- ఆసియా-పసిఫిక్ దేశాలలో అధికం
- క్రమశిక్షణే పరమావధి
- బూస్టర్ డోస్ పై స్పష్టత రావాలి
ప్రచారం జరిగినట్లుగానే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వేగంగా చుట్టూముట్టడం ప్రారంభించింది. అనుకున్నదానికంటే ముందుగానే భారతదేశంలో ప్రవేశించింది. కేసుల పెరుగుదలకు తగ్గట్టుగా సిద్ధంగా ఉండడమే చేయగలిగింది, చేయాల్సింది కూడా. భారత్ తో పాటు ఆస్ట్రేలియా,జపాన్,దక్షిణ కొరియా,సింగపూర్, మలేసియా,తదితర ఆసియా -పసిఫిక్ దేశాల్లోనూ కేసులు నమోదయ్యాయి.
Also read: ఐటీ ఇంకా పైపైకి
జాగ్రత్తలు విధిగా పాటించాలి
రాకపోకల్లో ఆంక్షలు విధించడంతో పాటు ఆరోగ్య వ్యవస్థల సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవడం కీలకం. వ్యాపించే లక్షణం తీవ్రంగా ఉండడమే కొత్త వేరియంట్ లోని ప్రత్యేకత. డెల్టా వేరియంట్స్ విషయంలో పొందిన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఇక్కడ అక్కరకు రావాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం మొదలైన నిబంధనలు అమలయ్యేలా చూడడం ప్రభుత్వాల విధి. నియమనిబంధనలను పాటించడం, క్రమశిక్షణతో మెలగడం పౌరుల బాధ్యత. ఒమిక్రాన్ కలకలం రేపుతున్న తరుణంలో పలు దేశాలు బూస్టర్ డోస్ పై దృష్టి పెడుతున్నాయి. ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంబంధిత యంత్రాంగాలకు హెచ్చరికలు జారీచేశారు.బూస్టర్ డోసులపై అవగాహన పెంచే దిశగా ప్రచార కార్యక్రమాన్ని కూడా ఆ దేశం త్వరలో ప్రారంభించనుంది. బూస్టర్ డోస్ వినియోగంపై మన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై పార్లమెంట్ లో అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. 40 ఏళ్ళు దాటిన వారికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని జీనోమ్ శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. భారత దేశంలో ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది.దేశంలో అర్హులైన వారిలో ఎక్కువమందికి వ్యాక్సిన్లు ఇప్పటికే అంది ఉండడం మనకు కలిసొచ్చే అంశమని కేంద్రం భావిస్తోంది. అయితే, రానున్న అతి తక్కువ రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాఖ్యానిస్తోంది.
Also read: చిరంజీవి సిరివెన్నెల
టీకాలే రక్షణ కవచాలు
ఈ కొత్త వేరియంట్ పై వ్యాక్సిన్ల సామర్ధ్యం ఏ మేరకు పనిచేస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. అయినప్పటికీ వ్యాక్సిన్లే రక్షణ కవచాలని నిపుణులు సైతం పదే పదే చెబుతున్నారు. దేశంలోని దాదాపు 67శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు దేశ వ్యాప్తంగా జరిపిన నాలుగో సీరో సర్వేలో తేలింది. దిల్లీ, ముంబయిలో 85- 97 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు తేలడం మంచి పరిణామం. కాబట్టి, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ఇండియాలో ప్రవేశించినా, మన ప్రజలకు రక్షణ ఉన్నట్లేనని ప్రముఖ వైరలాజిస్ట్ షాహిద్ జమీల్ అంటున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిందే కానీ, భయం అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో డోసుల మధ్య వ్యవధి తగ్గించడమే సరియైన విధానం. ప్రపంచ దేశాల మెజారిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం బూస్టర్ డోసులు అందించడం ఎంతో ప్రయోజనకరం. ఈ దిశగా ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించి, వ్యాక్సినేషన్ ను ఉదృతం చేయాలి. అప్రమత్తంగా ఉండడం ద్వారా కొత్త వేరియంట్ ను కట్టడి చేయవచ్చు. అంతర్జాతీయ ప్రయాణీకులపై గట్టి నిఘా ఉంచడం, పరీక్షలు చేయించడం, పాజిటివ్ గా తేలిన నమూనాలను జన్యు పరిణామ క్రమ విశ్లేషణకు పంపడం మొదలైన వాటిని చకచకా చెయ్యాలి. ఎలాంటి ఉదాసీనత పనికిరాదు. సెకండ్ వేవ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల చాలా నష్టపోయాం. ఇప్పటికైనా మేలుకోవాలి.
Also read: అందని లోకాలకు ఏగిన అందరి శేషాద్రి