Sunday, December 22, 2024

అస్తమించిన భారతీయ వెండితెర వెలుగు దిలీప్ కుమార్

హిందీ చలనచిత్ర రంగంలో ‘ట్రాజెడీ కింగ్’ అన్న బిరుదు, అపారమైన ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న నటదిగ్గజం దీలిప్ కుమార్ (12 డిసెంబర్ 1922- 7జులై 2021). నటుడిగా అర్ధశతాబ్దికి మించి సినీరంగంలో కృషి చేస్తూ రావడం మామలు విషయమేమీ కాదు. తొలి దశలో భారత ప్రభుత్వం నుండి ఏ అవార్డూ, ఏ గౌరవమూ, ఏ ప్రోత్సాహమూ లభించని ఈ నటుడికి 1994లో దాదాఫాల్కే అవార్డు రావడంతో అభిమాన ప్రేక్షకుల  ఆనందానికి హద్దు లేకుండా  పోయింది. ఆ అత్యున్నత జాతీయ పురస్కారానికి స్వయంగా ఆయనే విస్మయానందాన్ని వెలిబుచ్చారు.

Also read: మహామానవతావాది – సర్ చార్లీ చాప్లిన్

బ్రిటిష్ ఇండియాలోని పెషావర్ లో పన్నెండు మంది సంతానంలో ఒకడిగా మహ్మద్ యూసుఫ్ ఖాన్ గా జన్మించారు. అయితే ముంబాయి (బొంబాయి) చలనచిత్రరంగంలో అడుగుపెట్టడంతోనే పేరు మార్చుకున్నారు. ఆ రోజుల్లో ‘కుమార్’ అనే పదానికి క్రేజ్ ఉండేది. అందుకు దిలీప్ కుమార్ గా మారిపోయారు. అలనాటి అందాల తార దేవికారాణి ప్రోత్సాహంతో 1944లో ‘జవార్ బాటా’ చిత్రంలో మొదట నటించారు. ఆ తర్వాత వచ్చిన చలన చిత్రాలన్నీ విశేష జనాదరణ పొందుతూ ఉండడం వల్ల దిలీప్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిపోయారు. దేవదాస్, ఆగ్,  దాగ్, మధుమతి, అందాజ్, కోహినూర్, నయాదౌర్, ఆజాద్, నగీనా, సంఘర్ష్, లీడర్, దీదార్  వంటివి ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఇవే కాక, చెప్పుకోదగ్గ గొప్ప చలనచిత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ‘‘మొగల్ –ఎ- ఆజమ్’’లొ సలీం పాత్ర ఎంతో క్లిష్టమైంది. పృధ్వీరాజ్ కపూర్ (అక్బర్), దుర్గాకోటె (అక్బర్ భార్య జోదాబాయి), మధుబాల (అనార్కలీ) వంటి హేమాహేమీలకు దీటుగా నిలబడి సలీం పాత్రను హుందాగా పోషించడం ఒక అగ్నిపరీక్ష లాంటిది.  అయితే ఆ పరీక్షలో దిలీప్ కుమార్ అవలీలగా విజయం సాధించారు. దేశవ్యాప్తంగా ఒక్కొక్క థియేటర్లో యేళ్ళకేళ్ళు నడిచిన మొగల్-ఎ-ఆజమ్ వంటి చారిత్రాత్మకమైన-చరిత్ర సృష్టించిన- సినిమా మళ్ళీ భారతదేశంలో రూపొందలేదంటే అతిశయోక్తి కాదు. మన హైదరాబాదు ఆబిద్ కూడలిలో ప్యాలెస్ థియేటర్ ఉండేది. అందులో ఆ సినిమా ఏకధాటిగా సంవత్సరం పైగా నడిచింది. (అప్పుడే నేను మొదటిసారి హిందీ సినిమా చూశాను. నాకు అప్పుడు పదేళ్ళు కూడా ఉండి ఉండవు. నిజంగానే చరిత్ర పాఠంలోని అక్బర్ ని చూస్తున్నానని భ్రమించాను).

రాజ్ కపూర్, దిలీప్ కుమార్

‘గంగా-జమున’ చిత్రంలోబందిపోటు పాత్ర, ‘రామ్ అవుర్ శ్యామ్’ చిత్రంలో కవల పాత్రలు, వారి భిన్న మనస్తత్వాలు కేవలం ఆయన మాత్రమే పోషించగలడనే స్థాయిలో ఉన్నాయి. 1960-70ల దాకా విషాదరస పోషణలో తిరుగులేని నటుడు అని ముద్ర పడిన దిలీప్ కుమార్, ఆ తర్వాత క్రమంగా వైవిధ్యమున్న ఎన్నో ఇతర పాత్రలు పోషించనారంభించారు. ‘లీడర్’, ‘గోపి’ వంటి చిత్రాలలో సరదాగా హాస్య కథానాయకుడయ్యారు. మశాల్, శక్తి, ఇన్ సానియత్, విధాత, కానూన్ అప్ నా అప్ నా, కర్మ, క్రాంతి వంటి ఇతర చిత్రాలలో కథానాయకుడిగానే కాక, నటనకు ప్రాధాన్యమున్న కేరక్టర్ యాక్టర్ గా ముఖ్య భూమికలు పోషించారు.

Also read: బౌద్ధ మార్క్సిస్టు – రాహుల్ సాంకృత్యాయన్

చిన్నప్పుడు దిలీప్ కుమార్, రాజ్ కపూర్ కుటుంబాలు పెషావర్ లో ఒకే ప్రాంతంలో ఉండేవి. అందువల్ల వాళ్ళిద్దరూ చిననాటి స్నేహితులు. అయితే  ఒకనాటికి ఆ ఇద్దరూ దేశంలో తిరుగులేని వెండితెర వెలుగులవుతారని ఎవరూ ఊహించలేదు. ఆ రోజుల్లో నాటకాల్లో, సినిమాల్లో వేషాలు వేయడమనేది తక్కువ స్థాయి పనుల కింద జమ కట్టేవారు. అందుకే దిలీప్ కుమార్ మొదట సినిమాలో నటించిన విషయం ఇంట్లో చెప్పలేదు. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ నాటకరంగంలో పరిచయం ఉన్నవాడు గనక, సినిమా పోస్టర్ పై దిలీప్ ను గుర్తు పట్టి విషయం గ్రహించాడు. తర్వాత, పండ్ల వ్యాపారి అయిన దిలీప్ తండ్రికి చెపితే విషయం ఆ ఇంట్లో తెలిసింది. తర్వాతి కాలంలో బాంబాయిలో స్థిరపడి బాలివుడ్ సామ్రాజ్యానికి చక్రవర్తులయ్యారు. అదొక సుదీర్ఘ ప్రయాణం.

దిలీప్ కుమార్, సైరా బానూ

ఒక వైపు అమాయక ప్రేమికుడి పాత్రలతో రాజ్ కపూర్ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటే, మరోవైపు దేవానంద్ తన రొమాంటిక్ పాత్రలతో యువతరాన్ని ఉర్రూతలూగిస్తూ ఉంటే – దిలీప్ కుమార్ అతి బరువైన పాత్రలతో విషాదభరిత కథా చిత్రాలతో తన సత్తా చూపించేవాడు. ప్రేక్షకుల్ని హాస్యంతో ఆకట్టుకోవడం సులభం. కానీ, త్యాగాలతో మరణాలతో ఆకట్టుకోవడం చాలా కష్టం. ఆ కష్టమైన పనినే దిలీప్ కుమార్ సాధించారు. అందుకు ఆయన ఎప్పుడూ ‘వాసి’కి విలువనిచ్చారే గాని, రాశికి కాదు. మరొక ముఖ్యవిషయమేమంటే, అంతర్జాతీయంగా ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టే హాలివుడ్ పాత్రల్ని కూడా ఆయన తృణప్రాయంగా వదులుకున్నారు. ఆయనకు సరిపడే పాత్ర, కథ, వాతావరణం, భాష అన్నీ ఉంటేగాని ఆయన రంగంమీదికి దిగేవారు కాదు. తనను నమ్ముకున్న దర్శక నిర్మాతలకు ఎప్పుడూ ఏ విధమైన నష్టం కలగకుండా చూసుకునేవారు. నిజాయితీకి, కట్టుబాట్లకు కొన్ని నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చేవారుప అందుకే, ‘దేవదాస్’ చిత్రంలో తాగుబోతు పాత్రను చేస్తూ ఉండగా దర్శకుడు గురుదత్ తన ‘ప్యాసా’ చిత్రానికి ఆహ్వానిస్తే మర్యాదగా తిరస్కరించారు. కారణం ఏమీ లేదు. ఒకే రకమైన పాత్ర ఒకే సమయంలో వేరు వేరు సినిమల్లో చేయడానికి ఇష్టపడలేదు. అయితే అది గురుదత్ కు చాలా ఉపయోగపడింది. ‘నువ్వు రూపకల్పన చేసిన పాత్ర – నీ కన్నా బాగా ఎవరు చేయగలరూ?’ అని శ్రేయోభిలాషులు సూచించడంతో ‘ప్యాసా’ చిత్రంలో హీరో పాత్ర దర్శకుడైన గురుదత్తే పోషించారు. అది అఖండ విజయం సాధించడమే కాదు, గురుదత్ లోని ఒక గొప్ప నటుణ్ణి బయటికి తీసుకొచ్చింది.

Also read: కవి, వెండితెర కవిగా మారితే – బుద్ధదేవ్ దాస్ గుప్తా

‘గంగా-జమున’ రషస్ చూసిన డేవిడ్ థావన్ దిలీప్  కుమార్ ను తన చిత్రం ‘లారెన్స్ఆఫ్ అరేబియా’లో నటించడానికి రమ్మని ‘టెలిగ్రాం’ పంపాడు. తనకు సరిపడే వాతావరణం అక్కడ ఉండదని, నటనలో తనదైన అభివ్యక్తిని ప్రదర్శించే వీలు ఉండదని  ఆ ఆహ్వానాన్ని కూడా మర్యాదగా తిరస్కరించారు. ‘ట్వంటియత్ సెంచరీ ఫాక్స్’ వారి  ‘వెన్ ద రెయిన్స్ కేమ్’ అనే చిత్రం రీమేక్ లో పని చేడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే తన దేశంలో తన   రంగంలో కేవలం తనదే అయిన  ప్రత్యేక ఇమేజ్ ని కాపాడుకోవడానికి! గాలివాటంలాగా పడి కొట్టుకుపోవడం ఆయనకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. ఆయన సమకాలికులు రాజ్ కపూర్, దేవానంద్, శాంతారామ్ వంటి వాళ్ళంతా సినీ దర్శకులై సినీరంగాన్ని శాసిస్తున్న రోజుల్లో కూడా ఆయన కేవలం నటనకు మాత్రమే పరిమితమయ్యారు. డైలాగ్ డెలివరీకి, స్టెప్పులు వేయడానికి, చేతలు తిప్పడానికి ఆ రోజుల్లో దిలీప్ కుమార్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. దాన్ని యథాతధంగా అనుకరిస్తూ తర్వాత కాలంలో ఎంతో మంది హీరోలుగా చెలామణి అయ్యారు.

యవ్వనంలో దిలీప్ కుమార్

నళినీ జయవంత్, మధుబాల, నర్గీస్, మీనాకుమారి, సైరాబాను వంటి  నటీమణులతో ఆసిఫ్, విమల్ రాయ్, హృషీకేష్ ముఖర్జీ, రాజ్ కపూర్, బి.ఆర్. చోప్రా, సుభాష్ ఘాయ్ వంటి దర్శకులతో దిలీప్ కుమార్ కలసి పని చేశారు. రాజ్ కపూర్ ఆత్మగా భావించబడే గాయకుడు ముఖేష్ తొలి దశలో దిలీప్ కుమార్ కు కూడా తన గొంతును అందించారు. తర్వాత చాలా వరకు మహ్మద్ రఫీయే పాడారు. ‘మధుమతి’ చిత్రంలో దిలీప్ కు పాడిన ముఖేష్ పాటలు ఎంత హిట్లో ఆ అభిరుచి ఉన్నవారికి తెలుస్తుంది. విక్టోరియా, డిసికా, ఫెల్లీనీ, ట్రుఫట్ వంటి విదేశీ చలన చిత్రదర్శకులు, స్వదేశీ దర్శకుడైన సత్యజిత్ రే తనకు ఎంతో అభిమానమని తరచూ చెప్పుకునేవారు. వారి చిత్రాలతో తనెంతో  స్ఫూర్తి పొందానని సగర్వంగా ప్రకటించుకునేవారు. అంతే కాదు, గారీ కూపర్, జేమ్స్ స్టివర్ట్, పౌల్ ముని వంటి ప్రపంచ ప్రసిద్ధ నటుల అభినయాన్ని అమితంగా అభిమానించేవారు. పద్మభూషణ్ (1991) నిషాన్ యె ఇమ్తియాజ్ (1998-అత్యున్నత పాకిస్తాన్ పురస్కారం), పద్మవిభూషణ్ (2015) మొదలైన గౌరవాలు స్వీకరించడమే కాకుండా 2000-2006 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఇతర నటుల వలె ప్రత్యక్ష రాజకీయాలతో ఆకర్షిపబడలేదు. నటి సైరాబాను (భార్య)తో ప్రశాంత జీవనం గడిపారు. మౌలానా ఆజాద్, ఫక్రుద్దీన్ అహ్మద్, షానవాజ్, మొయిన్ ఉల్ హక్ వంటి రాజకీయ నాయకులతో బంధుత్వం, బాంధవ్యం ఉండి కూడా రాజకీయాలకు దూరంగా ఉండడం విశేషం. సాంఘిక కార్యకర్తగా, ఎన్నో సంస్థలకు మార్గదర్శిగా ఉన్నారు. జాతి పురోగమనానికి సర్వదా కృషి చేస్తూనే వచ్చారు. వయసు మీదపడిన తర్వాత కూడా ఇరుగు పొరుగు పిల్లలతో క్రికెట్ ఆడుతూ, ఫుట్ బాల్ ఆడుతూ దేహదారుఢ్యాన్నీ, ఆరోగ్యాన్నీ పెంచుకునే వృద్ధబాలకుడీయన! తనకు గుర్తులేని వయస్సులో తల్లి చనిపోతే, ఆర్థిక స్తోమత లేని తండ్రి ఏ సహాయమూ చేయలేక పోతే స్వయం కృషి తో ఒక రంగంలో లెజెండ్ గా నిలబడడం ఆషామాషీ కాదు. కీర్తికండూతి లేకుండా తన మానాన తాను జీవిస్తూ, నటి సైరాబానుతో జీవితం పంచుకుని, బాధ్యతగల భారతీయుడిగా జీవించిన దిలీప్ కుమార్ ఎందరికో ఆదర్శప్రాయుడు. తన నటనలో తీవ్రతను కేంద్రీకరించి, దాన్ని తన పాత్రల ద్వారా ఆవిష్కరించి, ఈ సమాజాన్ని అలరించిన ఒక మహానటుడి సాంస్కృతిక, సామాజిక సేవను బేరీజు వేయడం అంత సులభం కాదు. 98వ యేట కన్నుమూశారని తెలసుకున్న-ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల ప్రేక్షకులు బాధాతప్త హృదయాలతో నివాళులర్పిస్తున్నారు.  

Also read: ‘రే’ ను గూర్చి రేఖామాత్రంగా

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles