Sunday, December 22, 2024

తెలుసుకునే హక్కును బలహీనం చేసే చట్టాలు

మాడభూషి శ్రీధర్ 30.10.2023

సమాచార హక్కు లోనే తెలుసుకునే హక్కు ఉంటుందని చాలామందికి అర్థం కాదు. అంతే కాదు ఆ స్వేచ్ఛఅనే అద్భుతమైన హక్కులోనే మాట్లాడే హక్కు, వాక్ స్వాతంత్ర్యం కూడాఉంటాయి. అది కేవలం రాజ్యాంగంలో నిర్మాతలు ఎంచుకున్న హక్కు కాదు. స్వయమైన సహజ హక్కు ఇది. అది తప్పకుండా లేకపోతే మరే హక్కుఉండదు. అంతే కాదు, ఇది ఇవ్వకపోతే అసలు ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగమే ఉండదు.

ఇది ఇండియా కాదు,‘భారతం’

మనం ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా’ రాజ్యాంగం కాదంటూ ‘భారత’ రాజ్యాంగం అంటూ మార్చింది. మనకు రాజ్యాంగ నిర్మాతలు రాసుకున్న మొదటి ఆర్టికిల్ లో రాజ్యాంగం ‘ఇండియా లేదా భారత రాజ్యాంగం’ అని నిర్వచించారు. ఏమైనా మార్చుకున్నా వాక్ స్వాతంత్ర్యం ఏ ప్రభుత్వము కూడా మార్చకూడదు. మార్పిస్తే, ఏమార్చితే జనం ఒప్పుకోకూడదు.

వాక్ స్వాతంత్ర్యం గతి

కేంద్ర ప్రభుత్వం అనేక దశలలో వాక్ స్వాతంత్ర్యాన్ని బలహీనపరుస్తున్నది. నిజానికి భారత రాజ్యాంగాన్ని నడిపించిన హక్కు ‘వాక్ స్వాతంత్ర్యమే’, కనుక అందులో భాగమైన హక్కును భారత దేశ ప్రజలు సాధించిన హక్కు ‘ఆర్టీఐ చట్టం’. 2005కు ముందు కనీసం 15 సంవత్సరాల నుంచి పోరాడారు, చివరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఈ చట్టాన్ని నిర్మించారు. రాజస్తాన్ జనపోరాటాలను నిర్వహించారు.

పుస్తకం చోరీ

ఈ రచయిత ఈ చట్టం గురించి 2004లో ఒక మొదటి ‘ఆర్టీఐ’ పుస్తకాన్ని రచించారు. కాని ఒక ప్రముఖ డిల్లీ ప్రచురణ సంస్థ వారు, ‘ఇది కాపీ చేయడం అని ఒక నేరం’ అని తెలిసినా ఒక ప్రముఖ రచయిత కాపీ కొట్టాడు.  ఆశ్చర్యం.ఇంత దొంగతనమా? అప్పుడు నల్సార్ (జాతీయ  లా అకాడమీ, యూనివర్సిటీ) ప్రొఫెసర్ గా పనిచేసినప్పుడు,ఒక సంఘటన జరిగింది. ఒక డిల్లీ పుస్తక వ్యాపారులు కాపీ చేసే నేరాన్ని పాల్పడినా, దానికి ఒక పుస్తక రచయిత కూడా నేరం చేసినా, ఆ దొంగలను వదిలేయడం మంచిదా? పోలీస్ స్టేషన్ లో దీనికి కేసు పెట్టవచ్చునని హైదరాబాద్ లో చాలామందికి తెలియదు, చాలా సందర్భాలలో పోలీసు అధికారులకు ఎఫ్ ఆర్ ఐ ఫిర్యాది చేయిన సంఘటనలు ఎక్కువగా లేదు. రాజధానిలోనే ఇట్లా ఉంటే చిన్న జిల్లాల స్థాయిలో పోలీసులు ఏ చేయగలరు? ఒక అధికారిణి ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంలో ఇదొక అదృష్టం అనిపిస్తుంది. కాపీరైట్ చట్టం నియమాలు, శిక్షల వివరాలు పిపిటి ద్వారా ఒక క్లాస్ లో పాఠం చెప్పినట్టుగా వివరించిన తరువాత కేసులో ఎఫ్ ఆర్ ఐ నమోదు చేసారు. గ్రేట్. అప్పుడు ఎంతో శ్రమతో ప్రయత్నించి, అందరికీ వివరించిన తరువాత  డిల్లీ నుంచి అరెస్టు కు సమన్లు పంపించారు. ఆ ప్రచురణకర్త హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయానికి రాక తప్పలేదు. పెద్దలయిన వైస్ చాన్సెలర్, రిజిస్ట్రార్ వారితో చర్చించిన తరువాత ఈ రచయిత కాపీ చేసిన ప్రచురణ కంపినీ వారిపై కేసును ఉపసంహరించారు. అయితే చట్టం కింద నేరం చేసినవారిని జైలుకు పంపించ వచ్చు, లేదా కొన్ని సందర్భాలను పట్టి నష్టపరిహారం ఇచ్చే సౌలభ్యం ఉంది. అంతే గాక కాపీ ‘‘మిత్రుడి’’ ప్రచురించిన పుస్తకం గురించి ‘‘ఒక ముఖ్యమైన ప్రకటన’’ అనే ప్రచురణ పేరుతో ఈ రచయిత పుస్తకంలో ప్రచురించారు. తరువాత మరొక సారి ప్రచురించక తప్పలేదు. ఇది ప్రచురణ దుర్మార్గంపైన ఒక చరిత్రగా మిగిలింది. లా ప్రొఫెసర్లు కాక మరొక రెవరు ఈ పోరాటం చేయగలరు?

ఆర్టీఐ చట్టం కింద డిగ్రీ వివరాలు ఇవ్వొచ్చా?

ఈ ఆర్టీఐ పుస్తకం వెనుక ఆ చరిత్ర తరువాత ఈ రచయిత కేంద్ర సమాచార కమిషన్ గా నియమించ కావడం, దాదాపు అదే సమయంలో ఆర్టీఐ పుస్తక పునఃప్రచురణ జరిగింది.

ఈ సందర్భంలో ఒక డిగ్రీ వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ చట్టం కింద న్యాయమూర్తి వంటి ఒక సిఐసి ప్రత్యేకంగా ఇవ్వాలని ఆదేశించిన తరువాత అనేక సమస్యలు వచ్చాయి. అసలు ఆర్టీఐ చట్టం బలాన్ని అన్యాయంగా తగ్గించడానికి ప్రయత్నాలు చేసారు. అప్పుడు ప్రభుత్వం ఆ ఆర్టీఐని తగ్గించే విధింగా సవరించినందుకు మరికొందరు మాజీ సిఐసిలు, ఈ రచయిత కూడా ప్రభుత్వాన్ని ఖండించారు. అప్పుడు ఒక కమిషనర్ గా పదవిలో ఉండగానే ఈ విధమైన సవరిణ ప్రశ్నించడం ఒక విమర్శగా నిలిచింది. కాని పదవీ కాలం తీరిన తరువాత ఆర్టీఐ చట్టాన్ని ప్రభుత్వాన్ని నీరుగార్చే నిర్ణయం తీసికొని ఆ సవరణను 2019లో పార్లమెంట్ ఆమోదించింది. 

చట్టం ప్రైవసీ దెబ్బ

ఆర్టీఐ చట్టం కింద సమాచార కేంద్ర, రాష్ట్ర కమిషనర్ ప్రాధాన్యం చాలా ఉంది. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమానంగా ఈ కమిషన్ కు అధికారం ఇచ్చారు. కనుక కమిషన్ కి అది చాలా కీలకమైంది. 2005 ఆర్టీఐ చట్టంలో కమిషనర్ కి అయిదేళ్ల పదవీ కాలాన్ని నిర్దేశించారు. కమిషన్ అధికారాలను మార్చడానికి 2005 తరువాత అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. 

స్నాతకోత్తర పట్టభద్రుల  స్థాయిలో డిగ్రీ వివరాలు ఇవ్వడం సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాలని వందలాది సీఐసి తీర్పులు ఇచ్చారు. ఈ రచయిత మరిన్ని వివరాలతో ఆర్టీఐ కింద ఒకరు అడిగారు. ఏ కారణాలు లేకుండా ఒక న్యాయ సూత్రం ప్రకారం సమాచారం ఇవ్వవలసిందే. కాని కీలకమైన పదవుల్లో ఉన్న వారి డిగ్రీ వివరాలు ఇవ్వడం ప్రయివసీ వ్యవహారమే అని పెద్దలు నిర్ణయించారు. ఇది దురదృష్టకరం.

ఆర్టీఐ పై ప్రభుత్వ దెబ్బ

కాని ఆ కమిషన్ అధికారపదవిని, బలాన్ని తగ్గించి, కమిషనర్ పదవీకాలాన్ని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించి, వారి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా ఎన్నికల కమిషన్ సమాన స్థాయిని ఉన్నప్పడి నుంచి తగ్గించి ఒక కింది స్థాయి ఒక అధికారిగా మార్చారు.

అంతే కాదు, రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్ లకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు తొలగించి, కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారాన్నిబదలాయించారు. రాష్ట్ర కమిషనర్లును కూడా కేంద్రమే నిర్ణయించాలని, ఆ అధికారం ఫెడరల్ సూత్రం కాదని, ఆ అధికారాన్ని కూడా రాష్ట్ర కమిషన్ అధికారులకే ఇవ్వకుండా కేంద్రానికే ఇవ్వాలని ఆర్టీఐ చట్టాన్ని మార్పించారు. కమిషనర్ల జీతాలను, ఇతర భత్యాలను కూడా కేంద్రం ద్వారా తగ్గించే అధికారాలను ఎప్పడెప్పుడుమరో సందర్భాలలో కూడా వీలైతే మరోసారి తగ్గించడానికి ఆర్టీఐ చట్టం లో పార్లమెంట్ ద్వారా మార్చివేశారు.

చాలా అన్యాయంగా ఈ అధికారాలను రాష్ట్రాలను అడగకుండా ఈ విధంగా సవరించినా ఫెడరల్ అధికారాన్ని తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు దాకా కూడా వీరెవరూ వెళ్ళి అడగలేదు.  ఆ విధంగా కేంద్ర, రాష్ట్రస్థాయి సమాచార కమిషనర్లను ఏ అధికారాలు లేని బలహీనం చేసి సమాచార హక్కును కూడా తగ్గించారు. చివరకు చిన్న అధికారులకు కూడా ఆర్టీఐ చట్టం కింద సమాచారం నిరాకరించే హక్కు ఇచ్చి చట్టాన్ని కకావికలం చేశారు. 

డేటా చట్టం దెబ్బ

ఇది కాకుండా, డిజిటల్ డేటా రక్షణ చట్టం 2023లో ప్రత్యేకంగా సమాచార హక్కును 2005కాలపు ఆర్టీఐ సమాచార వెల్లడికి సంబంధించిన అనేక మినహాయింపులను, రక్షణలను తగ్గించారు. అందువల్ల వ్యక్తిగతమైన సమాచారాలను ఆర్టీఐ కింద కూడా ఇవ్వకూడదు అనే నియమాన్ని పెట్టారు. సెక్షన్ 8(1)(జె) ఆర్టీఐ చట్టాన్ని 2023డేటా చట్టం ద్వారా సవరించారు. సవరించడమంటే తగ్గించడమని అర్థం చేసుకోవాలి. కేవలం 2023 డేటా చట్టాన్నే కాకుండా తద్వారా 2005 సమాచార హక్కు చట్టాన్ని కూడా తాజాగా తగ్గించారు. అంటే అధికారులకు ఉద్యోగుల సమాచారాన్ని వ్యక్తిగత విషయాలనే పేరుతో ప్రైవసీ అనే సుప్రీంకోర్టు తీర్పును వాడుకోవడానికి తగ్గించారు. ఇక డేటా చట్టం కింద తప్పుచేస్తే 250 కోట్ల రూపాయల జరిమానా విధించే భయంకరమైన అధికారాన్ని ఈ 2023 చట్టం ద్వారా అధికార యంత్రాంగానికి ఇచ్చి కూర్చున్నారు. అంటే 2005 నాటి చట్టంలోని నిబంధనలను బలహీనం చేసే విధంగా 2019, 2023 చట్టాల ద్వారా మరింత నీరుగార్చారు.

చట్టాల ద్వారా బలహీనం చేయడం మాత్రమే కాకుండా ప్రభుత్వాలు కేంద్రంలో, రాష్ట్రాలలో ఎన్నో పార్టీలు రకరకాల ప్రయత్నాల ద్వారా న్యాయవ్యవస్థ, న్యాయ అధికారులతో సహా  సమాచార చట్టాన్ని దెబ్బతీయడం దురదృష్టం.

కమిషనర్లను నియమించరు

జార్ఖండ్ ఆర్టీఐ ఛీఫ్ లేరు, నియమించరు. అక్కడ ఏ కమిషన్ కూడా లేదు. మొత్తం రాష్ట్రాల్లో 6 ఛీఫ్ కమిషనర్లు లేరు. ఇక ఆర్టీఐ గతి ఇది.

ఈ విధుల్లో కేంద్ర, రాష్ట్ర కమిషనర్ల నియామకం కీలకమైంది. ప్రతిచోట దాదాపు ప్రభుత్వాలు కమిషనర్ల నియామకం చేయరు. ఖాళీలు పూర్తిచేయరు. ఒక చోట ముఖ్య సిఐసి ఉండదు, మరో చోట రాష్ట్ర సిఐసిలు ఉండరు. ఒక ఖాళీ అయిన వెంటనే మరొక కమిషనర్ను ఆ సమయానికి ముందే ఎందుకు నియమించరు? ఈ ప్రశ్నకు జవాబే లేదు.

సతర్క్ నాగ్రిక్ సంఘటన్ కమిటీ వారు 2022-2023లలో వారి కమిషనర్లు పనిచేసే ప్రగతి గురించి ఇచ్చిన నివేదికను చూస్తే దారుణం అని తేలుతుంది. చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్,  జార్ఖండ్ తెలంగాణ, మిజోరం, త్రిపుర ల్లో కూడా ఉండవలసిన ఛీఫ్ కమిషనర్లు లేరు. కొన్ని చోట్ల ఎన్నికల వల్ల వారు నియమించడానికి వీల్లేదంటారు. సరే, మరి అంతకు ముందే ఎందుకు చేయరో ఎవరికీ తెలియదు. మొత్తం 29 కమిషనర్లలో ఆరు చోట్ల ఛీఫ్ లేకపోవడం వల్ల 3 లక్షల దరఖాస్తు చేసే వారికి ఆర్టీఐ సమాచారం అడిగితే ఇవ్వరు. పెండింగ్ లో ఉంటాయి. దాదాపు 10 కమిషనర్లలో ఏడాది నుంచి అంతకన్న ఎక్కువ ఆలస్యం తరువాత సమాచారం ఇస్తున్నారు.

ఇది ఆర్టీఐ డే అంటే ‘వర్ధంతా’ (మరణమా)?

అక్టోబర్ 12న ఆర్టీఐ డే అని ఈ చట్టం వచ్చే 18 సంవత్సరాలు పూర్తి అయినా, కనీసం ఆర్టీఐ జయంతి (వర్థంతి అందామా) చేసే పని కూడా కరోనా పాపం వల్ల ఆగిపోయింది. ఈ రచయిత ఆర్టీఐ కమిషర్ అయిన అయిదేళ్లలో 2013 నుంచి 18  వరకూ ప్రతి ఏడాది ఆర్టీఐ డే జయంతి చేసేవారు. చర్చ జరిగేది, ఒక సారి ప్రధాన మంత్రి మోదీ గారు, మరోసారి ప్రెసిడెంట్, తరువాత వైస్ ప్రెసిడెంట్ గార్లు ముఖ్య అతిధిగా వచ్చి అందమైన ఉపన్యాసాలు చెప్పారు. ఆర్టీఐ ఇంత గొప్పదో వివరించే వారే మన అతిధులు.

ఖాళీల వెనుకే రహస్యం

కాని చేసిందేమీ లేదని సమాచారం హక్కులో ఖాళీల ద్వారా కనబడుతుంది, ఇప్పుడు కరోనా వల్ల జయంతి లేదు. ఇక ‘వర్ధంతి’కోసం అంటే చట్టాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

2022 డిసెంబర్ 2005 చట్టం కింద 6 కమిషనర్లకోసం ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్రంలో సెప్టెంబర్ 2023న ఛీఫ్ తో పాటు కమిషనర్ల ఖాళీలు ఉన్నాయని తేలింది. ఇంత వరకు ఛీఫ్ లు లేరు. ఎన్ని ఖాళీలు ఉన్నాయని సమాచారం అడిగితే మాత్రం అవును ఖాళీలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. సిగ్గు చేటు కదా?

ఆర్టీఐని అడిగేవి దేశం మొత్తం మీద 2.20 లక్షల అప్పీల్స్ కంప్లయంట్లు. 1 జులై 2022 నుంచి 30 జూన్  2023లో 28 కమిషర్లకు సమాచారం ఇచ్చారు. 2.14 లక్షల అభ్యర్థనలకు సమాచారం ఇచ్చారు.  మొత్తం మీద 27 కమిషనర్లనుంచి 3.21 లక్షల పెండింగ్ లు ఉన్నాయని నివేదికలు వివరించాయి. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం 2.5 కోట్ల ఆర్టీఐ అప్లికేషన్ లు వచ్చాయి.  2006నుంచి 2016 దాకా ప్రతిఏడాది 40 నుంచి 60 లక్షల దాకా దరఖాస్తులు అడిగారు.

ఓ లెక్క ప్రకారం 24 ఏళ్లదాకా ఒక రాష్ట్రంలో సమాచారం రావడానికి పడుతుందని అంటున్నారు. 1 జులై 2023న దరఖాస్తు చేసిన కమిషన్ల ముందు ఈ లెక్కన ప్రతి యేడాది కాలంలో రేట్ ప్రకారం అందాజా 2047లో జవాబులు దొరకే అవకాశం ఉంది.

అమలు దెబ్బ

ఒక కమిషనర్ల మరో కోణంలో పనితీరు ఆలోచిస్తే 91 శాతం కేసుల్లో చట్టం కింద పెనాల్టీ వేయవలసినవి. కాని ఈ చోట్ల కమిషనర్లు వదిలేస్తున్నారు. ఇదీ దెబ్బ. అది లెక్కలోకి చెప్పినా అర్థం కాదు. ఆర్టీఐ చట్టం 25 సెక్షన్ కింద ప్రతి ఏడాది పార్లమంట్ కు లేదా రాష్ట్ర శాసనసభలకు 29 మందిలో 19 కమిషనర్లు అంటే 66 శాతం 2021-22న వార్షిక నివేదికలే ఇవ్వలేదు. పార్లమెంట్ చట్టం చేసినా అడిగే వారు లేరు.

అసలు ఏ పార్టీకూడా ఆర్టీఐని బలోపేతం చేయడానికి కనీసం ఆలోచించలేదు. వారి ఎన్నికల ప్రణాళికల్లో ఆర్టీఐ ని బతికిద్దాం అనే ఆలోచనే లేదు. ఇప్పుడు 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాని ఏ పార్టీ దీని గురించి పట్టించుకునే వారే లేరు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles