తెలంగాణ ఫీసీసీ అధ్యక్ష నియమకంపై పార్టీ అధిష్ఠానం తర్జనభర్జనలు పడుతోంది. ఆశావహులు ఎక్కువ కావడంతో 2023 శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గట్టి అభ్యర్థిని ఎంపిక చేయవలసి ఉంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
“ఈ సారి నేనే“
మొధటి నుంచి ఈ పదవిపై ఆశపెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఈ సారి తనకు అవకాశం వస్తుంద
ని గట్టిగా నమ్ముతున్నారు. సన్నిహితుల వద్ద చెబుతున్నారట కూడా.అదే సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యే లు శ్రీధరబాబు, జగ్గారెడ్డి , పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ పదవి పరుగులో ఉన్నారు.మరోవంక సుదీర్ఘంగా పార్టీని అంటి పెట్టుకున్న వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.ఇది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొందరు అంటున్న మాటలని తేలిగ్గానే అర్థమవుతోంది. పీసీసీ పీఠం ఇప్పటికే ఆయనకు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు అధ్యక్ష పదవి పదోన్నతి లాంటిదని అంటున్నారు.అయితే ఆయన అభ్యర్థిత్వాన్నిసీనియర్ నేత వి.హనుమంతరావు తదితరులు తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
పదవి దక్కకపోతే….
రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం దక్కకపోతే ఆయన పార్టీ మారే అవకాశం ఉందని వినిపిస్తోంది.నటి విజయశాంతి పార్టీకి వీడ్కోలు చెప్పి ఈరోజే బీజేపీలో చేరిపోయారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కూడా ఆ పార్టీలోకి వెళ్లవచ్చని వార్తలు వస్తున్నాయి. నాగార్జునసాగర్ నుంచి టీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నోముల నర్శింహయ్య ఇటీవల చనిపోవడం వల్ల ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు నాగార్జున సాగర్ పై దృష్టి పెట్టింది. అక్కడ జానారెడ్డికి గల పరపతి దృష్ట్యా ఆయనను చేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోందని, దీనిపై జానా నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది.