• చంద్రబాబు జోక్యం
• అసంతృప్త నేతలతో అచ్చెన్నాయుడు చర్చలు
• శాంతించిన బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా
విజయవాడలో టీడీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జోక్యం చేసుకుని నేతలకు సర్ధిచెప్పారు. ఆయన ఆదేశాల మేరకు బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జనార్దన్, వర్ల రామయ్యలు సుదీర్గంగా చర్చించారు. అనంతరం శాంతించిన అసంతృప్త నేతలు విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేశినేని శ్వేతకు మద్దతిస్తూ ఆమె వెంట ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం.
అసంతృప్త నేతల భేటి:
అంతకుముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నేత బోండా ఉమా నివాసంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల మీరా భేటీ అయ్యారు. పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేయర్ ఎంపిక విషయంలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీలో కోవర్టులను నియమించుకున్న కేశినేని నాని తప్పుడు నివేదికలతో చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నగరంలో చంద్రబాబు పర్యటన రూట్ మ్యాప్ మార్చడంపైనా బోండా ఉమ, బుద్దా వెంకన్న నాగుల్ మీరాలు గుర్రుగా ఉన్నారు.
Also Read: అసత్య ప్రచారానికి అడ్డుకట్ట
అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నేతలు :
గత కొంతకాలంగా విజయవాడ టీడీపీలో కేశినేని నానికి ఇతర నేతలకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇటీవలే అధినేత వారించినా వ్యవహారం పైకి సద్దుమణిగినట్లే కనిపించినా లోపల మాత్రం నివురుగప్పిన నిప్పులా తయారవడంతో విభేదాలతో నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె శ్వేత ఎంపికపై నిర్ణయం ఏకపక్షంగా జరిగిందని నాని ప్రత్యర్థివర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాబు రాయబారంతో శాంతించిన నేతలు:
నగరపాలక ఎన్నికల సమయంలో విజయవాడలో తెలుగు తమ్ముళ్లు విభేదాలతో రోడ్డున పడ్డారు. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టెలికాన్ఫరెన్స్ లో నేతలతో మాట్లాడిన చంద్రబాబు అసంతృప్త నేతలను బుజ్జగించారు. ఎన్నికల్లో ఐకమత్యంగా పోరాడి పార్టీ విజయానికి కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా నేతల మద్య విభేదాలతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఎట్టకేలకు విభేదాలు సద్దుమణగడంతో పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకుని ప్రచారంలో నిమగ్నమయ్యారు..
Also Read: కైకలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
అసంతృప్త నేతలతో శ్వేత భేటీ :
నేతల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగిన గంటల వ్యవధిలోనే టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత బోండా ఉమ ఇంటికి వెళ్లారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో సహకరించాల్సిందిగా అసంతృప్త నేతలైన బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను కోరారు. దీంతో మనసుమార్చుకుని శ్వేతతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయానికి కృషి చేస్తామని నేతలు స్పష్టం చేశారు.