వోలేటి దివాకర్
శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారు ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన వైద్య కేంద్రమైన రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వచ్చి దివ్యాంగ ధ్రువీకరణ(సదరమ్) పత్రంతో వెళ్లవచ్చు. కొన్ని సార్లు దివ్యాంగులు వచ్చినా ఈ ధ్రువీకరణ పత్రం దక్కకపోవచ్చు. ఇందులో మాయా లేదు… మర్మం లేదు. సిబ్బంది చేతివాటమే. ఇందులో వై ద్యులకు కూడా వాటా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాల్లో ఎంతో మంది దివ్యాంగులు ఇబ్బందులకు, అన్యాయాలకు గురికాగా… సవ్యాంగులు మాత్రం ప్రభుత్వ పెన్షన్లు, రాయితీలు పొందుతున్నారు. బహుశా కొద్దిరోజుల క్రితం ఒక మధ్యవర్తి తారసపడ్డాడు. ఆవ్యక్తిని సదరమ్ సర్టిఫికెట్ల గురించి ఆరా తీయగా ఆసుపత్రికి కూడా వెళ్లకుండానే సర్టిఫికెట్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. ఆధార్ కార్డు నకలు తనకు ఇస్తే చాలని చెప్పాడు. అయితే ఇందుకు రూ. 15వేలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లి తీసుకోవాలంటే రూ. 5వేల వరకు ఖర్చు అవుతుందన్నాడు. అంటే సదరమ్ ధ్రువీకరణకు రూ. 5 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారన్న విషయం స్పష్టమైంది. సవ్యాంగులకు సరే…దివ్యాంగులను కూడా సదరమ్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులకు గురిచేయడం దారుణం కదా.
తప్పుడు దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన వ్యవహారంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే సిబ్బందిని పక్కన పెట్టారు. అధికారపార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధికి సన్నిహితుడైన వ్యక్తి కుమారుడు వర్ధన్ అనే యువకుడు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు రావడంతో అతడ్ని పక్కన పెట్టారు. రైతుబజార్లో పావలా ఎక్కువకు కొత్తి మీర కట్ట అమ్మినా వార్త రాసే ఒక పత్రికా విలేఖరి భార్య కూడా ఈ వ్యవహారంలో ఉండటంతో ఆమెను కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ పక్కన పెట్టారు. సదరు వర్ధన్ మళ్లీ తనను సదరం విభాగానికి పంపేలా ఆసుపత్రి అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ ధ్రువీకరణ పత్రాల జారీపై విచారణ జరిపితే వేలాది మంది సవ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పెన్షన్ల రూపంలో ప్రభుత్వ ఖజానాపై లక్షలాది రూపాయల భారం కూడా తగ్గుతుంది. అలాగే నిజమైన దివ్యాంగులకు ఇప్పటికైనా సరళతరంగా ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశాలు ఉంటాయి.