగ్గులు ఉంటాయి (%). కుల – మతాచారాల ప్రకారం స్త్రీలను కొలిచే “కొలమానాలు” కూడా ఆయా స్థాయిల స్త్రీల విషయంలో పనిచేస్తున్నాయి.  అందుకే సమంత ప్రకటన చేసిన మరుక్షణం  విడాకులకు కారణాలివే అంటూ రకరకాల ప్రచారాలు, కథనాలు ప్రచార మాధ్యమాలలో మొదలైయ్యాయి. ఆ ప్రచారాలు ఎంత తీవ్రస్థాయికి వెళ్లాయి అంటే సమంత ‘ఫలానా వ్యక్తితో సన్నిహితంగా ఉండటంవల్ల,  ఆ సినిమాల్లో శ్రుతిమించి నటించడం, పిల్లలను వద్దన్నది’ ఇలా చాలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాధ్యమాల విలేకర్లు కథనాలు రాశారు (బహుశా రాయించారు అంటే బావుంటుందేమో).

విడాకులు ఇద్దరికీ సంబంధించిన విషయం

విడాకులు తీసుకోవడం అనేది ఇద్దరికి చెందిన విషయం. స్త్రీకి ఎంత ముఖ్యమో పురుషుడికి కూడా అంతే ముఖ్యం. అయితే విడాకులు తీసుకొనే వారి విషయంలో అనగా మహిళలపట్ల సమాజం కినుక వహిస్తుంది. పురుషుడి విషయంలో “స్పెస్” ఇస్తుంది. దీనికి పితృస్వామ్య భావజాలంతో సమాజం ఉంది అనుకోవటం, ఎవరికి వారుగా నిశ్శబ్దంగా ఉండిపోవటం జరుగుతుంది. మన చట్టాలు ఆ విధంగా లేవు. ఇద్దరిని సమానంగా చూడాలి అని చెపుతున్నాయి. సమంతపై ఎంత పెద్ద దాడి జరిగింది అంటే,  ఆమె చివరికి ఎంతగా ఫీల్ అయ్యింది అనేదానికి … విడాకులు అనేది ఆమెకు మాత్రమే చెందినట్లు గా ఫీల్ అయ్యి “… .. విడాకులు అనేది ఎంతో బాధతో కూడుకున్నది, ఒంటరిగా  నన్ను వదిలేయండి, వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం అమానుషం, దారుణం. మీరనుకునే విధంగా నేను  ఎన్నడూ చేయను, మీరు  ఎంత బాధపెట్టినా నేను చెదిరిపోను” అని ట్వీట్‌ చేశారు. ఇది చాలా దారుణమైన విషయం.

ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే ప్రేమ వివాహాలు చేసుకున్నవారు గాని, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు గాని కలహాలతో కలిసి ఉండటం కంటే విడిపోయి ఎవరికి వారు వారి వారి గౌరవప్రదమైన జీవితాలను గడపటం నేరం కాదు, తప్పు చేస్తున్నట్లు కాదు. మరి  విడాకులు తీసుకున్న వారిలో  స్త్రీలనే ఎందుకు “టార్గెట్” చేస్తున్నట్లు .. స్త్రీలు సులభంగా దొరుకుతారు అనే భావన సమాజంలో ఉంది, వారిదగ్గరకు సులభంగా వెళ్ళేటందుకు ప్రవేశం వేసి ఉంది కాబట్టి .. కుటుంబ వ్యవస్థ మొత్తం “స్త్రీ ” పైననే పెట్టి మోపిస్తున్నారు, స్త్రీలు కూడా మగవాడి పని ఇది కాదు అని భావించటం కాయిన్ కు ఒక వైపు అయితే, మరో వైపు ఆచారాలను, సంప్రదాయాలను కూడా స్త్రీనే మోస్తుంది. చట్టాలు అనే వాటిని  కూడా “వ్యక్తిగత చట్టాల”ను కూడా స్త్రీనే మోస్తుంది ఈ మూడింటిని స్త్రీలు తలపై – భుజాలపై పెట్టుకొని నడుస్తున్నారు. స్త్రీలు ఇవి మోయటమే వారి ” విధాలుగానూ & బాధ్యత”గాను  అనుకుంటున్నారు. అందుకు టార్గెట్ చేయబడుతున్నారు.

నాగచైతన్య వెనుక రెండు బలమైన కుటుంబాలు

నాగచైతన్య సినిమా ఫీల్డ్ ను ఏలుతున్న రెండు బలమైన కుటుంబాల చేతుల మధ్యన సురక్షితంగా రక్షించబడుతున్న యాక్షన్ లెస్ సినిమా హీరో. సమంత ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చిన కేరలైట్. తన నటనతో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగిన హీరోయిన్. ఈ నాగరిక సమాజంలో సెలెబ్రెటీలు మాత్రమే కాదు. సాధారణ ప్రజలు కూడా ఈ విడాకుల సమస్య ఎదుర్కొంటున్నారు. కానీ ఒక “బంధం” గురించి నిర్ణయం తీసుకొనే అధికారం పూర్తిగా ఆ బంధంలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. అయితే విడాకులు తీసుకున్న మగవాళ్ళు మెజారిటీగా స్వేచ్ఛా జీవులుగా పిలువబడుతున్నారు, మరో పెళ్ళికి వీలైనంత త్వరగా సిద్ధమవుతున్నారు. మహిళలు సిద్ధం కావటానికి సమయం పడుతుంది. సమాజం యొక్క ధ్వంధ ప్రవర్తన, ధ్వంధ నీతి   స్త్రీలపై ప్రభావితం చూపటం ఒక కారణం అయితే వివాహాబంధాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా మహిళల పైననే పెట్టడం మరో కారణం.

సమంత – నాగచైతన్యల  వివాహం జరిగిన తీరు  చట్టబద్ధంగానే ఉన్నదా ? చట్టబద్ధంగానే ఉన్నట్లా?

వీరి గురించి ముఖ్యంగా సమంత గురించి ప్రచార మాధ్యమాలలో ముఖ్యంగా అంతర్జాలంలో విడాకులకు ముందు – విడాకుల తరువాత వచ్చిన కథనాల సారాంశాన్ని, సారాంశాలను గమనిస్తే లేక ఎక్కడికి అక్కడ శస్త్ర చికిత్సచేసిచూస్తే … ఒక ప్రణాళిక బద్ధంగా ప్రచారం చేసినట్లుగా ఉన్నది. పెయిడ్ జర్నలిస్టులతో రాయించినట్లు ఉన్నది. సమంతను “నిశ్శబ్దంగా” వదిలించుకొనేటందుకు మాత్రమే ఇది జరిగినట్లు పాఠకులకు అర్ధమవుతుంది. ఇంకా, నేటికీ సోషల్ మీడియాలో రెచ్చిపోయి రాస్తున్న విధానం.. విడాకులు తీసుకున్న తరువాత సమంత  దిగులుపడుతూ, ఏడుస్తూ, మౌనంగా ఇంటిలోనే ఉండాలి అనే నియమం పెట్టేంతగా …. ఉంది. నాగచైతన్య ఊసే ఎక్కడా లేదు .

ఈ పోకడలు కుటుంబ వ్యవస్థపై,  కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని ప్రయత్నించే వారికి తీవ్ర హెచ్చరికనే అని చెప్పాలి. అణచివేత ధోరణిలో మానసికంగా స్త్రీలను అణచాలి అనుకొని “పెయిడ్ జర్నలిజాన్ని ” ప్రోత్సహిస్తే అది వికటించక మానదు.  దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు బాధ్యత తీసుకుంటారు?

య వింధ్యాల, అడ్వకేట్  & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ స్టేట్ # మలక్పేట్ ఎక్స్ రోడ్, హైదరాబాద్, @  9440430263

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles