Thursday, December 26, 2024

దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ఆత్మహత్యాసదృశం

తనకు అతితెలివి ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు నిరూపించుకున్నారు. కన్యాకుమారిలో ఇటీవల ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గురించి చేసిన వ్యాఖ్యలు వరంగల్లులో మే 6న రాహుల్ ప్రసంగించిన బహిరంగ సభలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఉన్నాయి.  వ్యవసాయం గురించి రాహుల్ ప్రకటనలు చేస్తూ పనిలో పనిగా కాంగ్రెస్ ప్రధాన శత్రువు టీఆర్ఎస్ అని ఘంటాపథంగా చెప్పారు. అంతేకాదు, ఇప్పటికీ టీఆర్ఎస్ తో సత్సంబంధాలు పెట్టుకోవాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు పార్టీ వదిలిపెట్టి పోవచ్చునని స్పష్టం చేశారు. కానీ దిగ్విజయ్ సింగ్ భవిష్యత్తులో టీఆర్ఎస్ కాంగ్రెస్ ను బలపరచవచ్చునంటూ మాట్లాడారు. బీజేపీ నాయకులు కోరుకుంటున్నది కాంగ్రెస్ నేతలు ఈ విధంగా మాట్లాడాలనే.

తెలంగాణలో ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేననీ,టీఆర్ఎస్  కు అదనంగా రజాకార్లతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నాయకుడు బండి సంజయ్ అంటున్నారు. బీజేపీ టీఆర్ఎస్ కు బి-టీమ్ అంటూ అదేపనిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కూ, టీఆర్ఎస్ కూ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మూడు పార్టీల నాయకులూ మూడు రకాల ఆరోపణలు చేస్తూ ఉండటంతో సామాన్యప్రజలు గందరగోళానికీ, అయోమయానికీ గురి అవుతున్నారు.  

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లోనే అనేక సమస్యలు ఉన్నాయి. పార్టీలోని సీనియర్ నేతలలో చాలామంది టీఆర్ఎస్ తో సంబంధాలు కలిగి ఉన్నారు. వారికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో నేరుగా, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి తన పార్టీలోనే ప్రత్యర్థులు ఉన్నారు. రేవంత్ చంద్రబాబునాయుడు మనిషనీ, అతడిని నమ్మటానికి లేదనీ వారు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ విశ్వసనీయతను బదాబదలు చేయడానికి చేయగలిగినదంతా వారు చేస్తున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యకర్తలలో జోష్ నింపడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. చాలావరకూ సఫలీకృతులైనారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ నియామకాన్ని జీర్ణించుకోలేని వారు టీఆర్ఎస్ తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. పార్టీలోని ప్రత్యర్థులతో ఎట్లా వ్యవహరించాలో అర్థం కాక రేవంత్ సతమతం అవుతున్నారు. 

మునుగోడు ఉపఎన్నికలో కనుక కాంగ్రెస్ ఓడిపోతే అది ప్రజల అంచనాలో మూడో స్థానానికి దిగజారుతుంది. ఓడిపోయే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకూ స్థానిక బీజేపీ నాయకులూ, దిల్లీ నుంచి వచ్చిన అమిత్ షాలూ, నడ్డాలూ ఎంత హడావుడి చేసినప్పటికీ తెలంగాణలో ప్రజాదరణ ప్రకారం కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇరవై శాతం ఓట్లు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి నాయకులు కొంతమంది నిష్క్రమించినా కూడా కాంగ్రెస్ ప్రాబల్యం పెద్దగా తగ్గలేదు. పైగా రాహుల్ గాంధీ పాదయాత్ర కారణంగా కాంగ్రెస్ ప్రతిష్ఠ పెరుగుతుందే కానీ తగ్గదు.  సోనియాగాంధీ ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయ్ స్రవంతి కూడా గట్టి నాయకురాలు. అంతకంటే ఉత్తమమైన, బలమైన అభ్యర్థి కాంగ్రెస్ కు దొరకడం అసాధ్యం.

మునుగోడు కాంగ్రెస్ నియోజకవర్గమని గుర్తుపెట్టుకోవాలి. 2018లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్టు మీదనే గెలుపొందారు. ఇటీవలే బీజేపీలోకి గెంతారు.  తాము ఈ సారి గెలవబోతున్నామనీ, ఎన్నికలతర్వాత తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ ప్రజలను నమ్మించేందుకు బీజేపీ నాయకులు ఆడుతున్న ఆట వారికి అనుకూల ఫలితం ఇవ్వాలంటే మునుగోడులో రెండో స్థానంలోనైనా బీజేపీ నిలబడాలి. తెలంగాణలో అతి బలీయమైన ద్వితీయ పక్షంగా బీజేపీ నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఆ తర్వాత టీఆర్ఎస్ ను ఓడించడమే తరువాయి. ముందు టీఆర్ఎస్ ను ప్రథానంగా సవాలు చేసే పార్టీగా కాంగ్రెస్ ను ఆ స్థానం నుంచి తొలగించాలి. 2023 ఎన్నికలలో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉండాలి.  బీజేపీకి బలమైన రెండో స్థానం లభించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. టీఆర్ఎస్ నుంచో, కాంగ్రెస్ నుంచో, రెండు  పార్టీల నుంచో ఎంఎల్ఏలను కొనుగోలు చేయగలదు. ఆ పని లోగడ గోవాలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో చేసింది. దానికి ఇదేమీ కొత్త కాదు. విలువలంటూ ఏమీ లేవు అడ్డురావడానికి.

తెలంగాణ ప్రజలలోనే ఒక అభిప్రాయంఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా వారు పార్టీలో ఉండరనీ, టీఆర్ఎస్ లోకి ఎగిరి గంతేస్తారనీ అనుమానం బలంగా ఉన్నది. 2018లో ఎన్నికైన కాంగ్రెస్ ఎంఎల్ఏలలో మెజారిటీ ఎంఎల్ఏలు టీఆర్ఎస్ లోకి దూకి జంప్ జిలానీలుగా పేరుమోశారు. వారిలో కొందరు కేసీఆర్ మంత్రివర్గంలో సభ్యులుగా విరాజిల్లుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపైన పోటీ చేసి, గెలిచిన వెంటనే పార్టీని వీడి వైరిపక్షంలో చేరినవారి వైఖరిని ఖండించడం కానీ, నిరసన తెలపడం కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. పౌరసమాజం సైతం ఉదాసీనంగానే ఉంది. నిరసన ప్రకటించలేదు. ప్రజలలో కనిపిస్తున్న ఆలోచన ఏమంటే ఎవరైనా టీఆర్ఎస్ ను ఓడించాలని పట్టుదలగా ఉంటే వారు బీజేపీకి ఓటు వేయాలి. అదే విధంగా, బీజేపీని అధికారంలోకి రానీయకుండా అడ్డుకోవాలని ఎవరైనా గట్టిగా అనుకుంటే వారు టీఆర్ఎస్ కి ఓటు వేయాలి.  ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, అధికారంలో కొనసాగడానికి అవసరమైన సరంజామా అంతా కలిగి ఉన్నది. మరో వదంతి కూడా వినిపిస్తోంది. కానీ ఆ వదంతి అంత పెద్దగా ప్రచారంలో లేదు. అదేమంటే బీజేపీపైనా, నరేంద్రమోదీపైనా కేసీఆర్ వేస్తున్న చిందులు అన్నీనాటకాలేననీ, వారిద్దరు ఒక్కటేననీ, ఆయన దిల్లీలో,  ఈయన హైదరాబాద్ లో అధికారంలో ఉంటూ కాంగ్రెస్ ను ధ్వంసాయమానం చేయాలనే వ్యూహం పన్నారనే సిద్ధాంతం. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నిత్యం బీజేపీపైనా, మోదీపైనా నిప్పులు చెరగడం గమనించిన తర్వాత ఆ సిద్ధాంతాన్ని విశ్వసించేవారి సంఖ్య తగ్గింది. కానీ ఇప్పటికీ ఆ సిద్దాంతాన్ని పట్టుకొని వేళ్ళాడేవాళ్ళు ఎంతో కొంతమంది లేకపోలేదు.

టీఆర్ఎస్ తో కాంగ్రెస్ సంబంధాలు ఎట్లా ఉన్నాయో, ఎట్లా ఉండబోతున్నాయో అనే విషయంపైన రాహుల్ గాంధీ వరంగల్లు సభలో చాలా స్పష్టతనిచ్చారు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దానికి భిన్నంగా దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నాటుతున్నఅనుమానపు బీజాలు పెరిగి వృక్షాలయ్యే విధంగా ఉన్నాయి. టీఆర్ఎస్ పైన పోరాటం చేసే విషయంలో కాంగ్రెస్ అంత ఏకాగ్రచిత్తంతో వ్యవహరించడం లేదంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇచ్చే విధంగా దిగ్విజయ్ సింగ్ ప్రకటన ఉన్నది. దీనివల్ల రేవంతరెడ్డి పని మరీ కష్టభూయిష్టం అవుతుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ-3 ఆవిర్భవిస్తే దానికి టీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందని ఇప్పటి నుంచే జాతీయ కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తే తెలంగాణలో అసలుకే ముప్పు వస్తుంది. దిగ్విజయ్ సింగ్ ఎంత అమాయకంగా మాట్లాడారంటే వైఎస్ఆర్ సీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం యూపీఏను బలపర్చవచ్చనీ, ఎందుకంటే ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ వాది వైఎస్ రాజశేఖరరెడ్డి కడుపున పుట్టాడనీ దిగ్వజయ్ సింగ్ అన్నారు.

భారతంలో కర్ణుడికి ఆరు శాపాలు ఉన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ కు అనేక శాపాలు ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్ ప్రకటన తాజా శాపం.

రాహుల్ గాంధీ తెలంగాణలో పదిరోజుల దాకా నడవబోతున్నారు కనుక ఆయన సమయం, సందర్భం చూసుకొని టీఆర్ఎస్ తో కాంగ్రెస్ సంబంధాలపైన మరోసారి స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదా, సందర్భం కల్పించుకొని అయినా ప్రకటన మాత్రం చేయాలి. అదే సమయంలో దిగ్విజయ్ సింగ్, చిదంబరం వంటి సీనియర్ నాయకులకు అడ్డదిడ్డమైన ప్రకటనలు చేయరాదని కూడా రాహుల్ గట్టిగా చెప్పవలసి ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles