Friday, December 27, 2024

బస్తీమే సవాల్ అంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

(సాకేతపురం ఆరుష్ , నల్లగొండ)

ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇద్దరూ పార్టీలు మారి ఒకే గూటికి చేరినా వారి మైండ్ సెట్ మారలేదు. నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ తొడలు కొడుతున్నారు. ఇప్పుడా ఇద్దరి నేతల వైఖరి అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు ఆ నేతల ఆధిపత్య పోరులో కింది స్థాయి నాయకులు తీవ్రంగా నలిగిపోతున్నారు. మరింతకీ ఎవరా నాయకులు ? వారిద్దరి మధ్య ఏంటా పంచాయితీ ?

నల్గొండ జిల్లాలో అధికార పార్టీలో నేతల వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ప్రధానంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ల మధ్య విభేదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. నిన్నా మొన్నటి దాకా ఇద్దరి మధ్య విభేదాలు అంతర్గతంగానే ఉన్నా అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బహిర్గత మౌతున్నాయి. వీరిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడమే గొడవకు ప్రధాన కారణం. ఇక వీరిద్దరి మధ్య పంచాయితీ కాస్తా గులాబీ బాస్ దగ్గరికి కూడా వెళ్ళినట్టు టాక్.

2018 ఎన్నికల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయం సాధించి తన హవా చాటాడు కంచర్ల. ఇక నకిరేకల్ లో కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య  రెండోసారి విజయం సాధించిన అనంతరం టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇక ఇక్కడే ఇద్దరి మధ్య మొదలైంది అసలు పంచాయితీ. అంతకుముందే వేర్వేరు పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో చేరాక నివురు కప్పిన నిప్పులా ఉన్న వివాదాలు మొదట్లో కాస్త సద్దుమణిగినట్లు అనిపించినా తాజాగా లోకల్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్ట్ ల విషయంలో వివాదం మళ్లీ ముదిరింది.

వాస్తవానికి కంచర్ల భూపాల్ రెడ్డికి నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల, నార్కట్ పల్లి మండలాల్లో కొంత కేడర్ ఉంది. లోకల్ ఎలక్షన్ లో తన వర్గానికి టికెట్ల కోసం చిరుమర్తితో విభేదించింది కంచర్ల వర్గం. ఇక ఈ కలహాలు అంతర్గతంగా ఉన్నా బయటికి అంతగా కనిపించలేదు. బయటకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలూ లేవు. తాజాగా ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో అంటే పచ్చ గడ్డేస్తే మండెంత  స్థాయికి వెళ్లాయి.

చిట్యాల వద్ద కంచర్ల బ్రదర్స్ కు శ్రీకృష్ణ కాటన్ మిల్ ఉంది. లోకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పత్తి కొనుగోళ్లలో టోకెన్ విధానాన్ని తీసుకొచ్చారు. చిరుమర్తి వైఖరి కంచర్ల బ్రదర్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. రైతు ప్రయోజనాల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారంటూ చిరుమర్తి వర్గం వాదన. ఎక్కడా లేని నిబంధనలు తన సొంత మిల్లుపైనే బలవంతంగా   రుద్దే ప్రయత్నం చేస్తున్నారని  చిరుమర్తిపై గుస్సాగా ఉన్నారు కంచర్ల బ్రదర్స్. ఈ నేపధ్యంలో చిరుమర్తి లింగయ్య వేధింపులకు నిరసనగా కంచర్ల బ్రదర్స్ కాటన్ మిల్లు క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించడం పెద్ద రచ్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా కంచర్ల బ్రదర్స్ ఈ విధమైన నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వారి వాదన. రాజకీయ ప్రత్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి చిరుమర్తి లింగయ్య తమను వేధింపులకు గురిచేస్తున్నారని కంచర్ల బ్రదర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కంచర్ల బ్రదర్స్ కు సంబంధించిన మిల్లులో టోకెన్ విధానాన్ని అమలు చేయాలని చిరుమర్తితో పాటు అదే టైంలో కోమటిరెడ్డి కూడా వ్యవసాయ అధికారులతో ఒత్తిడి తేవడం వారి అనుమానాలకు బలాన్నిచ్చాయి. ఇక ఈ గొడవలో మంత్రి జగదీష్ రెడ్డి జోక్యం చేసుకోవడం ఇద్దరు నేతలకు సర్ది చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇద్దరి మధ్య వైరం తో  రైతులను ఇబ్బంది పెట్టొద్దని హడావిడిగా మిల్లు ఓపెన్ చేయించడం ఇటు పార్టీ పెద్దలకు అటు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇది పక్కన పెడితే ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోలేదని తాజా ఘటన తేట తెల్లం చేస్తోంది. ఇదిలావుంటే చిరుమర్తి, కంచర్ల భూపాల్ రెడ్డి ల గొడవ ఇష్యు ఇంతటితో క్లోజ్ అవుతుందా ? లేదా ఆధిపత్య పోరు కంటిన్యూ చేస్తారా ? అన్న చర్చ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles