- కెనెడా, ఆస్ట్రేలియాల ముందంజ
- గూగుల్, ఫేస్ బుక్ ల ఆధిపత్యం తగ్గాలి
సంప్రదాయ మీడియా వేదికలకు సమాంతరంగా డిజిటల్ మీడియా ఎదుగుతూ వస్తోందన్న విషయం చాలామంది అనుభవం ద్వారా గమనిస్తున్న అంశమే. ఇప్పుడు దాని పరిధి దాటి విస్తారంగ విస్తరిస్తోంది. కరోనా ముసిరిన కాలంలో మరింత తలుపులు తెరుచుకున్నాయి. అనంతరం ఇంకా ఉధృతి పెరిగింది. దీని రూపం త్వరలోనే విక్రమస్వరూపం దాలుస్తుందని అందరూ వేస్తున్న అంచనా. ఆండ్రాయిడ్ వ్యవస్థ ఊపందుకున్న నేపథ్యంలో, అరచేతిలోనే సమస్తం దర్శించుకొనే సంస్కృతిలోకి సమస్త ప్రపంచం వచ్చింది. ప్రింట్ మోడ్ లో ఉన్న పేపర్లు, టీవీలో వచ్చే ఛానల్స్ ను చూడడం లేదని దాని ఉద్దేశ్యం కాదు. కానీ, పాఠకుల, వీక్షకుల అలవాట్లు శరవేగంగా మారిపోతున్నాయి. మొబైల్ ఫోన్లు లేని వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. ఈ పరిణామాలను గమనిస్తున్న మీడియా వర్గాలు అందుకు అనుగుణంగా డిజిటల్ వేదికలను సమాంతరంగా పెంచుకుంటూ వెళ్తున్నాయి. మరికొందరు డిజిటల్ మీడియాను మాత్రమే నడుపుతున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామం.మన దేశంలోని కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు సభ్యులుగా ఉంటూ ‘డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్’ (డీ ఎన్ పీ ఏ )ను స్థాపించారు. వీరందరూ తరచూ సమావేశమవుతూ వుంటారు. సాధకబాధకాలు, కష్టనష్టాలు చర్చించుకుంటూ ఉంటారు.
Also read: జాతీయ హోదా ఎలా?
ఆదాయం విషయంలో వివాదాలు
ముఖ్యంగా బిగ్ టెక్ కంపెనీల ఆధిపత్యం, తమకు జరగాల్సిన న్యాయం, దక్కాల్సిన లాభంపై వారంతా ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కూడా కొన్ని సమావేశాలు జరిగాయి. వెబినార్ రూపంలో జరుగుతున్న సందర్భాల్లో విదేశీ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటూ వుంటారు. ప్రస్తుతం 17 భారతీయ సంస్థలు ‘డీ ఎన్ పీ ఏ’లో సభ్యులుగా ఉన్నాయి. కంటెంట్ ను ప్లాట్ ఫార్మ్స్ పై పెడుతూ ప్రసారం/ప్రచురణతో పాటు ఆదాయాన్ని పంచే వ్యవస్థలు /సంస్థలు – డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ మధ్య అనుబంధం ఆరోగ్యకరంగా సాగడమే ప్రధానమైన ఉద్దేశ్యం. మనతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా మొదలు అనేక దేశాల్లో సంబంధిత వ్యవస్థల మధ్య ముఖ్యంగా ఆదాయం విషయంలో వివాదాలు నెలకొంటున్నాయి. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కొన్ని పరిష్కారాలను పొందినట్లుగా తెలుస్తోంది. మిగిలిన దేశాలకు కూడా విస్తరణ జరగాలన్నది అందరి అభిలాష. బిగ్ టెక్ కంపెనీల జాబితాలో ప్రధానంగా గూగుల్, అమెజాన్ కనిపిస్తున్నాయి. కంటెంట్ ను వాడుకుంటున్న ఈ సంస్థలు న్యూస్ పబ్లిషర్స్ కు ఆదాయాన్ని పంచడంలో అన్యాయం జరుగుతోందన్నది ప్రధాన చర్చనీయాంశం. ఆయా దేశాల ప్రభుత్వాల సహకారం మీడియా సంస్థలకు అందాల్సివుంది. చట్టాలను రూపొందించడం, అమలు చేయడం, సంస్థలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించడం నిజంగానే ప్రభుత్వాల బాధ్యత. ఏఏ దేశాల్లో ప్రభుత్వాలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయో తెలుసుకోవడం కూడా కీలకం. మీడియా సంస్థలన్నీ కలిసి తమ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇది మంచి పరిణామామే. కాకపోతే ఆచరణ విషయంలో ఐకమత్యం పట్ల అనుమానాలు కూడా లేకపోలేదు.
Also read: దిల్లీలో కేజ్రీవాల్ హవా
అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులు పాటించాలి
ఈ మొత్తం ఎపిసోడ్ లో అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్ధతులను అనుసరించడమే తరుణోపాయం. కంటెంట్ షేరింగ్ విషయంలోనూ ఒక కూటమి ఏర్పడడం అవసరంగా మీడియా సంస్థలు గుర్తిస్తున్నాయి. కెనడాలో తీసుకురాబోతున్న చట్టాలు బలంగా, పారదర్శకంగా ఉంటాయనే విశ్వాసాన్ని డీ ఎన్ పీ ఏ సభ్యులు వ్యక్తం చేసినట్లు సమాచారం. మీడియా సంస్థలు – టెక్ కంపెనీల మధ్య జరిగే ఒప్పందాలు, వాటి అమలు తీరే కీలకం. ప్రచురణకర్తలను విభజించి పాలించాలనే వ్యూహంలో గూగుల్ ఉన్నట్లు వీరందరూ భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడాలో అమలవుతున్న విధానాలే భారత్ లోనూ రావాలన్నది వీరి ఆకాంక్ష. టెక్ కంపెనీలు – పబ్లిషర్స్ మధ్య బేరసారాలు ఉండాలన్నది వీరందరి అభిమతం. ఆదాయం పంపకంలో పారదర్శకత ముఖ్యం. చట్టాలు తీసుకువచ్చినా పేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు అవి తమకు వర్తించకుండా మీడియా పబ్లిషర్స్ తో ఒప్పందాలు చేసుకుంటున్నాయనే మాటలు వినబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బిగ్ టెక్ కంపెనీలు దారికి రావడం అంత తేలిక కాదు. మీడియా సంస్థలన్నీ ఏకమై చట్టాలను తెచ్చుకోవాలి. ఆదాయంతో పాటు కంటెంట్ లో నాణ్యత పెరగడం అతి ముఖ్యం. భారతదేశంలో డిజిటల్ మీడియాను నడుపుతున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమందికి ప్రధాన ఉపాధి మార్గంగా అవతరించింది. డిజిటల్ మీడియా సంఘంలో ఏదో పది పెద్ద సంస్థలు సభ్యులుగా చేరి నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. చిన్నాపెద్ద అందరికీ వర్తించేలా, ఆదాయం పెరిగేలా, గుర్తింపు, రక్షణ కలిగేలా వీరంతా వ్యవహరించాలి. మీడియా సంస్థలు -టెక్ కంపెనీలు – ప్రభుత్వాలు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్ పరంగా చూస్తే డిజిటల్ మీడియా షేర్ రోజురోజుకూ పెరుగుతోంది. మీడియా అన్ని ముఖాల్లోనూ సర్వశక్తివంతమయ్యే రోజుల కోసం ఆశాభావంతో ఎదురుచూద్దాం.
Also read: చెలరేగుతున్న సరిహద్దు వివాదం