దిల్లీ: పర్యావరణ కార్యకర్త దిశారవి కి మంగళవారంనాడు బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ పటియాలా హౌస్ కోర్టులో అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్రరాణా అసమ్మతి వెల్లడించే హక్కు దేశ పౌరులకు ఉన్నదని ఉద్ఘాటిస్తూ ఇలా అన్నారు:
‘‘ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రభుత్వ మనస్సాక్షిని, ధర్మాన్ని పరిరక్షించేది పౌరులే… కేవలం తాము చేసే విధానాలను, చట్టాలను వ్యతిరేకించారన్న కారణంతో ప్రభుత్వాలు పౌరులను కటకటాల్లోకి తోయడం సమ్మతం కాదు…”
“ప్రభుత్వాల అహం, అభిమానం గాయపడిందన్న నెపంతో దేశద్రోహం కేసును నమోదుచేయరాదు… అసమ్మతి వ్యక్తీకరణ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు… 19వ అధికరణం కింద స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించే ఈ హక్కు… అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు, సంస్థలు వాటిని వినడాన్ని కూడా కల్పిస్తుంది…
‘‘భేదాభిప్రాయాలు, అసమ్మతి, విభేదం, విరోధం ఇవన్నీ ప్రభుత్వ విధానాలపై నిష్పాక్షిక దృక్పథం కలిగించే ఉపకరణాలు… చైతన్యవంతంగా, నిర్భీతిగా మనోభావాలు వెల్లడించే పౌరసమాజం ఉండటం ఓ సజీవమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చిహ్నం…
‘‘మనది 5000 సంవత్సరాల నాగరికత. సదాశయాలు, సమున్నతమైన ఆలోచనలు అన్ని దిశల నుంచీ రావాలని రుగ్వేదం చెబుతోంది… ప్రాచీన నాగరికత విభిన్న ఆలోచనలను, అభిప్రాయభేదాలను స్వాగతించింది… గౌరవించింది… మన సాంస్కృతిక వారసత్వం విభిన్నతకు ప్రతిబింబం.’’
Also Read: నేనూ… నా స్వేచ్ఛ… నా స్వాతంత్రం…