Monday, December 30, 2024

పరోక్ష ఆదాయం

సంపద సృష్టిద్దాం – 18

వ్యాపారం చేయడానికి పెట్టుబడి కావాలి. ఈ కాలంలో పెట్టుబడి లేని వ్యాపారం ఉంఛ వృత్తి. అంటే అడుక్కోవడం. చెయ్యిచాపి అడుక్కోవడానికి ఆత్మగౌరవం లేకపోవడం తప్ప మరేమీ అవసరం లేదు. భిక్షాటన భారతదేశంలోనే కాదు చాలా దేశాల్లో చాలా ప్రభావశీలమైన వ్యాపారంగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతుందని “బిచ్చగాడు” సినిమా చూసినంత వరకూ చాలామందికి తెలియదంటే అబద్దం కాదు. అయితే అది ఆర్గనైజ్‌డ్‌ సెక్టార్లో లేకపోవడం వలన, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అయినందువల్ల దానిగురించి మనం మరి చర్చించకూడదు. కొన్నేళ్ల కిందట రాజకీయాలను కూడా పెట్టుబడి లేని వ్యాపారం అనే వారు. అప్పట్లో నేరుగా ప్రజలకు సేవచేయడానికి వీలవుతుందని రాజకీయాలలోకి ప్రవేశించేవారు. ఇప్పుడు రాజకీయాలు చాలా కాస్ట్‌లీ అయిపోయాయి గురూ! నిజానికవి క్యాస్ట్‌లీగా కూడా కుదించుకుపోయాయి. కాబట్టి కోటీశ్వరులు కావాలనుకుంటున్న సాహసవీరులంతా ఈ రెండు వ్యాపారాల గురించి ఆలోచించనవసరం లేదు. అయితే, ఈ వ్యాసాలలో మనం ప్రస్తుతం చేస్తున్న పని ఏదైనా, వ్యాపారం ఏదైనా, ఉద్యోగం ఏదైనా.. దానిని కొనసాగిస్తూనే, కేవలం మన మైండ్‌సెట్‌ మార్చుకోవడం ద్వారా కోట్లాది రూపాయలను మీ జీవితంలోకి ఆహ్వానించడం గురించి చర్చిస్తున్నామని మర్చిపోకండి.

Also read: అందరికీ ఆర్థిక అక్షరజ్ఞానం

డైరక్ట్‌ సెల్లింగ్‌ వ్యాపారం

మన నెట్‌వర్కే మన నెట్‌వర్త్‌. మన పని లేదా ఉద్యోగం లేదా వ్యాపారానికి భంగం లేకుండా, అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి ఉత్తమమైన మార్గాలలో ఒక దాని గురించి ప్రస్తావించుకుందాం. రోజులో కేవలం కొన్ని గంటలు లేదా వారానికి కొద్దిగంటలు మాత్రమే వెచ్చించి ఒక క్రమపద్ధతిలో పనిచేసి అదనపు ఆదాయాన్ని సృష్టించుకోవడాన్నే పరోక్ష ఆదాయం లేదా పాసివ్‌ ఇన్‌కమ్‌ అని పిలుస్తున్నారు. ఇందులో మనం మన సమయాన్ని మాత్రమే పెట్టుబడిగా పెడుతున్నాం. ఇలా సంపదను సృష్టించడం కోసం మనం ఎలాంటి శ్రమ పడనవసరం లేదు. కేవలం మన పరిచయాలు ఉపయోగించుకుంటే చాలు. మనం నేర్చుకున్నాక, మనకేది తెలిసిందో అదే వారికి నేర్పిస్తే చాలు. సింపుల్‌ డూప్లికేషన్‌ వర్క్‌. మనం పైప్‌లైన్‌ వేసుకుని, ఇతరులు అంటే మన స్నేహితులు, బంధువుల చేత పైప్‌లైన్‌ వేసుకునేలా సాయం చేయడం ద్వారా మన ఆదాయం పెరుగుతుంటే అదే పాసివ్‌ ఇన్‌కం. దీనినే వ్యాపార పరిభాషలో నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ అని కూడా అంటారు. ఒకప్పుడు ఈ డైరెక్ట్‌ సెల్లింగ్‌ బిజినెస్‌ అంటే అదేదో నేరం అన్నట్టు చూసేవారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఈ బిజినెస్‌ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నాయి. పాత చట్టాలను సవరిస్తున్నాయి. కొత్త చట్టాలను ఏర్పరుస్తున్నాయి. ఒకప్పుడు స్నేహితులకు రిఫర్‌ చేసి డబ్బుల లావాదేవీలు జరిపితే మనీ సర్కులేషన్‌ కింద కేసులు పెట్టేవారు. ఇప్పుడు అమెరికా, చైనాలతో పాటు మన దేశంలో కూడా చాలా సానుకూలంగా తమ చట్టాలను త్వరత్వరగా మారుస్తున్నాయి. అందుకు కారణంగా నేను ఈ గణాంకాలను చూపించదలచుకున్నాను.

Also read: బిజినెస్‌మేన్‌

కిందటేడాదికే మన దేశంలో 19వేల కోట్ల రూపాయల డైరక్ట్‌ సెల్లింగ్‌ వ్యాపారం జరిగినట్లు ఫిక్కీ తన నివేదికలో తెలియజేసింది. అయితే ఇది చైనా దేశంతో పోలిస్తే పదోవంతుగాను, చిన్న దేశమైన మలేసియాతో పోల్చి చూసినా చాలా తక్కువగాను ఉంది. దానికి కారణం మన దేశంలో ఈ వ్యాపారం గురించి ఇంకా ప్రజలకు సరైన అవగాహన రాకపోవడమే. ఇప్పుడు అన్ని బిజినెస్‌ స్కూళ్ల సిలబస్‌లో డైరక్టు సెల్లింగ్‌ వ్యాపారం గురించి పాఠాలు చేర్చడం మంచి పరిణామం. ప్రజలు తమను తాము ఉద్యోగి క్వాడ్రెంట్‌లో నిలుపుకుంటూనే బిజినెస్‌ క్వాడ్రెంట్‌లోకి ప్రవేశించడానికి ఈ నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ చాలా దగ్గర దారి. పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం కాబట్టి రిస్క్‌ లేదనే సంగతి మనకు తెలిసిందే. పైగా పెద్దఎత్తున ప్రజలు ఈ వ్యాపారంలోకి రావడం ద్వారా మైక్రోఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ పెరిగి, అందరికీ అదనపు ఆదాయ ద్వారాలు తెరుచుకుంటాయి. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖలు దీనిగురించి విస్పష్టమైన ఆదేశాలు అందిస్తున్నాయి. అయితే, మన దేశంలో ఎలాంటి వ్యాపారం చేసినా మరునాడే దానికి నకిలీలు పుట్టుకొచ్చి, మాయమాటలు చెప్పి ప్రజలను పదేపదే దారుణంగా దగా చేస్తుండడం వల్ల ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటోంది. బ్లఫ్‌మాస్టర్లు ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ వాలిపోయి, వ్యాపారం సజావుగా జరగడంపై దృష్టి పెట్టకుండా, ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెడదామని ఉబలాటపడుతుంటారు.

Also read: డైరీ రాద్దామా!..

అడుగు – నమ్ము – పొందు

మన సాహసవీరులు నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ బిజినెస్‌ను ఒక పరోక్ష ఆదాయ మార్గంగా ఎంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన దేశంలో ఎఫ్‌ఎంసిజి (త్వరితంగా వినియోగమయ్యే వస్తువులు అంటే సబ్బులు, పేస్టులు మొదలైనవి) మరియు  ఆరోగ్య ఉత్పత్తులే ఎక్కువగా ఈ మార్కెట్‌లో చలామణిలో ఉండడం మనం గమనించాలి. ఉత్పత్తుల విక్రయం మీద మాత్రమే దృష్టి పెట్టే కంపెనీలు ఉత్తమమైనవి. దానికి బదులుగా అమ్మకాలు కొనసాగించే సభ్యుల నియామకాల మీద దృష్టి సారించే కంపెనీలు అధమమైనవి అని మనం గుర్తించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయా కంపెనీలలో వ్యాపారం చేయడం ద్వారా పరోక్ష ఆదాయం సంపాదించాలని ఆశపడి ప్రవేశించే వారికి ఆ సంస్థ అందించే శిక్షణ ఎటువంటిదన్న అంశం అన్నిటికంటే ముఖ్యమైనది. ఎంతపెద్ద నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ కంపెనీ అయినా అది అందించే శిక్షణ నాణ్యతను బట్టే మన పరోక్ష ఆదాయం ఆధారపడి ఉంటుంది కదా! భారతదేశంలో ప్రస్తుతం డైరక్ట్‌ సెల్లింగ్‌ బిజినెస్‌లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ పేరు చెప్పగలరా? ప్రపంచంలో కూడా ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ అదే కావడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. అది ఆమ్వే.

తప్పక చేయండి: ప్రస్తుతం మన దేశంలో డైరక్ట్‌ సెల్లింగ్‌ బిజినెస్‌లో మీకు ఎదురైన ఓ పది కంపెనీల పేర్లను రాయండి. వాటి వివరాలను సేకరించండి. ఆ కంపెనీలు ఏయే దేశాలలో తమ వ్యాపారాలను విస్తరించాయో తెలుసుకుంటూ, కేవలం మన దేశంలో ఎంతమేర వ్యాపారం చేస్తున్నాయో గణాంకాలను తెలుసుకోండి. అవి అమ్ముతున్న వివిధ రకాల ఉత్పత్తులను, వాటి ధరలు, నాణ్యతల గురించి భారతదేశ ప్రజానీకం ఏమనుకుంటున్నారో గూగుల్‌ చేయండి. మనకు తెలియని ఒక కొత్త ప్రపంచపు ద్వారాలు తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంది.

Also read: ఆర్థిక స్వేచ్ఛకు ముందర…

దుప్పల రవికుమార్‌

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles