* నారపరాజు కు శల్య సారధ్యాలు?
ఇప్పుడు రాష్ట్రం దృష్టంతా మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికపై ఉంది…రాజకీయం అంటేనే గెలుపు ఓటముల సమ్మేళనం. ఇక్కడ పోటీ ఉంది అంటే టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న పీవీ తనయ వాణి దేవీ, బిజెపి అభ్యర్థి నారపురాజు రామచందర్ రావు మధ్యే! అన్నీ రాజకీయ పక్షాలను చీల్చి చెండాడే ప్రొఫెసర్ నాగేశ్వర్ దూకుడు తక్కువేమీ లేదు. వీరు కాకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ బీజేపీ, టిఆర్ఎస్ ల ఎత్తులు జిత్తుల ముందు మిగతా పార్టీ అభ్యర్ధులు వెనుక బడిపోయారు. పట్టభద్రులు విచక్షణ కు ఒక సవాల్ గా నిలుస్తున్న ఈ ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు లేక పోవడం గొప్ప పరిణామం. వందేళ్ల పీవీ ని మరిచి పోతున్న తరుణంలో తెర మీదకు తెచ్చింది కేసీఆర్. పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రకటించిన రోజు ఎమ్మెల్సీ ఎన్నిక ఊసే లేదు. గత ఆర్నెళ్లుగా రామచందర్ రావు తన ఓటు బ్యాంకు నిర్మాణం లో నిమగ్నమయ్యారు. గెలుపు తనదే నన్న ధీమాతో ఉన్న ఎన్ ఆర్ ఆర్ ఒక్క సారిగా వాణి దేవి రూపేణా ప్రత్యర్థి వచ్చే సరికి కాస్త తడబాటు పడ్డారు. అసలు వాణీదేవి కి కూడా అర్థం కానీ రూపంలో ప్రజా క్షేత్రంలో నిలిచే పరిస్థితి వచ్చింది!
పీవీకి సొంత కేడర్ ఎన్నడూ లేదు
పీవీకి మొదట్నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ , తెలంగాణ లో గానీ సొంత కేడర్ లేదు. ఆయనను ఒక మేధావి వర్గంగా ముద్ర వేశారు. ఆయన కున్న అర్హతల్లా జ్ఞానం! తన కుమార్తెల పేరు కూడా అమ్మ వారి పేరు వచ్చేలా పెట్టారు! ఆయన తన పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివించారు. సరస్వతి మాత ఆయన కుటుంబానికి బోలెడంత విద్యాదానం చేసింది… మగపిల్లల్లో రంగారావు గారు, రాజేశ్వర రావు గారు రాజకీయాల్లో పదవులు అలంకరించినా కూడా మాస్ పబ్లిక్ కేడర్ లేదు… ఒక వర్గాన్ని పెంచి పోషించలేదు. పీవీ పీఎం గా ఉన్నప్పుడు కూడా వందిమాగధులకు ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. అప్పటి ముఖ్యమంత్రుల మంత్రి వర్గం బెర్త్ కోసం పీవీ దగ్గరికి వెళ్లిన మాజీ మంత్రులను కూడా నవ్వి సమాధాన పరిచి పంపారు తప్పా కోట్ల విజయభాస్కర రెడ్డి, భవనం వెంకట్రామ్ , టి.అంజయ్య, వైఎస్ లకు ఫలానా వారిని తీసుకొమ్మని సిఫార్సు చేసిన దాఖలాలు లేవు.
Also Read : రాజకీయాల్లోనూ అసమానతలు
అవమానాలు భరించారు
ఇక బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వెంగళరావులు పీవీని అంతగా దగ్గరికి తీయలేదు. అలా అని ఈయన వారికి దగ్గర కావాలని ప్రయత్నించనూ లేదు. అవమానాలు భరించారు. పూల వర్షం కురిపించుకున్నాడు. సాక్షాత్తు ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి తో కలసి వెళ్లి పీవీ ని కలుసుకున్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పాలనాపరమైన విషయాలు చర్చించి తన హయంలో జరిగిన భూ సంస్కరణలు…తాము చేయబోయిన పనులకు ఆ కాలంలో జరిగిన ఆటంకాలు చర్చించారట. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన తరువాత ఎన్టీఆర్ వేకువ జామున పీవీ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో జరిగిన పథకాలను సమీక్షించారని అలనాటి అసెంబ్లీ మినిట్స్ ను తిరగేసారని కొంత మంది ఐ ఏఎస్ లు అనుకునే వారు.
కీలక నిర్ణయం తీసుకున్న వాణీదేవి
అందులో నిజనిజాలు ఎమున్నా ఆయన రాజకీయంగా అటువంటి సంఘటనలను ఉపయోగించుకోలేదు. ఈ మౌన ముని కడుపున బుట్టిన వాణిదేవి ఈ నాటి రాజకీయాలకు అనుగుణంగా ఒక స్టెప్ వేశారా? కేసీఆర్ తన తండ్రికి ఇచ్చిన గౌరవం ముందు తన గెలుపు ఓటములు ఒక లెక్క కాదని భావించారా? కేసీఆర్ బయట ప్రపంచానికి తెలియకుండా మొదట ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి నప్పుడు కొన్ని గంటలు ఆలోచించుకునే సమయం ఇచ్చారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి…వాణి అప్పటి కప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు! తన కూతుళ్ళనూ, అల్లుళ్ళనూ అడిగి ఒక నిర్ణయానికి రావచ్చు రాక పోవచ్చు కానీ “సబ్ గా సున్ నా అప్న కర్ నా” అన్న చందంగా కేవలం ఆరు గంటల్లో ఆమె నిర్ణయం కేసీఆర్ గారికి తెలిపారనే దాంట్లో వాస్తవం ఏముందో తెలియదు కానీ కేసీఆర్ కు ఒక రాజకీయ అస్త్రం పీవీ కుటుంబం నుండి దొరికింది.
Also Read : హుందాగా సాగని ప్రచారం
ప్రశ్నించే గొంతు
ఇక ఎన్ ఆర్ ఆర్ నమ్ముకున్న నినాదం “ప్రశ్నించే గొంతు” తనను గెలిపిస్తే పట్టభద్రుల కోరికలు తీరుస్తానని చెప్పే ఆయనకు మేము ప్రశించే గొంతుకులం కాదా? అని పోటీ చేస్తున్న వారి ప్రశ్న! అయితే గెలుపు అవకాశాలు ఎన్ ఆర్ ఆర్ కే ఉన్నాయని చెబుతున్న ప్రత్యర్థులు కూడా వాణి సున్నితంగా తన నాన్న పేరు వాడుకోవడం, ప్రత్యర్థులను పల్లెత్తు మాట ఆనక పోవడం..”మీరు సభకు పరిచయం చేసుకుని వెళ్ళండి…మేము రాజకీయ అస్త్రాలు సంధిస్తామని” చెబుతూ, కేటీఆర్, హరీశ్ రావు, ఇతర మంత్రులు బిజెపి పై విసురుతున్న సవాళ్ళతో బిజెపి కేడర్ వారి ప్రశ్నలకు జవాబు చెప్పలేక కొద్దిగా కంగారు పడుతున్నారు..
ఎమ్మెల్సీ కాకపోతే ఎంపీనా?
ఈ దశలో పీవీ తనయకు రాజ్యసభ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఏమిటని ప్రశించడం చూస్తే వాణి సేఫ్ గేమ్ అర్థ మవుతోంది…ఎమ్మెల్సీ గా గెలిస్తే ఆరేళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి అయ్యే అవకాశం…లేదా ఓడితే కేసీఆర్ తమకు అన్యాయం మాత్రం చేయడు… వచ్చే ఆర్నెళ్లల్లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో పీవీ కుటుంబానికి రిజర్వ్ అయినట్టే అనే సంకేతాలు మెల్లిమెల్లిగా కేసిఆర్ మైన్డ్ గేమ్ సెట్ చేయడం వల్ల వాణి పవర్ గేమ్ కు రెక్కలు వచ్చాయి. ఈ దశలో ఎన్ ఆర్ ఆర్ గారు విజయపథంలో ముందున్న అనే ధీమా ను వదలాలి… ఆయన నమ్ముకున్న కొంత మంది ఇప్పుడు శల్య సారథ్యం చేస్తున్నారని అంటున్నారు. ఆయనకు బీజేపీలో పెద్ద దిక్కు అవసరం ఏర్పడింది. ఆయనకు రాజకీయాల్లో పీవీలాగా గాడ్ ఫాదర్ లేడు. ఆయన నమ్మే ఆయన పేరులోనే ఉన్న రాముడే ఆయనకు దిక్కు. బిజెపి అయోధ్య రామాలయం నినాదం హిందుత్వ పట్టభద్రుల ఓట్లు పై ఎన్ ఆర్ ఆర్ కు పెద్ద ఆశలు ఉన్నాయి…దేవీ ప్రసాద్ లాంటి దిగ్గజాన్ని ఓడించి, తెలంగాణ ఉద్యోగ సంఘాల సెంటిమెంట్ ను తన వైపు తిప్పుకున్న రాం చందర్ రావు మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలుపు బాటలో ఉండడానికి తన సర్వ శక్తులు వినియోగిస్తున్నారు. వాణికి కేసీఆర్ అండ ఉంది.
Also Read : సాగర్ లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్
కేంద్రం హామీ ఇస్తుందా?
ఇక తనకు ఏకంగా మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ కేడర్ ను అప్రమత్తం చేస్తేనే ఇప్పుడు బిజెపి తమ సీటు దక్కించు కుంటుంది. ఒక్కరా ఇద్దరా? రాష్ట్ర మంత్రి వర్గం మొత్తం ఐదు లక్షల ఓట్ల వేటలో పడ్డప్పుడు, ఎన్ ఆర్ ఆర్ బిజెపి ఆఫీసులో కూర్చోని వ్యూహాలు చేసే బదులు క్షేత్ర స్థాయిలో వాళ్లను కార్యోన్ముఖులను చేయాలి. ఎక్కడా లోటు లేకుండా ఓటర్ స్లిప్పులో తన వారు ఉన్నారన్న ధీమా ఎన్ ఆర్ ఆర్ విడిచి పెట్టి తన నినాదాన్ని సరికొత్తగా వినిపించాలి. పట్టభద్రుళ్ళో రాజకీయ చైతన్యం ఎక్కువ. పోయిన సారి కన్నా టఫ్ గా తయారైన ఈ ఎన్నిక లో ఓటు బ్యాంకు ను మార్చుకునే విధంగా కేంద్రం నుండి ఒక హామీ ఇప్పించాలి. ఆ హామీ నిరుద్యోగ భృతి లాగా లేదా ఉద్యోగ కల్పన లాగా ఉండాలి. తాత్కాలిక హామీలకు పట్టభద్రులు ఓటేయ్యారు..వారికి దీర్ఘ కాలిక ప్రయోజనాలు కావాలి.
బ్రాహ్మణ ఓట్ల చీలిక
ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఉద్యోగ వర్గాన్ని దగ్గరికి తీస్తున్నాడు. ఇక బ్రాహ్మణ ఓట్లు నిట్ట నిలువునా చీలాయి. ఇద్దరికి చేరి సగం పడడం ఖాయం. ఈ ఎన్నికల్లో ఇవే ఇద్దరి అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ధారణ చేయవచ్చు. నాకు పట్టభద్రులే గాడ్ ఫాదర్ లు అనే నినాదంతో ఎన్ ఆర్ ఆర్ ముందుకు వెళ్ళాలి. పీవీ తనయకు ఉన్న పేరు దేశ మాజీ ప్రధాని కూతురు! అది చాలు.ఆమె జీవితం ఆయన కూతురుగా పుట్టడంలొనే ధన్యమైంది. ఇప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటోంది! స్వతహాగా లెక్చరర్ ఉద్యోగం చేసిన వాణి పిల్లలకు హిత బోధ చేస్తే ఇప్పుడు రాజకీయ హిత బోధ విన వలసి వస్తోంది! పీవీ హయాంలో ఉన్న రాజకీయాలు ఇప్పుడు లేవు.
Also Read : సింగరేణిలో ఎంఎల్సీ ఎన్నికల లొల్లి
నైతిక నియమాలు ఎక్కడ?
గడ్డి వాములో సూది పడవేసి వెతకడం ఎంత కష్టమో ఇప్పుడు నైతిక విలువలు వెతకడం అంత కష్టం. మరో వైపు బిజెపికి పీవీపై ఎంత ప్రేమ ఉందో అందరికి తెలుసు. అయోధ్య పునర్ నిర్మాణం అంటేనే పీవీ పేరు మంచో చెడ్డో వినిపిస్తుంది! ఇలాంటి దశలో వాణిని రాజకీయ విమర్శలకు దూరంగా ఉంచడం టిఆర్ ఎస్ చేసిన మంచి పని. “వ్యక్తుల జీవితాలు వారి వారి సొంతం పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం” అన్న శ్రీ శ్రీ నినాదం వాణికి ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది…కాలేజి గొడవలు, జీతాల గోడవలతో సతమతమైన వాణి వ్యక్తి గత బయోడేటా తో పాటు బురద చల్లే భూ కుంభకోణాలు కోసం ఆరా తీసే వారు ఉండనే ఉంటారు…ఎంత నిజాయితీ గల కుటుంబం నుండి వచ్చినా మనిషి లోని లోపాలు వెతికే ఈ సమాజంలో సున్నిత హృదయులు అయినా వాణిదేవి కానీ రామ చందర్ రావు కానీ తట్టుకునే మనో నిబ్బరం ఈ ఎన్నికలు ఇస్తున్నాయి.
Also Read : టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రంగ ప్రవేశం, బీజేపీలో కలవరం!