ఖలీల్ జిబ్రాన్
సంచారి తత్త్వాలు
———— —————————————
THE PROPHET AND THE CHILD
—————————————————–
(FROM ‘THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
———— ————–
ఒక రోజు షరియా ప్రవక్త తోటలో ఒక బాలుడిని కలిసాడు. ఆ బాలుడు ప్రవక్త వద్దకు పరిగెత్తుకొని వచ్చి ” శుభోదయం అండీ!” అన్నాడు.
ప్రవక్త కూడా బాలునికి ‘శుభోదయం అండీ !‘ అని “మీరు ఒంటరిగా ఉన్నట్లున్నారు ” అన్నారు.
ఆ బాలుడు నవ్వుతూ ఆనందంగా ఇట్లా అన్నాడు “నా దాదీ నుంచి తప్పించుకుంటానికి ఇంత సమయం పట్టింది. నేను పొదల మాటున ఉన్నానని ఆమె అనుకుంటోంది. నేనిక్కడే ఉండడం మీరు చూస్తున్నారు కదా!” అంటూ ప్రవక్త ముఖం లోకి చూస్తూ “మీరు కూడా ఒంటరిగానే ఉన్నట్లున్నారు. మీ దాదీ ఏమయ్యింది?” అని అడిగాడు.
ప్రవక్త ఇట్లా అన్నాడు “అది వేరు. నేనెక్కువగా ఆమె నుండి తప్పించుకోలేను. నేను ఈ తోట లోకి వచ్చాను కాబట్టి ఆమె నా కోసం పొదల మాటున వెతుకుతూ ఉండవచ్చు!”
కుర్రవాడు ఆనందంతో చప్పట్లు కొడుతూ”మీరూ నాలాగే తప్పిపోయారన్న మాట! తప్పిపోవడం బావుంటుంది కదూ! ఇంతకీ మీరెవరు?” అన్నాడు.
ఆయన ఇలా చెప్పాడు” నన్ను షరియా ప్రవక్త అంటారు. నువ్వెవరివో చెప్పు!” దానికి జవాబుగా ఆ బాలుడు “నేను నేనే! నా దాదీ నన్ను వెతుకు తోంది. నేనెక్కడున్నానో ఆమెకు తెలియదు” అన్నాడు.
అప్పుడు ప్రవక్త ఆకాశం వైపు చూస్తూ ఇలా అన్నాడు.”నేను కూడా కొంత సేపు దాదీ నుండి తప్పించుకున్నాను. కాని ఆమె నన్ను కనిపెడుతుంది.”
అపుడా బాలుడు “నా దాదీ కూడా నన్ను కనిపెడుతుందని తెలుసు.” అన్నాడు.
అదే సమయంలో బాలుని పేరు పిలుస్తూ ఓ స్త్రీ గొంతు వినబడింది. “చూడండి, చెప్పాను కదా ఆమె నన్ను వెతుకుతోందని” అన్నాడు బాలుడు.
ఆ సమయంలోనే “ఎక్కడున్నావు , షరియా?” అంటూ మరో గొంతు వినబడింది.
“చూడు బాబూ వారు కూడా నన్ను కనుగొన్నారు” అని ప్రవక్త ఆ బాలునితో అన్నారు.
ముఖం పైకెత్తి షరియా “ఇదిగో! ఇక్కడే ఉన్నాను!” అని జవాబిచ్చాడు.
Also read: సౌందర్యం
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి తత్త్వాలు